CS Review on Independence Day Arrangements : గోల్కొండ కోటపై స్వాతంత్య్ర దినోత్సవానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై వివిధ శాఖలతో సీఎస్ శాంతికుమారీ సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరేడ్ మైదానంలో సైనిక అమర వీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారని, ఆ తర్వాత గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని సీఎస్ తెలిపారు.
స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా శాసనసభ, శాసనమండలి, హైకోర్టు, రాజ్‌భవన్, సచివాలయ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని సంబందిత అధికారులను సీఎస్ ఆదేశించారు. జాతీయ పతాకం ఎగురవేసే ప్రధాన వేదిక వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బీ శాఖకు సీఎస్ శాంతికుమారి తెలిపారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో అతిథులందరికీ కనిపించే విధంగా ఏర్పాట్లు ఉండాలన్నారు.
పారిశుద్ధ్య పనులలో ఎలాంటి లోపాలు ఉండరాదని, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని పురపాలక శాఖను ఆదేశించారు. అంబులెన్స్, నర్సింగ్ అసిస్టెంట్లను అందుబాటులో ఉంచాలని ఆరోగ్యశాఖ అధికారులకు స్పష్టం చేశారు. వేడుకలకు హాజరయ్యే అతిథులు, అధికారులతో పాటు ప్రజలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను కేటాయించడంతో పాటు ట్రాఫిక్ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని పోలీసు శాఖకు సీఎస్ సూచించారు.
అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలని ఫైర్ డిపార్ట్‌మెంట్‌ను, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖను అధికారులను ఆదేశించారు. వెయ్యి మంది కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు సాంస్కృతిక శాఖ అధికారులు సీఎస్ కు వివరించారు. సంప్రదాయ వస్త్రధారణతో కళాకారుల ప్రదర్శనలు వేదికకు వన్నె తెచ్చేలా ఉంటాయని తెలిపారు. ఆగస్టు 13న ఫుల్ డ్రెస్ రిహార్సల్స్, 10వ తేదీ నుంచి రిహార్సల్స్ ఉంటాయన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సీఎస్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీజీపీ జితేందర్, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు, తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగుల వివరాలు త్వరగా ఇవ్వండి : మంత్రివర్గ ఉపసంఘం