Govt Chief secretary Review with Collectors : విత్తనాల బ్లాక్ మార్కెట్, కృత్రిమ కొరతను సృష్టించే వ్యాపారులపై పీడీ చట్టం కింద కేసులను నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. వానాకాలం పంటలకు విత్తనాల సరఫరా, రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్లతో సీఎస్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : వానాకాలం సీజన్‌కు గతేడాది కన్నా ఎక్కువ విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని సీఎస్ తెలిపారు. విత్తనాల పంపిణీపై ఆందోళన చెందవద్దని రైతులకు ఆమె విజ్ఞప్తి చేశారు. అధిక డిమాండ్ ఉన్న పత్తి, సోయా, మొక్కజొన్న హైబ్రిడ్, జీలుగ విత్తనాలు సరిపడా ఉన్నాయన్నారు. వ్యవసాయ, రెవిన్యూ, పోలీస్ శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విత్తన గోదాములు, దుకాణాలను తనిఖీ చేయించాలని కలెక్టర్లను ఆదేశించారు.
CS Shanthi Kumari On Seeds Distribution : గోదాములు, విత్తన విక్రయ కేంద్రాలవద్ద పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను నియమించాలన్నారు. జూన్ నెలాఖరు వరకు విత్తన విక్రయాలు కొనసాగే అవకాశం ఉన్నందున కలెక్టర్లు ప్రతీ రోజూ విత్తన పంపిణీలపై సమీక్షించడంతోపాటు ఆకస్మిక తనిఖీలు చేసి స్టాక్ రిజిస్టర్లు, పంపిణీ విధానాన్ని పరిశీలించాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల రైతులు వచ్చి ఇక్కడి విత్తనాలు కొనుగోలు చేయకుండా నివారించాలని సీఎఎస్ ఆదేశించారు. విత్తనాల లభ్యతపై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలన్నారు.
Minister Thummala Review On Seeds Distribution : మరోవైపు ఇదే అంశంపై సచివాలయంలో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. నకిలీ విత్తనాల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఎరువులు, విత్తనాలు రైతులకు అందించే బాధ్యత కలెక్టర్లదేనని ఆయన స్పష్టం చేశారు. పత్తి, పచ్చిరొట్ట, విత్తనాల పంపిణీపై సమీక్షించారు. కలెక్టర్లు, అధికారులు విస్తృతంగా పర్యటిస్తూ తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాల్లో రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించండి : జూన్ 2 న రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ప్రభుత్వ ఘనంగా నిర్వహిస్తున్న వేళ జిల్లాల్లోనూ ఈ వేడుకలు నిర్వహించాలని కలెక్టర్లకు సీఎఎస్ ఆదేశించారు. అమరులకు కలెక్టర్లు నివాళులు అర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించాలన్నారు.