Crop Damage in Nizamabad : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల క్రితం కురిసిన భారీ వడగండ్ల వానతో అన్నదాతకు తీరని నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో అకాల వర్షాల కారణంగా పంటలు దెబ‌్బతిన్నాయి. చేతికందే దశలో పంటలు వర్షం పాలు కావడంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. కొన్ని రోజుల్లో పంట దక్కుతుందని అనుకుంటే వాన మొత్తం ఊడ్చేసిందని ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల పరిధిలో వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.
కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లితే ఒక్క కామారెడ్డి జిల్లాలోనే 20వేల ఎకరాలకు పైగా పంటలను రైతులు కోల్పోవాల్సి వచ్చింది. వడగళ్ల, ఈదురు గాలులతో కూడిన వానలతో రైతన్నలు పూర్తిగా నష్టపోయారు. వరి, జొన్న, మొక్కజొన్న, మామిడి, బొప్పాయి, కూరగాయ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరి పంట చేతికందే సమయంలో కురిసిన రాళ్ల వానతో చాలా గ్రామాల్లో వరి గింజలు పూర్తిగా రాలిపోగా, కొన్నిచోట్ల పంట నేలకొరిగింది.
Crop Loss in Kamareddy : కామారెడ్డి, బీబీపేట, బిక్కనూరు, దోమకొండ, రాజంపేట, పాల్వంచ మండలాల్లో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం 14 వేల 553 మంది రైతులకు సంబంధించి 20వేల 71 ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ అధికారుల అంచనా. 16 వేల 298 ఎకరాల్లో వరి, 2 వేల 784 ఎకరాల్లో మొక్కజొన్న, 705 ఎకరాల్లో జొన్నతో పాటు ఇతర పంటలూ దెబ్బతిన్నాయి.
"ఎకరాకు రూ.30వేల నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టాం. వడగళ్ల వాన వల్ల చేతికి వచ్చిన పంట అంతా నష్టపోయాం. ప్రభుత్వం ఎకరాకు కనీసం రూ.10వేలన్న సహాయం చేయాలి. అప్పుల సమస్య ఎక్కువైంది. సమస్యలు పెరిగిపోయాయి. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి." - బాధిత రైతులు
నిజామాబాద్ జిల్లాలో 6 వేల 58 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ అధికారుల ప్రాథమిక అంచనాలో తేలింది. 44 గ్రామాల్లో 3 వేల 76 గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేయగా అత్యధికంగా 5 వేల 661 ఎకరాల్లో వరి పంటకు నష్టం వచ్చినట్టు గుర్తించారు. పంట నష్టంపై కామారెడ్డి జిల్లాలో రైతులు జాతీయ రహదారిపై ఆందోళన సైతం చేశారు. జిల్లా ఇంఛార్జి మంత్రి కృష్ణారావు ఉమ్మడి జిల్లాలో పంటలను పరిశీలించి ఆదుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా పంటలు కోల్పోయి దెబ్బతిన్న తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
"పంట నష్టంపై నివేదిక రాగానే నష్టపోయిన రైతాంగానికి వాళ్ల ఖాతాల్లో ఎకరానికి రూ.10వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. మరోసారి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కడ జరిగినా రైతులు నష్టపోకుండా ఉండేందుకు క్రాప్ ఇన్సూరెన్స్ చేసి దానికి సంబంధించిన ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది." - జూపల్లి కృష్టారావు, మంత్రి