Cricketer Nitish Kumar Reddy Success Story : నితీశ్ కుమార్‌రెడ్డి ఇప్పుడు ఈ పేరు క్రికెట్ ప్రపంచమంతా మార్మోగుతోంది. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో శతకం చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. దిగ్గజాల ప్రశంసలు అందుకున్నాడు. ఇతడి పరుగుల ప్రభంజనానికి కడపలోనే అడుగులు పడ్డాయి. అక్కడ అకాడమీలో నాలుగేళ్లపాటు క్రికెట్‌లో కఠోర శిక్షణ తీసుకోవడమే కాకుండా కొంతకాలం చదువుకున్నాడు కూడా. ఈ నేపథ్యంలో జిల్లాతో అతడి అనుబంధంపై ప్రత్యేక కథనం.
క్రికెటర్ నితీశ్ కుమార్‌రెడ్డి శిక్షణ సమయంలో 50-55 పరుగులు చేసి వెనుతిరిగేవాడని అతడి హెడ్ కోచ్ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. అతడిలో పట్టుదల పెంచేందుకు 'నువ్వు శతకం ఎప్పుడు కొడతావో అప్పుడు నాతో మాట్లాడు' అని చెప్పి రోజూ శిక్షణలో మెలకువలు నేర్పించినట్లు హెడ్ కోచ్ గుర్తుచేసుకున్నారు. అప్పుడు నితీశ్ నెల రోజుల తర్వాత 125 పరుగులు చేసి మీతో మాట్లాడొచ్చా సార్ అన్నాడు. అప్పుడు భుజం తట్టి ‘ఐ వాంట్ దిస్ ఫైర్ ఫ్రం యు’ అని చెప్పానని వివరించారు. అప్పటి నుంచి నితీశ్ కుమార్‌రెడ్డి వెనక్కి తిరిగి చూడలేదని వైఎస్సార్ జిల్లా లింగాల మండలం గుణకనపల్లెకు చెందిన హెడ్ కోచ్ పోచమరెడ్డి మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.
గేమ్ ఛేంజర్‌గా తెలుగు కుర్రాడు నితీశ్- ఇదే కంటిన్యూ చేస్తే ఆ అవార్డు పక్కా!
మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో శతకం బాది తెలుగు వారి సత్తా చాటిన క్రికెటర్ నితీశ్‌కుమార్‌రెడ్డి హెడ్ కోచ్ మధుసూదన్‌రెడ్డిని ‘న్యూస్‌టుడే’ పలకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. "నితీశ్‌కుమార్‌రెడ్డి శతకం కొట్టడం ఎంతో గర్వంగా ఉంది. అతడిలో కసి, పట్టుదల ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగాడు. 13 ఏళ్ల వయసులో అతడి తండ్రి ముత్యాలురెడ్డి కడపలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు వచ్చి నా కొడుకును ప్రయోజకుడిని చేయాలని కోరారు. నేను నేవీలో విధులు నిర్వహిస్తూ 2012లో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కడపలోని వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో చేరాను. 2013 జనవరిలో నితీష్‌కుమార్‌రెడ్డి తన ప్రస్థానం ప్రారంభించాడు. మొత్తం నాలుగేళ్లు ఇక్కడ శిక్షణ తీసుకున్నాడు. ఆ సమయంలో అతడికి ఆటలో మెళకువలు నేర్పించాను. ముఖ్యంగా మన వైఖరి ఎలా ఉండాలి, ఆడే విధానం, వ్యూహ రచన తదితర వాటిని నేర్పించాను." అని మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఒక్క సెంచరీతో ఐదు రికార్డులు- తొలి భారత బ్యాటర్‌గా అరుదైన ఘనత
నితీష్‌కుమార్‌రెడ్డి గురించి అతడి హెడ్ కోచ్ మధుసూదన్‌రెడ్డి చెప్పిన మరిన్ని ఆసక్తికర అంశాలు ఆయన మాటల్లోనే "నితీశ్ తల్లిదండ్రులు స్టేడియం వద్దకు వచ్చి తమ కుమారుడిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేవారు. అతడికి మంచి భవిష్యత్తు ఉందని, తప్పకుండా శిక్షణ ఇచ్చి ప్రయోజకుడిని చేస్తానని మాటిచ్చాను. నితీశ్‌పై వారి తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకుని ప్రోత్సహించారు. అందువల్లే అతడీ స్థాయికి ఎదిగాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా శిక్షణకు నితీశ్ హాజరయ్యేవాడు. ఏదైనా సందేహం వస్తే వెంటనే అడిగేవాడు. రోజుకు వెయ్యి బంతులు ఆడేవాడు. తన 13వ ఏట కడపకు వచ్చి స్టేడియంలో శిక్షణ పొందే సమయంలో కడపలోని గురుకుల్ విద్యాపీఠ్‌లో చదువుకున్నాడు. ఇక్కడే పదోతరగతి వరకు చదివాడు" అని హెడ్ కోచ్ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.
"నితీశ్‌కుమార్‌రెడ్డికి స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అంటే ఎంతో అభిమానం. అతడిని స్ఫూర్తిగా తీసుకొని శిక్షణ పొందాడు. విరాట్‌కోహ్లి బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న సమయంలో నితీశ్‌కుమార్‌రెడ్డికి కూడా బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-16 రాష్ట్రస్థాయి పోటీల్లో ఆడి 1,200 పరుగులు సాధించినందుకు దేశంలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారుడిగా గుర్తించి బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2017-18 అవార్డుకు ఎంపిక చేశారు. కోహ్ల్లితో పాటు అవార్డు తీసుకోవడంతో అతడి ఆనందానికి అవధుల్లేవు. ఆ మధుర క్షణాలను నాతో పంచుకున్నాడు" అని హెడ్ కోచ్ మధుసూదన్‌రెడ్డి వెల్లడించారు.
టెస్టులో సెంచరీ కొట్టిన నితీశ్‌పై చంద్రబాబు ప్రశంసల వర్షం - రూ.25 లక్షలు నగదు ప్రోత్సాహం