CRDA Authority Meeting Chaired by CM Chandrababu: రాజధాని అమరావతిలో స్థలాలు తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు నిర్మాణాలు పూర్తి చేసేందుకు వాటికి రెండేళ్ల గడువు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీయే) 36వ అథారిటీ సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది. అమరావతి విధ్వంసమే లక్ష్యంగా ఐదేళ్లలో సాగిన జగన్ ప్రభుత్వ అరాచకంతో జరిగిన నష్టాన్ని సరిదిద్ది, మళ్లీ రాజధాని నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో పరుగులు పెట్టించే దిశగా అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ, సీఆర్డీఏ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. రాజధానిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం మరోమారు సింగపూర్‌ను సంప్రదించాలని సమావేశంలో తీర్మానించారు. రాజధాని ప్రాంత రైతులు, కూలీలకు కౌలు, పెన్షన్లను మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తూ సీఆర్డీఏ అథారిటీ తీర్మానించింది. ప్రస్తుతం ఇస్తున్న మొత్తాన్నే వచ్చే ఐదేళ్లపాటు చెల్లించేలా నిర్ణయించారు. సీఆర్డీఏ పరిధిని 8 వేల 352.69 చదరపు కిలోమీటర్లకు పెంచుతూ తీర్మానం చేశారు. గత ప్రభుత్వం దీని పరిధిని 6 వేల 993 చదరపు కిలోమీటర్లకు కుదించింది.
పల్నాడు, బాపట్లను కూడా సీఆర్డీఏ పరిధిలోకి తీసుకొస్తూ సమావేశంలో తీర్మానించారు. అయితే పల్నాడు, బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కోర్ క్యాపిటల్ ప్రాంతాన్ని కూడా 217 చదరపు కిలోమీటర్లకు పెంచుతూ సమావేశం నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తగ్గించిన 54 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కూడా తిరిగి కోర్ క్యాపిటల్ పరిధిలోకి తీసుకురావాలని తీర్మానించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. రాజధానిలో నిర్మించిన భవనాల పటిష్ఠత, సామర్థ్యంపై I.I.T. హైదరాబాద్, I.I.T. చెన్నైకి చెందిన నిపుణుల అధ్యయనం తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
కోట్ల రూపాయలతో దుర్గగుడి మహామండపం - దేనికోసమో తెలియట్లేదు! - Maha Mandapam in Vijayawada
MLA, MLC, IAS అధికారుల క్వార్టర్ల భవనాలను అధ్యయనం చేయాల్సిందిగా ఐఐటీ హైదరాబాద్ నిపుణులను కోరినట్లు సమావేశం పేర్కొంది. అలాగే ఐకానిక్ భవనాలైన సచివాలయం, HOD టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల పటిష్ఠత, సామర్థ్యాలను తనిఖీ చేసి నివేదిక ఇచ్చే బాధ్యతను ఐఐటీ చెన్నైకి అప్పగించినట్లు అథారిటీ సమావేశం తెలిపింది. రాజధానిలోని కృష్ణా కరకట్ట మార్గాన్ని నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేసేందుకు కూడా సమావేశంలో నిర్ణయించారు. సీడ్ యాక్సిస్ రహదారిని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానించేలా E-5, E-13, E-15 రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. మంగళగిరి ఎయిమ్స్‌తోపాటు పక్కనే ఉన్న కొండలకు సమీపంలో వీటిని అనుసంధానించనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.
రాజధానిలో గతంలో భూములు ఇచ్చిన 130 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలకు ఇక్కడకు వచ్చి ఆయా సంస్థల కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేలా రెండేళ్ల గడువు పెంచాలని సీఆర్డీఏ సమావేశంసో తీర్మానం చేశారు. కొన్ని ప్రైవేటు రంగ సంస్థలతోపాటు బిట్స్ పిలానీ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. R-5 జోన్ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున న్యాయసలహాల అనంతరం తర్వాతి కార్యాచరణ చేపడతామన్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్డుకు రాష్ట్రం, అవుటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం నిధులు అందిస్తుందని స్పష్టం చేశారు. రాజధాని అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా 6 ఐకానిక్ బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీర్మానం చేశారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు త్వరలోనే టెండర్లు పిలవాలని తీర్మానం చేశారు.
రాజధాని అమరావతిలో ఐఐటీ హైదరాబాద్ నిపుణుల పరిశీలన - IIT Teams Visit Amaravati Today