CP Srinivas Suspend Saidabad ASI Uma Devi : సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా పని చేస్తున్న ఉమాదేవిని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. ఇటీవల హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత సైదాబాద్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదే సమయంలో విధులు నిర్వర్తిస్తున్న ఉమాదేవి, ఆమెకు కరచాలనం చేసి అనంతరం ఆమెను ఆలింగనం చేసుకున్నారు. కాగా సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన ఏఎస్సైని సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
అసదుద్దీన్‌పై మాధవీలత ఫిర్యాదు : మరోవైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌కు మాధవీ లత ఫిర్యాదు చేశారు. గోవధను, బీఫ్‌ను ప్రోత్సహించేలా ప్రసంగిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆమె ఆరోపించారు. బాబ్రీ మసీదు ప్రస్తావనను తెస్తూ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. అసదుద్దీన్ ఒవైసీపై చర్యలు తీసుకోవాలని సీఈవోను మాధవీ లత కోరారు. మసీదుపై బాణం వేసినట్లు పోలీసులు తనపై నిరాధారణ ఆరోపణలతో కేసు పెట్టారని ఆమె విమర్శించారు. తాను బాణం వేసిన తర్వాత ఎక్కడో ఉన్న మసీదును చూపిస్తే దాన్ని తనకు ఎలా అన్వయిస్తారని ప్రశ్నించారు. పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మాధవీలత ఆరోపించారు.
Police Case On BJP MP Candidate Madhavi Latha : ఇదిలా ఉండగా మాధవీ లతపై ఇటీవల కేసు నమోదు అయింది. ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని బేగంబజార్ పోలీస్ స్టేషన్లో షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఈ నెల 20న ఫిర్యాదు చేశారు. ఈ నెల 17న శ్రీరామ నవమి శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంలో బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మసీదుపై మాధవీ లత బాణం వదులుతున్నట్లు వ్యవరించిందని, దాని వల్ల ముస్లింల మనోభావాలు దెబ్బ తిన్నాయని ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. దీంతో మాధవీ లతపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు.
విధుల్లో నిర్లక్ష్యం - ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు - IG Suspended Six Police Officers