Theft in Medak Distrct : మెదక్ జిల్లా రామాయంపేటలో ఓ వృద్ధురాలికి కల్లు తాగించి బంగారు, వెండి ఆభరణాలను కాజేసిన భార్యాభర్తలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రామాయంపేట సర్కిల్ పోలీసు స్టేషన్లో సీఐ వెంకట్ రాజు గౌడ్ మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. గత నెల (నవంబర్) 30వ తేదిన చెల్లాపూర్ గ్రామానికి చెందిన బండ్ల నర్సవ్వ అనే వృద్ధురాలికి మాయ మాటలు చెప్పి మద్యం కల్లు తాగించి ఆమె ఒంటిపై ఉన్న బంగారం, వెండి నగలతో పాటు రూ.30 వేల నగదును ఇద్దరు దంపతులు దొంగిలించారు.
ఈ క్రమంలో బాధితురాలు నర్సవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు రామాయంపేట పోలీసులు తెలిపారు. ఖాజాపూర్ గ్రామానికి చెందిన ధరావత్ శీను, ఆయన భార్య ధరావత్ భూలీలను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఓ మధ్యవర్తి వద్ద తాకట్టు పెట్టిన ఒక జత బంగారం కమ్మలు, గుండ్లు, వెండి కడియాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. అపరిచిత వ్యక్తులను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. ఈ దొంగలను పట్టుకునే విషయంలో సహకరించిన ఆటో డ్రైవర్ మక్కల మహిపాల్‌ను సీఐ ప్రత్యేకంగా అభినందించారు.
మాస్క్ ధరించి బంగారం దుకాణాల్లో చోరీ - చివరికి దొంగను పట్టించిన చెప్పులు!