Cyber Cheating in Anantapur District : కళ్లముందే ఎన్నో మోసాలు, తెల్లవారితే చాలు వార్తల్లో డిజిటల్ అరెస్టులు, వందల సంఖ్యలో సైబర్ నేరాల గురించిన వార్తలు అయినా సైబరాసుల వలలో పడి కోట్లు పోగొట్టుకున్నవారెందరో. ఎప్పటికప్పుడు అధికారులు హెచ్చరిస్తున్నా, తగిన సూచనలు ఇస్తున్నా అత్యాశతో ఈ ఉచ్చులో పడుతున్నారు. కొందరు. ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
Couple Losed 1 Crore In Cyber Fraud : అధిక లాభాలు వస్తాయనే అత్యాశతో అనంతపురం నగరానికి చెందిన దంపతులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ.1.33కోట్లు పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన దంపతులకు ఈ నెల 15న ఫేస్‌బుక్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి పరిచయమయ్యాడు. తమ సంస్థ ఎస్2 జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీస్‌లో చేరితే తక్కువ కాలంలోనే షేర్ల రూపంలో అధిక లాభాలు గడిస్తారని నమ్మబలికారు. ఈ క్రమంలో వీరిని సైబర్ నేరగాళ్ల వాట్సప్ గ్రూప్‌లోకి జాయిన్ చేసుకున్నారు.
స్టాక్ మార్కెట్లో లాభాల ఎర! - కోటి రూపాయలు పోగొట్టుకున్న సివిల్ ఇంజినీర్
సదరు సంస్థ పేరు మీదున్న యాప్‌ను దంపతుల చరవాణుల్లో డౌన్‌లోడ్ చేయించారు. అనంతరం ఐశ్వర్య శాస్త్రి పేరుతో ఒకరు ఫోన్ చేసి దంపతుల బ్యాంకు ఖాతా, ఇతర వివరాలను తీసుకున్నారు. అనంతరం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాలు నాలుగింటిని దంపతులకు ఇచ్చి, వాటిలో డబ్బు జమ చేయాలని తమకు సొమ్ము అందిన వెంటనే గంటల వ్యవధిలో పెరిగిన షేర్ల లాభాలు అసలుతో పాటు వెనక్కి పంపుతామని చెప్పారు. పూర్తిగా నమ్మిన దంపతులు నేరగాళ్లు సూచించిన నాలుగు ఖాతాల్లోకి ఆర్టీజీఎస్ ద్వారా పలు దఫాలుగా రూ.1.33 కోట్లు నగదును బదిలీ చేశారు.
తిరిగి నగదును డ్రా చేయడానికి ప్రయత్నించారు. అవతలి వ్యక్తుల స్పందన లేకపోవడంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు, నేరగాళ్లు సూచించిన సంస్థపై ఆరా తీశారు. అలాంటేదీ లేదని తెలుసుకుని ఖంగుతున్నారు. బాధితులు రెండో పట్టణ పోలీస్‌స్టేషనులో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.