Couple committed suicide in Nizamabad : ప్రస్తుత రోజుల్లో ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఎవరో ఏదో అన్నారని, వారికి సమాధానం చెప్పలేక, పరువు పోయిందనే తొందరలో ఆత్మహత్య ఒక్కటే శరణ్యం అన్నట్లు నూరేళ్ల జీవితాన్ని కొందరు మధ్యలోనే తుంచుకుంటున్నారు. కనీసం ముందూ వెనుక ఆలోచించకుండా క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని కన్నవారికి పుట్టెడు శోకాన్ని మిగుల్చుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మనస్తాపం చెందిన నవ దంపతులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. అంతకు ముందు తమ సూసైడ్‌కు గల కారణాన్ని వివరిస్తూ వీడియో తీసి పోలీసులకు పంపించారు. వారిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్-మిట్టాపూర్ మధ్యలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం హెగ్డోలికి చెందిన అనిల్, శైలజలకు ఏడాది క్రితం వివాహం జరిగింది. కుటుంబంతో కలిసి సొంతూరిలోనే ఉంటున్నారు. అయితే సోమవారం ఉదయం ఓ ఇంటర్వ్యూకు వెళ్తున్నామని కుటుంబీకులకు చెప్పి బయటకు వచ్చారు. అనంతరం తాను ఓ తప్పు చేశానని, దాన్ని భర్త క్షమించినా బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తుండటాన్ని తట్టుకోలేక ఇద్దరం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు శైలజ ఓ వీడియో చిత్రీకరించి కోటగిరి ఎస్సై సందీప్‌కు పంపారు.
'మా పిన్ని వల్లే మేం చనిపోతున్నాం. గతంలో నేను ఓ తప్పు చేశాను. ఆ తప్పును క్షమించిన నా భర్త, అత్తామామలు, ఏనాడూ ఎవరితోనూ ఆ విషయం గురించి చెప్పలేదు. కానీ మా పిన్ని ఈ విషయాన్ని మా బంధువుల్లో చాలా మందికి చెప్పింది. ఎవరికీ చెప్పొద్దని మేం చెప్పినా, బంధువులతో పాటు ఇతరులతోనూ చెబుతోంది. ఆమె చెప్పిన మాటలు విన్న బంధువులు ఏదోదో మాట్లాడితే ఇటీవలే నా భర్త పురుగుల మందు తాగాడు. అయినా ఈ దుష్ప్రచారం ఆగడం లేదు. అందుకే మేం చనిపోతున్నాం. నా చావుకు కారణం మా పిన్నే.' - వీడియోలో శైలజ
రైల్వే ట్రాక్‌పై దంపతుల మృతదేహాలు : వెంటనే ఈ వీడియోపై స్పందించిన కోటగిరి ఎస్సై సందీప్ ఆ వీడియోతో పాటు సెల్‌ఫోన్ నంబరును నవీపేట ఎస్సై యాదగిరి గౌడ్‌కు పంపించారు. దంపతులు ఆత్మహత్య చేసుకునేందుకు గోదావరి వద్దకు వస్తున్నట్లు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు బాసర వంతెన దగ్గరకు వెళ్లి గాలించారు. అక్కడ వారిద్దరు కనిపించలేదు. ఆ తర్వాత బాధితుల ఫోన్ నంబరును ట్రాక్ చేయగా, ఫకీరాబాద్-మిట్టాపూర్ మధ్య ఉన్నట్లు నవీపేట ఎస్సై గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి గాలించగా ఇద్దరి మృతదేహాలు పట్టాలపై కనిపించాయి. రైల్వే పోలీసులకు సమాచారం అందించినట్లు ఎస్సై చెప్పారు.
'నాన్నా నా పరువు పోయింది - అందుకే చనిపోతున్నా' - ఉరేసుకుని జవాన్ ఆత్మహత్య