Corporate Gurukul Schools For Scheduled Caste Students : పెద్ద చదువులు చదివి డాక్టర్, ఇంజినీర్ కావాలనుకునే పేదింటి దళిత బిడ్డల కలలు సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన సాంఘిక సంక్షేమ గురుకులాలను కార్పొరేటు స్థాయికి తీసుకెళ్లేలా అడుగులు వేస్తోంది. ఐఐటీ (IIT), వైద్య విద్య, ఇతర జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఎస్సీ విద్యార్థులు ప్రవేశాలు పొందడమే లక్ష్యంగా ఈ ఏడాది నుంచే కార్పొరేటు విద్యా సంస్థలకు దీటుగా 7 ఐఐటీ-నీట్ కోచింగ్ అకాడమీలను అందుబాటులోకి తీసుకురానుంది.
ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎక్కువ మంది సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు జాతీయ స్థాయి ప్రవేశాల్లో అర్హత సాధించేలా శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే నైపుణ్యం కలిగిన అధ్యాపకులను ఎంపిక చేశారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే తరగతులు ప్రారంభించేలా సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా ఏడు ఐఐటీ-నీట్ కోచింగ్ అకాడమీలు : రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐఐటీ-నీట్ కోచింగ్ అకాడమీలను ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు సంబంధించిన 3 నీట్ -ఐఐటీ కోచింగ్ అకాడమీలున్నాయి. వీటిని కూడా 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అడవితక్కెళ్లపాడు(గుంటూరు), చిన్నటేకూరు(కర్నూలు), ఈడుపుగల్లు(విజయవాడ)లో నెలకొల్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో అదనంగా ఒక్క కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయలేదు.
తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడింటిని అందుబాటులోకి తీసుకువచ్చేలే చర్యలు చేపట్టింది. వీటిని విజయనగరం జిల్లా చీపురుపల్లి, తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం, అనంతపురం జిల్లాలోని బి.పప్పూరు, విశాఖపట్నంలోని శ్రీకృష్ణాపురం, ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ, పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల, చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఏర్పాటు చేయనుంది. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న గురుకులాల్లోనే ఈ అకాడమీలకు అదనపు వసతులు కల్పిస్తారు.
గురుకుల పాఠశాలల ఒప్పంద ఉపాధ్యాయుల విజ్ఞప్తి - పవన్ కల్యాణ్ భరోసా - pawan kalyan takes complaints
1,120 మంది విద్యార్థుల ఎంపికకు అవకాశం : కొత్తగా ఏర్పాటు కానున్న ఐఐటీ-నీట్ కోచింగ్ అకాడమీల్లో 1,120 మంది విద్యార్థులకు శిక్షణ అందించనున్నారు. ఈ ఏడాది ఇప్పటికే విద్యాసంవత్సరం ముగింపునకు వచ్చినందున పదో తరగతి పాసైన విద్యార్థుల నుంచి కాకుండా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల మార్కులు, తల్లిదండ్రుల అంగీకారం ఆధారంగా 560 మంది ఎంపిక చేసి ఉచిత శిక్షణ అందించాలని అధికారులు నిర్ణయించారు.
8 ఏళ్లలో ఐఐటీ, నీట్‌లో 1,614 మంది విద్యార్థుల అర్హత : 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన మూడు ఐఐటీ-నీట్ కోచింగ్ అకాడమీల ఎస్సీ విద్యార్థులకు ఉచిత శిక్షణ కారణంగా ఇప్పటి వరకు 1,614 మంది ఐఐటీ, నీట్ ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించారు. గత 8 ఏళ్లలో జేఈఈ ప్రవేశ పరీక్షలకు ఈ అకాడమీలకు చెందిన 1,261 మంది విద్యార్థులు హాజరుకాగా 800 మంది అర్హత సాధించారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అదనంగా మరో 7 అకాడమీలు అందుబాటులోకి రానుండటంతో దళిత బిడ్డలకు మరింత లబ్ధి చేకూరే అవకాశముంది.
ఉచిత శిక్షణ : పదోతరగతిలో సాధించిన మార్కులను ప్రాతిపదికగా తీసుకుని ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా మెరికల్లాంటి విద్యార్థులను ఎంపిక చేసి ఐఐటీ, నీట్ ప్రవేశ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తారు. సాధారణ గురుకులాలకు భిన్నంగా ఇక్కడి విద్యార్థులకు డిజిటల్ బోధన, ప్రత్యేక స్టడీ మెటీరియల్, ఇతర అత్యుత్తమ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురానున్నారు.
'రాత్రి తలుపు మూసి దుస్తులు లేకుండా డ్యాన్స్ చేయిస్తున్నారు - నేనిక్కడ ఉండలేను నాన్నా'