Continue Industrial Accidents in Joint Visakhapatnam : ఉమ్మడి విశాఖ పరిధిలో పరిశ్రమల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ప్రధానంగా రియాక్టర్ల పేలుళ్లతో ప్రాణ నష్టం సంభవిస్తోంది. తాజాగా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లోని ఎసెన్సియా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి, భారీ ప్రమాదం చోటు చేసుకుంది. 1997 సెప్టెంబరు 14న విశాఖలోని హెచ్‌పీసీఎల్ రిఫైనరీ పేలుడు ప్రమాదంలో 22 మంది మృతి చెందారు. విశాఖలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ప్రమాదంగా ఉంది. గతంలో జరిగిన ప్రమాదాల విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష వైఖరితో పాటు భద్రతా ప్రమాణాలు సరిగ్గా పాటించకపోవడమే ప్రమాదాలకు కారణమని నిపుణులు అంటున్నారు.
కార్మికులను వెంటాడుతున్న ప్రాణభయం : విశాఖ పరిధిలోని పరవాడ జేఎన్ ఫార్మాసిటీలో 90 వరకు కంపెనీలు ఉండగా, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ పరిధిలో 208 పరిశ్రమలు ఉన్నాయి. అందులో 130 వరకు రెడ్ కేటగిరీకి చెందిన ప్రమాదకర పరిశ్రమలు. అయితే ఫార్మా, కెమికల్ పరిశ్రమల్లో రియాక్టర్ల వద్ద ఉష్ణోగ్రతలు, ప్రెషర్ గేజ్‌లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తప్పనిసరిగా చూసుకోవాలి. ఒత్తిడి ఎక్కువైనప్పుడు సెన్సర్ల ద్వారా అలారం మోగే వ్యవస్థ కచ్చితంగా ఉండాలి. రియాక్టర్‌పై రప్చర్ డిస్క్ ఉంటుంది. ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఆ డిస్క్ ఊడిపోయి, ఆవిరి బయటకు తన్ని ప్రాణనష్టం తప్పుతుంది.
ఇంత కీలకమైనచోట నిపుణులకు బాధ్యతలు అప్పగించాలి. అయితే ఇతర రాష్ట్రాల నుంచి కొత్తగా వచ్చినవారికి విధులు కేటాయిస్తున్నారని, ఇదే ప్రమాదాలకు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. రెండు నెలల క్రితం వసంత కెమికల్స్‌లో రియాక్టర్ పేలి ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గతేడాది జూన్‌లో సాహితీ ఫార్మా రియాక్టర్‌లో సాల్వెంట్ నింపే క్రమంలో ప్రమాదం సంభవించి ఏడుగురు మృతి చెందారు.
Industrial Accidents: పరిశ్రమల్లో ప్రాణభయం..తనిఖీల తీరు, నిర్వహణ వ్యవస్థపై సందేహాలు
చర్యలు తీసుకోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం : విశాఖ పరిధిలో RR వెంకటాపురం వద్ద 2020లో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగి 12 మంది మృతి చెందారు. ఈ ఘటన తర్వాత ప్రమాదకర పరిశ్రమలపై తనిఖీలకు రాష్ట్ర ప్రభుత్వం 156 GO విడుదల చేసింది. ఆ తర్వాత 2022లో కాకినాడ జిల్లా పెద్దాపురం అంబటి సుబ్బన్న ఆయిల్స్‌లో ప్రమాదం జరిగి ఏడుగురు మృతి చెందగా GO 79 తెచ్చారు. పరిశ్రమల శాఖ, కాలుష్య నియంత్రణ, కార్మిక, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కలిసి తనిఖీ చేయాలని ఆదేశాలిచ్చారు.
"ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం గత కొంతకాలంగా సేఫ్టీ ఆడిట్స్ జరగటం లేేదు. సాధారణ తనిఖీలతోపాటు, ప్రైవేటుగా థర్డ్ పార్టీతో కొన్ని రకాల సేఫ్టీ ఆడిట్స్ నిర్వహించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. థర్డ్ పార్టీ ఆడిట్‌తో లోపాలను గుర్తించినప్పటికీ వాటిని పరిష్కరించకుండా కాసులు దండుకుని కళ్లు మూసుకున్నారు. ఆ పాపాలే ఇప్పుడు ప్రమాదాలకు దారి తీస్తున్నాయి." - కొణతాల రామకృష్ణ, ఎమ్మెల్యే
ప్రమాదకరమైన పరిశ్రమలు : ప్రమాద తీవ్రత పరిశ్రమ దాటి బయటకు వస్తే ‘ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్’ అమలు చేస్తారు. విశాఖ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పరిశ్రమల శాఖ ఈ ప్లాన్ చేయాలి. పదిహేనేళ్ల కిందట ఉన్న ఈ ప్లాన్‌ను అప్పటి నుంచీ అప్‌డేట్ చేయలేదు. ఈ వ్యవధిలో ఎన్నో కొత్త పరిశ్రమలొచ్చాయి. ప్రమాదకరమైన పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. జిల్లాల విభజనతో నైసర్గిక స్వరూపం మారిపోయింది. అందుకు తగ్గ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్‌పై ఎవరూ దృష్టి పెట్టలేదు.
విశాఖలోని కేజీహెచే దిక్కు : పారిశ్రామికవాడల్లో ఏదైనా ప్రమాదం సంభవిస్తే క్షతగ్రాతులకు బర్న్ వార్డులో మెరుగైన చికిత్స అందించాలంటే విశాఖలోని కేజీహెచే దిక్కు. ఈలోగా సకాలంలో వైద్యం అందక ఎంతోమంది మృతి చెందుతున్న ఘటనలు ఉన్నాయి. పరవాడ, అచ్యుతాపురం ప్రాంతంలో అధునాతన వైద్యశాల నిర్మాణంలో భాగంగా ఈ-బానింగ్ ఇండస్ట్రియల్ పార్కులో స్థలం గుర్తించారు. విరాళాలు ఇవ్వడానికి కొన్ని కంపెనీలూ ముందుకొచ్చాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రతిపాదన అటకెక్కింది. లారస్ ప్రమాద సమయంలో ఆధునాతన ఆసుపత్రి నిర్మాణంపై సమీక్ష నిర్వహించి వదిలేశారు. సాహితీ ప్రమాద ఘటన సమయంలో సీఎస్‌ఆర్ నిధులతో అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బర్న్స్ వార్డు నిర్మిస్తామని అప్పటి మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రకటించినా ఫలితం లేదు.
పారిశ్రామిక ప్రమాదాలపై ఉదాసీనత.. కమిటీల ఆర్భాటం తప్ప, నివేదికల ఊసేది !