No Facilities for Childrens in Schools : అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పలు పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. కొత్తపేట మండలంలో రెండో విడత నాడు - నేడులో భాగంగా చేపట్టిన మరుగుదొడ్లు అసంపూర్తిగా నిలిచిపోయాయి. మండలంలోని వానపల్లి, మోడేకుర్రు, చప్పిడివారిపాలెం ఉన్నత పాఠశాలలతో పాటు, మరో 24 పాఠశాలల్లో ఈ పరిస్థితి నెలకొంది.
రెండో విడత నాడు-నేడులో భాగంగా 22 మండలాల్లో 546 పాఠశాలల్లో మరుగుదొడ్లకు నిధులు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటివరకు 267 పూర్తి కాగా, 113 వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. 165 పాఠశాలల్లో నిర్మాణానంతర పనులు చేపట్టాల్సి ఉంది.
నాడు-నేడు పనుల్లో నాణ్యతా లోపం- పాఠశాలల్లో విద్యార్థుల ఇక్కట్లు - Nadu Nedu Work Incomplete
కొత్తపేట మండలంలో వానపల్లి, మోడేకుర్రు, చప్పిడివారిపాలెం సహా మరో 24 పాఠశాలల్లో రెండో విడత నాడు - నేడు పనులు చేపట్టారు. నెలలు గడుస్తున్నా 13 పాఠశాలల్లో నిర్మాణాలు పూర్తి కాలేదు. దీంతో విద్యార్థులకు అత్యవసర వేళ అవస్థలు తప్పడం లేదు.
కపిలేశ్వరపురం మండలంలోని 26 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టగా కాలేరు, వాకతిప్ప, నల్లూరుతో పాటు మరో 15 మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలల్లో పనులు నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులు శిథిలావస్థలో ఉన్న పాతవాటినే ఉపయోగించాల్సిన పరిస్థితి దాపురించింది.
పి.గన్నవరం మండలంలో మొత్తం 42 పాఠశాలలు ఉండగా 34 చోట్ల మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభించగా ఇప్పటివరకు 9 మాత్రమే పూర్తయ్యాయి. ఆరు పాఠశాలల్లో నిర్మాణ దశలో, 18 చోట్ల తలుపుల అమరికల దశలో పనులు నిలిచిపోయాయి.
ప్రభుత్వ పాఠశాలలను పూర్తి సౌకర్యాలతో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మారుస్తామని గొప్పలు చెప్పిన గత ప్రభుత్వం ఆచరణలో విఫలమైంది. నాడు - నేడు కార్యక్రమం అద్భుతమంటూ తీరా అనేకచోట్ల పనులు పూర్తి చేయక అసంపూర్తిగా వదిలేసింది. డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రెండోవిడత నాడు - నేడు నిధులు రాక పనులు నిలిచిపోవడంతో సిమెంటు గడ్డలు కట్టింది. టాయిలెట్స్‌లో వేసే బౌల్స్, వెస్ట్రన్ స్టైల్ కేసులు కంపెనీ నుంచి అన్ని పాఠశాలలకు అందినా టైల్స్ వేయకుండా బిగించపోవడంతో అవి గదుల్లో మూలుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం పూనుకుని పెండింగ్ పనులు పూర్తిచేస్తే తప్ప సమస్యకు పరిష్కారం కనిపించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కపిలేశ్వరపురం, ఆలమూరు, ఉప్పలగుప్తం, రాయవరం, కె.గంగవరం మండలాల్లోని పలు పాఠశాల్లో కొన్నిచోట్ల పైకప్పు లేకపోవడంతో బాలికలు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులు శిథిలావస్థలో ఉన్న మరుగుదొడ్లనే వినియోగించాల్సిన దుస్థితి. అత్యవసర పరిస్థితుల్లో ఇళ్లకు వెళ్లాల్సి వస్తోందని, కొన్ని చోట్ల తలుపులకు గొళ్లెం లేదని, కొళాయి లేక మరింత ఇక్కట్లకు గురవుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు.
నిధుల కొరత కారణంగా నిలిచిపోయిన నాడు - నేడు పనులపై వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. అన్ని పాఠశాలల్లోనూ పనులు ప్రారంభించి పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. -షేక్ సలీం బాషా, డీఈవో
వైఎస్సార్సీపీ నాయకుల నిర్వాకం - పైపై మెరుగులతో నాడు-నేడు పనులు - No Quality in Nadu Nedu Works