Congress Focus on Rythu Runa Mafi in Telangana : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో పాలనకే సమయాన్ని కేటాయిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు రుణమాఫీపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు. గత ఏడాది డిసెంబరు 3 వరకు తీసుకున్న రుణాల్లో రూ.2 లక్షలు ఏకకాలంలో రుణమాఫీ చేయాల్సి ఉన్నందున, ఇదే అంశంపై పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల విభాగం అధికారులతో సమావేశమై చర్చించారు. రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదాయ వనరులను సమకూర్చి తద్వారా తీసుకున్న రుణంతో రుణమాఫీకి ఉపయోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ తరహాలో సాధ్యంకాకపోతే ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు ప్రత్యామ్నాయాలపైనా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
ఏం పెట్టి రైతులు రుణం తీసుకున్న అంశం పరిగణలోకి : తాము అధికారంలోకి వస్తే రూ.2 లక్షలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో చాలా మంది రైతులు రుణాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రుణమాఫీని ఏ విధంగా అమలు చేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. మార్గదర్శకాల రూపకల్పన చేసి బ్యాంకర్లకు ఇస్తే ఆ మేరకు ఎంత మొత్తం రుణమాఫీ చేయాల్సి వస్తుంది? ఎంత మంది రైతులకు రుణమాఫీ వర్తిస్తుందనే అంశాలను బ్యాంకర్లు తేల్చనున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు పెట్టి రుణాలు తీసుకున్న రైతులు కొందరుంటే, బంగారం కూడా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణం తీసుకున్న వారుంటారు. ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాలా లేదా పాసు పుస్తకాలు పెట్టి రుణం తీసుకున్న వారికే వర్తింపజేయాలా అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఇక రూ.2 లక్షల వరకు రుణమాఫీ అంటున్నందున అంతకు మించి రుణాలు తీసుకున్న రైతులకు కూడా నిర్దేశించిన రూ.2 లక్షలను వర్తింపచేస్తారా లేదా అన్నదానిపై కూడా ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. తెల్ల రేషన్ కార్డులు, ఆదాయపు పన్ను చెల్లింపులు, తదితర వాటిని పరిగణనలోకి తీసుకుని అర్హులైన రైతులను ఎంపిక చేసే దానిపై ప్రభుత్వం కసరత్తు చేయాల్సి ఉంది. అయితే రెండు, మూడు రకాల మార్గదర్శకాలను బ్యాంకర్లకు ఇచ్చి, ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఎంత మొత్తం రుణమాఫీ చేయాల్సి ఉంటుందో నివేదికలు తీసుకోనుంది. ఆ తర్వాతే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, రుణమాఫీపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
రైతులకు గుడ్న్యూస్ - ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్
Telangana Rythu Runa Mafi 2023 : రూ. లక్ష, ఆపై రుణాల మాఫీకి సంబంధించిన చెల్లింపులు ప్రారంభం