TG Cabinet Expansion : రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ కసరత్తు తుది అంకానికి చేరుకుంది. ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఏఐసీసీ యోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో మరోసారి చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, రంగారెడ్డి నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మక్తల్ శాసనసభ్యుడు శ్రీహరి ముదిరాజ్ పేర్లు దాదాపు కొలిక్కివచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సైతం మంత్రివర్గంలో అవకాశం కల్పించేందుకు ఏఐసీసీతోపాటు పీసీసీ సుముఖంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే విధంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావును కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. 4 మంత్రి పదవులు వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఏఐసీసీ భావిస్తోంది.
గురువారమే మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యే అవకాశం : అధిష్ఠానం నుంచి పిలుపు వస్తే ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి బుధవారం దిల్లీకి వెళ్లనున్నారు. చర్చల అనంతరం రాత్రికే మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఒక మంత్రి పదవిని హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతకు, మరో పదవి బీసీ లేదా ఎస్టీ వర్గాలకు రిజర్వ్ చేసి పెడుతున్నట్లు సమాచారం. గవర్నర్ కోటా కింద నామినేట్ చేసిన ఎమ్మెల్సీల వ్యవహారం కోర్టులో ఉన్నందున తుది నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాలని పీసీసీ భావిస్తోంది.
అన్ని అనుకున్నట్లు జరిగినట్లయితే గురువారం మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులకు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రుల శాఖల మార్పుపైనా కాంగ్రెస్ పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సీఎంతోపాటు 11 మంది మంత్రులు ఉండగా మరో ఆరుగురిని నియమించే అవకాశం ఉంది.
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సీతక్కకు హోం శాఖ కేటాయించవచ్చంటూ ఇటీవల వైద్యారోగ్య శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పుడు సీఎం సహా మంత్రులందరి వద్ద రెండు లేదా అంత కంటే ఎక్కువ శాఖలున్నాయి. అయితే, కొత్తగా వచ్చే మంత్రులకు ఏ విధంగా సర్దుబాటు చేస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
'త్వరలో మంత్రివర్గ విస్తరణ - హోమ్ మినిస్టర్‌గా సీతక్క!' - Cabinet Expantion in Telangana