Comprehensive Household Survey in Telangana : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఉపాధి, విద్య, ఆర్థిక, రాజకీయ, కులగణన తుది దశకు చేరుకుంది. ఏ రోజుకు ఆ రోజు ఎన్యుమరేటర్లు ఇళ్లకు తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం వాటిని ఆన్‌లైన్లో పొందుపరుస్తున్నారు. అలాగే ఇళ్లలో లేని వారికి ఫోన్ చేసి మరీ వివరాలు సేకరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిబంధన ప్రకారం సర్వే చేస్తున్నారు. గ్రామాల్లో ఉండి నగరంలో సెటిల్ అయిన వారు సైతం ఇక్కడే తమ వివరాలను ఇస్తున్నారు. అందుకు సంబంధించిన ధ్రువ పత్రాలను అందిస్తున్నారు.
సర్వే చేసేందుకు బ్లాకులుగా విభజన : ఉమ్మడి మెదక్ జిల్లాలో ఐదు పట్టణాలు, 26 గ్రామీణ మండలాలు ఉన్నాయి. ఈ కుటుంబాల వివరాలను సర్వే చేసేందుకు బ్లాకులుగా విభజించారు. ఒక్కో ఎన్యుమరేటర్‌కు 150 నుంచి 175 వరకు కుటుంబాలను కేటాయించి వివరాలు సేకరించే పనిని ఇచ్చారు. కేటాయించిన ప్రకారం ఎన్యుమరేటర్లు వివరాల సేకరించారు. నవంబర్ 6న సర్వే ప్రారంభం కాగా 8వ తేదీ వరకు కుటుంబాలను గుర్తించి గృహాలకు స్టిక్కర్లు అంటించారు. అనంతరం ఇంటింటి సర్వే చేపట్టారు. ఓ వైపు సర్వే కొనసాగుతుండగానే మరో వైపు సేకరించిన సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో డేటా ఎంట్రీ చేసే పనిని ఆపరేటర్లు మొదలు పెట్టారు.
"ఆ ఒక్కటీ తప్ప!" - ఇంటింటా అదే సమస్యతో సతమతం
వివరాలను రహస్యంగా ఉంచుతున్న అధికారులు : వారందరికీ లాగిన్లు, పాస్‌వర్డ్ ఇచ్చారు. మండల పరిషత్తు, ఎమ్మార్వో కార్యాలయాలతో పాటు కంప్యూటర్లు ఎక్కువగా ఉన్న ఇతర కార్యాలయాలు, పాఠశాలల్లోనూ సర్వే డేటా నమోదు ప్రక్రియ చేస్తున్నారు. డేటా ఎంట్రీలో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా నమోదు చేయాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లతో పాటు ఇతర అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. సర్వే వివరాలు బయటకు వెళ్లకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. వివరాలు బయటకి వెళ్లకుండా రహస్యంగా ఉంచుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన వివరాల నమోదు 70% పైగా పూర్తి అయింది. మరో 3 రోజుల్లో సర్వే ఎంట్రీ పూర్తి చేయనున్నారు.