Police Special Drive on Bogus Companies in Telangana : వ్యాపార లావాదేవీలు నిర్వహించకుండా ప్రభుత్వ సొమ్ము కొల్లగొట్టేందుకు పుట్టుకొచ్చిన బోగస్ వ్యాపార సంస్థలపై కొరడా ఝుళిపించేందుకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే దాదాపు 800 బోగస్ వ్యాపార సంస్థలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కేంద్ర జీఎస్టీ పోర్టల్‌కు నెలవారీగా అప్‌లోడ్ అయ్యే ఇన్వాయిస్‌ల ఆధారంగా సిస్టం జెనరేట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆ జాబితాను సర్కిల్ అధికారులకు అందజేసి అక్టోబర్ చివరి వరకు బోగస్ సంస్థలపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ప్రతి సంస్థను సందర్శించి తనిఖీలు నిర్వహించి చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ రిజ్వి ఆయా సంస్థలను క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి రద్దు చేయాలని ఆదేశించారు. ఆయా సంస్థల లావాదేవీలపై ఆరా తీసి బోగస్ ఇన్‌వాయిస్‌లు ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆయా సంస్థల నుంచి చెల్లించాల్సిన పన్నులపై అపరాధ రుసుం వసూలుతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
మరిన్ని కంపెనీల్లో తనిఖీలు : బోగస్ సంస్థల ఏరివేత కోసం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ రెండు నెలల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ నెల 16వ తేదీన మొదలైన స్పెషల్ డ్రైవ్ అక్టోబర్ 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ డ్రైవ్‌లో బోగస్ రిజిస్ట్రేషన్లు తీసుకున్న వ్యాపార సంస్థలను, ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేకుండా కేవలం ఇన్వాయిస్‌లు ఇస్తూ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ లబ్ధి పొందుతున్న సంస్థలను గుర్తించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించిన 800లతోపాటు ఇంకా ఏవైనా ఆలాంటి సంస్థలు ఉంటే వాటి రిజిస్ట్రేషన్‌లను రద్దు చేయాలని క్షేత్రస్థాయి అధికారులను కమిషనర్ ఆదేశించారు.
చట్టాలకు వ్యతిరేకంగా పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నట్లు తేలినట్లయితే ఆయా వ్యాపార సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ స్పెషల్ డ్రైవ్‌ను సమర్థంగా నిర్వహించేందుకు వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి, కమిషనర్ అయిన రిజ్వీ వాణిజ్య పన్నుల అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఇందుకు నోడల్ అధికారిగా వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ అరవింద్‌రెడ్డిని నియమించారు.
Bodhan Fake Challan Scam Update : బోధన్ నకిలీ చలాన్ల కుంభకోణంలో సీఐడీ ఛార్జ్‌షీట్
Fake News : సోషల్‌మీడియాలో అసత్య ప్రచారం.. వ్యక్తులు, సంస్థలపై తీవ్ర ప్రభావం