VIP VVIP security arrangements: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబ నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ దేశాల ప్రతినిధులు, ప్రముఖులు హాజరు కానున్నారు. అందులో భాగంగా అతిధుల కోసం ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వారికి సంబంధిచిన వసతి, రవాణా ఏర్పాట్లను ఎన్డీఆర్ జిల్లా కలెక్టర్, ఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు.
ముఖ్యమంత్రి, మంత్రివర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే అతిధులకు విజయవాడలో వసతి, రవాణాకు సంబంధించి ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు చెప్పారు. రేపటి ప్రమాణ స్వీకార వేడుకకు హాజరయ్యేందుకు కేంద్రమంత్రులతోపాటు తమిళనాడుకు చెందిన పన్నీర్ సెల్వం, ప్రముఖ నటుడు చిరంజీవి వంటి ప్రముఖులు కూడా వస్తున్నట్లు చెప్పారు. వివిధ హోటళ్లకు ఇప్పటికే ఇన్చార్జిలను నియమించినట్లు చెప్పారు. వీవీఐపీలు, వీఐపీల రవాణా, వసతి సదుపాయాల కోసం కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. లైజనింగ్ అధికారులు... కంట్రోల్ రూమ్ తో అనుసంధానమై వీవీఐపీ, వీఐపీలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమ వేదిక, పార్కింగ్ ప్రదేశాల్లో.... తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కలెక్టర్ చెప్పారు. సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఢిల్లీరావు సూచించారు.
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. దేశం నలుమూలల నుంచి అనేకమంది అతిథులు హాజరుకానున్న నేపథ్యంలో వారి భద్రత కోసం మూడు జిల్లాల పోలీసులను సిద్ధం చేశారు. సుమారు 7 వేలమందితో భారీ బందోబస్తు చేస్తున్నారు. విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాస్‌లు ఉన్న వాహనాలనే సభా ప్రాంగణం వైపు వెళ్లేందుకు అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. వీవీఐపీలు బస చేసే ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని సీపీ రామకృష్ణ చెప్పారు.
చంద్రబాబుతోపాటు, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన అతిథులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు... 36 గ్యాలరీలు సిద్ధం చేశారు. సభా వేదికను పూలతో అందంగా అలంకరిస్తున్నారు. వేదికపై భారీ ఎల్ఈడీ తెరను ఏర్పాటు చేసి దానిమీద ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ ఫొటోలు ప్రదర్శిస్తున్నారు. ప్రధాన వేదికకు ఇరువైపులా రెండు భారీ షెడ్లు ఏర్పాటు చేశారు. వర్షం వచ్చినా ఇబ్బంది కలగకుండా వాటిని నిర్మించారు. తెలుగుదేశం నేతలు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ సభా వేదిక వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సిద్దమవుతున్న కేసరపల్లి - Chandrababu to take Oath as CM