Coastal Erosion in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విస్తారమైన తీరప్రాంతం ఉంది. అయితే అదేస్థాయిలో సముద్రకోత సమస్య వెంటాడుతోంది. సముద్ర కోత వల్ల శ్రీహరికోట అంతరిక్ష కేంద్రానికి సైతం సవాళ్లు ఎదురవుతున్నాయి. విశాఖ వద్ద ఆర్కే బీచ్, కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాలతో పాటు అనేకచోట్ల తీరం కోతకు గురవుతోంది. కొన్నిచోట్ల నివాసాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. మరికొన్నిచోట్ల బీచ్‌లు మాయమౌతున్నాయి. వాతావరణ మార్పులు, ప్రజల జీవనవిధానాల వల్ల తీరప్రాంత కోత తీవ్రత పెరుగుతూ వస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో 48 చోట్ల తీరం కోత తీవ్రంగా ఉందని తీరప్రాంత జాతీయ పరిశోధన కేంద్రం (National Centre for Coastal Research) అధ్యయనంలో తేలింది. ఐదుచోట్ల ఈ కోత ఎక్కువగా ఉంది. శ్రీహరికోట, గోదావరి, కృష్ణా నదులు సముద్రంలో కలిసేచోట, కోరింగ అభయారణ్యం సమీపంలో, ఉప్పాడ వద్ద కోత తీవ్రత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని మొత్తం తీరప్రాంతంలో 29 శాతం కోతకు గురవుతున్నట్లు లెక్కతేల్చారు. 3 మీటర్లకు మించి సముద్రకోత ఉంటే తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు పరిగణిస్తారు.
సాగర గర్భంలో ఊళ్లు, భూములు - ఇప్పటివరకు 1360 ఎకరాలు కనుమరుగు - Coastal Erosion in ap
బంగాళాఖాతాన్ని పరిశీలిస్తే మార్చి నెల నుంచి అక్టోబరు వరకు శ్రీలంక నుంచి పశ్చిమబెంగాల్ వైపు ఇసుక ప్రయాణిస్తుంది. తర్వాత నవంబరు నెల నుంచి ఫిబ్రవరి వరకు పశ్చిమబెంగాల్ నుంచి శ్రీలంక వైపు ప్రయాణిస్తుంది. నదులకు అడ్డుకట్టలు కట్టడం వల్ల నదుల్లోంచి వచ్చి సముద్రంలో చేరే ఇసుక తగ్గుతోంది. మరోవైపు గతంలో కంటే తుపానులు, కెరటాల తీవ్రత సైతం పెరిగిపోయాయి. సముద్రమట్టాలు పెరగడంతో పాటు పోర్టుల అభివృద్ధి, డ్రెడ్జింగ్ వంటి కారణాల వల్ల కూడా తీరంలో కోత ఏర్పడుతోంది. అయితే కోత ఏర్పడ్డచోట తొలగిన ఇసుక మరికొన్నిచోట్ల మేటలుగా ఏర్పడుతోంది. పోర్టులకు ఉత్తరం వైపున తీరం కోత ఏర్పడుతుండగా, దక్షిణం వైపున కొత్త బీచ్‌లు ఏర్పడుతున్నాయి.
ఉప్పాడలో భారీ కోత: కాకినాడ జిల్లాలో 5 చోట్ల కోత తీవ్రంగా ఉందని గుర్తించారు. నేమాం, కొమరగిరి, ఉప్పాడలో 2 చోట్ల, అమీనాబాద్‌లలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇక్కడ కొన్నేళ్లుగా 2.655 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం కోతకు గురైనట్లు అధికారులు గుర్తించారు. 2022 నాటి లెక్కల ప్రకారం 265.2 హెక్టార్ల భూమి సముద్రంలో కలిసిపోయింది. అదే విధంగా శ్రీహరికోటలో కోత నివారించేందుకు షార్ చర్యలు తీసుకుంటోంది. విశాఖ పోర్టు వల్ల ఆర్కే బీచ్ వద్ద తీవ్రకోత సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది. పోర్టు అధికారులు అక్కడ డ్రెడ్జింగ్ చేసిన ఇసుకను ఆర్కే బీచ్‌లో పోస్తూ కోతనివారణ చర్యలను చేపడుతున్నారు. ఇలా చేయకపోతే ఆర్కే బీచ్ మాయమయ్యేదని చెబుతున్నారు.
కోత నివారణకు ప్రత్యేక ప్రాజెక్టు: కేంద్రం ఆధ్వర్యంలోని నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ సంస్థ తీరం కోతపై అధ్యయనం చేస్తూ పరిష్కార మార్గాలను చెప్తోంది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (National Disaster Management Authority) కోత నివారణకు ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులోభాగంగా ఆంధ్రప్రదేశ్‌కి కనీసం 200 కోట్ల నుంచి 800 కోట్ల రూపాయల వరకు కేంద్రం నుంచి నిధులొచ్చే ఆస్కారం ఉంది. దీనిపై తొలి సమావేశం జులైలో దిల్లీలో నిర్వహించారు. ఈ నెలాఖరుకల్లా ముసాయిదా ప్రాజెక్టు నివేదికలు సిద్ధమవుతాయి. ప్రాజెక్టు వ్యయంలో 90 శాతం కేంద్రమే ఇస్తుంది. మరో 10 శాతం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ భరించాలి.