Coastal Andhra Districts Experiencing Heavy Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. పొంగిన వాగులు, గెడ్డలు రోడ్లు, పొలాలను ముంచెత్తాయి. చాలా ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాన తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు, అత్యవసరం ఉంటేనే ప్రజలు ఇళ్లనుంచి బయటికి రావాలని సూచించారు.
దిగువ ప్రాంతాలు అప్రమత్తం : కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని ఏలేరు జలాశయం నుంచి 5500 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ఎగువ నుంచి వచ్చిన 11 వేల 831 క్యూసెక్కుల నీరు ఏలేరు జలాశయానికి చేరింది. రిజర్వాయర్ నీటి మట్టం 86.56 మీటర్లు కాగా ప్రస్తుతం 85.05 మీటర్లు ఎత్తున నీరు చేరుకుంది. మరో వైపు అప్పన్నపాలెం కాజెవే బ్రిడ్జి మరోసారి కుంగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పరిశీలించి దిగువ ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.
ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్ - విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు - red alert for north andhra
వరద గుప్పిట్లో లంక గ్రామాలు : కోనసీమ జిల్లాలోని లంక వాసులను వరద భయం వెంటాడుతుంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించినా సముద్రంలోకి 9 లక్షల క్యూసెక్కుల వరద నీటిని వదులుతున్నారు. దీంతో లంక గ్రామాల ప్రజలు ఎప్పుడు వరద ముంచెత్తుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గురజాపులంక పల్లంవారిపాలెం ప్రాంతంలో వరదకు లంక భూములు ముంపునకు గురయ్యాయి. ఇంటి సమీపంలోనే నేల కోతకు గురవుతుండటంతో పశువులను రక్షించుకునేందుకు లంక గ్రామాల ప్రజలు వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
గిరిపుత్రుల అవస్థలు : అల్లూరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రంపచోడవరంలోని భూపతిపాలెం జలాశయం 2 గేట్లు ఎత్తి సీతపల్లి వాగులోకి నీరు విడుదల చేశారు. ఏజెన్సీ ప్రధాన కేంద్రమైన రంపచోడవరంలో వారపు సంత కావడంతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. కొండవాగులు పొంగి ఉద్ధృతంగా ప్రవహించడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి.
వేల క్యూసెక్కుల నీరు విడుదల : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జోరుగా వర్షం కురిసింది. ఎర్రకాలువకు వరద పోటెత్తడంతో 3 వేల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. ఏలూరు నగరంలో రోడ్లు జలమయం అయ్యాయి. బుట్టాయిగూడెం మండలం శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయంలో దర్శనాలు ఆపేసినట్లు అధికారులు తెలిపారు.పెదపాడు మండలం పళ్లు లంకను వరద చుట్టుముట్టింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గౌతమి, వృద్ధగౌతమి పరివాహక లంకల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ముమ్మిడివరం మండలంలో లంక భూములు ముంపునకు గురయ్యాయి.