Jagan Bus Yatra Pawan Fans Slogans: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రలో అడుగడుగునా నిరసనలు, చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇన్నాళ్లూ పరదాలు మధ్య తిరిగిన జగన్, ఇప్పుడు బయటకు రావడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైసీపీకి ఎదురుగాలి వీస్తుండటంపై ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
జగన్ బస్సు దిగుతుండగా యువకుల నినాదాలు: తాజాగా అనకాపల్లి జిల్లాలో వైఎస్ జగన్‌కు యువకుల నుంచి నిరసన సెగ తగిలింది. అనకాపల్లి జిల్లాలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో భాగంగా గోకులపాడు వద్ద ప్రజలకు అభివాదం చేయడానికి బస్సు దిగుతుండగా, జగన్ ఎదుట కొంతమంది యువకులు సీఎం పవర్ స్టార్, సీఎం పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని, నినాదాలు చేయవద్దని హెచ్చరించారు. దీంతో జగన్మోహన్ రెడ్డి మొక్కుబడిగా ఓ మహిళతో మాట్లాడి బస్సు లోపలకి వెళ్లిపోయారు. అనంతరం అక్కడ నుంచి అభివాదం చేస్తూ వెళ్లిపోయారు.
'అన్నొస్తే అంతే!' - అనకాపల్లి ప్రజలకు తప్పని అవస్థలు - CM Jagan Bus Yatra
బస్సుయాత్రలో పవన్ కల్యాణ్‌కు అనుకూలంగా నినాదాలు: అదే విధంగా శుక్రవారం సైతం మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్‌కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడటానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు జై కొట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం వద్ద ఏడీబీ రోడ్డులో ఆదిత్య యూనివర్సిటీ ఉంది. అయితే ఈ విద్యాలయం మీదుగా జగన్ బస్సు యాత్ర శుక్రవారం మధ్యాహ్నం సాగింది. దీంతో ముందస్తుగా సిద్ధమైన కళాశాల యాజమాన్యం, జగనన్న విద్యాదీవెనతో విద్యార్థులకు మేలు జరిగినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ‘థాంక్యూ సీఎం సార్’ అంటూ భారీ ఫ్లెక్సీని ముద్రించారు.
అసహనానికి గురై అక్కడి నుంచి వెళ్లిపోయిన జగన్: విద్యార్థులను యూనివర్సిటీ ఎదుట నిలబెట్టి ఆ ఫ్లెక్సీ పట్టుకుని నినాదాలు చేయించడానికి యాజమాన్యం సిద్ధమైంది. విద్యార్థులను చూసిన జగన్, బస్సు ఆపి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడారు. అందరికీ విద్యా దీవెన అందుతుందా అంటూ ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. అయితే ఇంతలో విద్యార్థులు ‘బాబులకే బాబు కల్యాణ్ బాబు’ అంటూ జనసేనాని పవన్ కల్యాణ్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. నినాదాలు తీవ్రత అధికమవ్వడంతో అసహనానికి గురైన ముఖ్యమంత్రి జగన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.