CM Revanth Two Guarantees Telangana 2024: అభయహస్తం ద్వారా ఆరు గ్యారంటీలు ప్రకటించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. సోనియా గాంధీ ఇచ్చిన హామీని ఎప్పుడూ విస్మరించలేదని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్న సీఎం, ఆమె స్ఫూర్తితో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని తెలిపారు. ఆరు గ్యారంటీలను కూడా కచ్చితంగా అమలు చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే 2 హామీలు అమలు చేశామని గుర్తు చేశారు.
ఇవాళ మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth On Six Guarantees) అన్నారు. సచివాలయంలో అభయ హస్తం గ్యారంటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా రూ.500 లకే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఏపీలో ప్రాణహాని ఉంది - రక్షణ కల్పించండి: తెలంగాణ సీఎంకు దస్తగిరి విజ్ఞప్తి
"చేవెళ్లలో లక్ష మంది మహిళల సమక్షంలో పథకాలు ప్రారంభించాలని భావించాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల సచివాలయంలో పథకాలు ప్రారంభిస్తున్నాం. కట్టెల పొయ్యి నుంచి మహిళలకు విముక్తి కల్గించాలని ఆనాడు యూపీఏ ప్రభుత్వం భావించింది. రూ.1500కే దేశంలోని పేదలందరికి గ్యాస్ కనెక్షన్లను యూపీఏ ప్రభుత్వం ఇచ్చింది. రూ.400 గ్యాస్ సిలిండర్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూ.1200కు పెంచింది. పేదలకు గ్యాస్ సిలిండర్ భారం తగ్గించాలని రూ.500కే సిలిండర్ ఇస్తున్నాం. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం. బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు." - రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి
అంతకుముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కొన్నేళ్లుగా దేశంలో గ్యాస్ సిలిండర్ ధర బాగా పెరిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో మహిళలకు ఊరట కల్పించాలనే లక్ష్యంతో రూ.500 లకే వంట గ్యాస్ సిలిండర్ (LPG Cylinder Scheme in Telangana) అందిస్తున్నామని తెలిపారు. ఈ పథకంలో లోపాలు గుర్తించి మార్పులు చేసుకుంటూ ముందుకెళ్తామని వెల్లడించారు. పేదలకు ఎక్కువ ఉపయోగం కలిగేలా అభయ హస్తం గ్యారంటీలు ప్రకటించినట్లు పునరుద్ఘాటించారు.
మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం ఆర్థికంగా చాలా నష్టపోయిందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక నష్టాల్లో ఉందని, అయినా తాము గ్యారంటీలు అమలు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాల వైపు దేశమంతా చూస్తోందన్న భట్టి తాము హామీలు అమలు చేయమని బీఆర్ఎస్, బీజేపీలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు సూచించారు.