CM Revanth will be unveiled Telangana Thalli : ప్రజా పాలన విజయోత్సవాలను నేడు ఘనంగా ముగించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆవిష్కరించనున్నారు. కొత్త రూపురేఖలతో తెలంగాణ తల్లి విగ్రహం సిద్ధమైంది. జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వీసీటీ. గంగాధర్ తెలంగాణ తల్లి చిత్రాన్ని గీయగా ప్రముఖ శిల్ప కళాకారుడు ఎంవీ రమణారెడ్డి కాంస్య విగ్రహంగా తీర్చిదిద్దారు. అభయహస్తం బిగించిన కొంగు చేతిలో పంటలు, బంగారు రంగు అంచు ఉన్న పచ్చటి చీరతో కూడిన తెలంగాణ తల్లి విగ్రహం 17 అడుగులు కాగా బిగించిన పిడికిళ్లు చేతులతో నిలబెట్టుకుంటున్న సంకేతంతో మూడడగుల గద్దెతో కలిపి మొత్తం 20 అడుగుల విగ్రహం సిద్ధమైంది.
సుమారు నెలన్నర రోజులు దాదాపు 100 మంది కళాకారులు సుమారు 8 వేల కిలోల బరువుతో కాంస్య విగ్రహాన్ని తయారు చేశారు. సచివాలయం ప్రధాన ద్వారం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 3 కోట్ల రూపాయలతో విగ్రహం ఎదురుగా రోడ్డుపై మూసేసిన గేటు వరకు వాటర్ ఫౌంటెయిన్, చుట్టుపక్కల పచ్చటి బయళ్లు, లైటింగ్ సిద్ధం చేశారు. ఉదయం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ విగ్రహం ఏర్పాటుపై కీలక ప్రకటన చేయనున్నారు. తెలంగాణ తల్లి రూపం, విగ్రహంపై వివరించే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటలకు సచివాలయం ప్రాంగణంలో విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారు.
లక్ష మంది మహిళల సమక్షంలో విగ్రహావిష్కరణ : లక్ష మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా భారీగా మహిళలు కార్యక్రమానికి రానున్నారు. విగ్రహ రూపకర్తలు గంగాధర్, రమణారెడ్డితో పాటు "జయజయహే తెలంగాణ" గేయ రచయిత అందెశ్రీని వేదికపై సీఎం సత్కరిస్తారు. తెలంగాణ కవులు బండి యాదగిరి, గూడ అంజన్న, జయరాజ్‌తో పాటు గద్దర్ కుటుంబాన్ని సత్కరించనున్నారు. ఆవిష్కరణ సభ కోసం సచివాలయం ప్రాంగణంలో ఏర్పాట్లు చేసింది. విగ్రహం పక్కన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు సుమారు 150 మంది కూర్చునేలా వేదికను సిద్ధం చేస్తున్నారు. విగ్రహానికి మరో పక్క సాంస్కృతిక కార్యక్రమాల కోసం మరో వేదికను ఏర్పాటు చేస్తున్నారు.
7 గంటలకు తమన్ సంగీత ప్రదర్శన : నెక్లెస్ రోడ్డు, పీపుల్స్ ప్లాజా, గోశాల రోడ్, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్స్‌లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. సభ తర్వాత భారీగా బాణసంచా, డ్రోన్ షో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఐమాక్స్ పక్కన హెచ్ఎండీఏ మైదానంలో రాత్రి 7 గంటలకు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్ కచేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. బిర్యానీ, చాట్, ఐస్ క్రీం, తెలంగాణ, ఉత్తరాది ఫుడ్ స్టాళ్లు ఏర్పాటయ్యాయి. రాజీవ్ గాంధీ విగ్రహం, ఎన్టీఆర్ స్టేడియం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన స్టేజీల వద్ద ఇవాళ కూడా సాంస్కృతిక ప్రదర్శనలు జరగనున్నాయి. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతాలు, కట్టడాలన్నీ విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. మూడు రోజుల పాటు విభిన్న, ఆకర్షణీయ లైట్లతో ఆకట్టుకుంటున్నాయి.
అంబరాన్నంటిన ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు - ఆకట్టుకున్న సంగీత కార్యక్రమం