Lok Sabha Elections 2024 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో, ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని ఆయన దుయ్యబట్టారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆసిఫాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీపై మండిపడ్డారు.
గుజరాత్ ఆధిపత్యానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య పోరాటం : రేవంత్‌రెడ్డి - lok sabha elections 2024
రైతుల పోడు భూముల సమస్యలపై, కేసీఆర్ దృష్టి పెట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఇక్కడి ప్రాంతంలో విద్యాభివృద్ధికి బీజేపీ ఎటువంటి కృషి చేయలేదన్నారు. కేంద్ర మంత్రివర్గంలో గోండులకు బీజేపీ స్థానం ఇవ్వలేదని స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గోండులు, లంబాడ హక్కులను కాపాడలేదని మండిపడ్డారు. ఇంతవరకు ఆదిలాబాద్ లోక్‌సభ టికెట్‌ను మహిళలకు ఏ పార్టీ ఇవ్వలేదని, తొలిసారిగా ఆదిలాబాద్ ఎంపీ టికెట్‌ను మహిళలకు కేటాయించినట్లు సీఎం రేవంత్ పేర్కొన్నారు.
రిజర్వేషన్లు రద్దు చేయాలని ఆరెస్సెస్ ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 1881 నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి దేశంలో జనాభా లెక్కలు లెక్కిస్తున్నామని, 2021లో జనాభా లెక్కించాల్సి ఉన్నా బీజేపీ లెక్కించలేదని పేర్కొన్నారు. 2021లో జనాభాను లెక్కించకుండా అమిత్‌షా కుట్ర చేశారని, రిజర్వేషన్లను రద్దు చేయాలనే అజెండాతో 2021లో జనాభాను లెక్కించలేదని సీఎం దుయ్యబట్టారు.
రిజర్వేషన్లు రద్దు చేయాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ కావాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తోందన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలంటే 50 శాతం రాష్ట్రాలు ఒప్పుకోవాలని, రిజర్వేషన్ల రద్దు కోసమే 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాలను పడగొట్టారని మండిపడ్డారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు, రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడుతుందని, రాజ్యాంగాన్ని సమూలంగా మార్పు చేయాలని బీజేపీ చూస్తోందన్నారు.
రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగ మార్పుపై మాట్లాడుతున్నా అని తనపై అమిత్‌షా కేసు పెట్టించారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ తనపై 200 కేసులు పెట్టినా భయపడలేదని, కేసులుపెట్టి మెదీ నన్ను బెదిరించగలరా? ఆయన ప్రశ్నించారు. దిల్లీ సుల్తాన్‌లు తెలంగాణపై దాడి చేయాలనుకుంటున్నారని, బీజేపీ ఆటలు సాగవని స్పష్టం చేశారు. బీజేపీ చేసే కుట్రలను అడ్డుకుంటానన్నారు. రాష్ట్రానికి బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే, మోదీ గాడిద గుడ్డు ఇచ్చారని, తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డు ఇచ్చిందని ఎద్దేవా చేశారు.
"ఇక్కడి ప్రాంతం బాగా వెనుకబడిపోయింది. బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు ఇక్కడ అభివృద్ధిపై దృష్టి సారించలేదు. ఆదిలాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. దిల్లీ సుల్తాన్‌లు తెలంగాణపై దాడి చేయాలనుకుంటున్నారు. వారి ఆటలు సాగనివ్వను". - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి