CM Revanth Reddy to Launch Katamaiah Raksha Kits Scheme : గౌడన్నలను కాదని ఏ నియోజకవర్గంలోనైనా ఏ నేత కూడా ముందుకెళ్లరని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏ వృత్తిలోనైనా నైపుణ్యాలు పెంచే దిశగా స్కిల్ వర్సిటీలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలుగా నిలిచే కులవృత్తులను ప్రోత్సహిస్తామని చెప్పారు. తాటి, ఈత చెట్లకు సంబంధించి ఉపఉత్పత్తులను పెంచాలని సీఎం సూచించారు. రంగారెడ్డి జిల్లా లష్కర్‌గూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. అనంతరం గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గౌడన్నలు పౌరుషానికి, పోరాటానికి ప్రతీకలు. ఈ ప్రాంత అభివృద్ధిలోనూ గౌడన్నల పాత్ర మరవలేనిది. రంగారెడ్డి జిల్లాకు ఎన్నో కీలక ప్రాజెక్టులు తేవటంలో దేవేందర్ గౌడ్ కీలకపాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీలోనూ గౌడన్నలకు ఎన్నో పదవులను ఇచ్చి గౌరవించుకుంటుున్నాం. గౌడన్నలు తాటిచెట్లు ఎక్కేటప్పుడు ప్రమాదాలు బారినపడొద్దని భావిస్తున్నాం. గౌడన్నలు ప్రమాదాల బారినపడొద్దని భావించి ప్రత్యేకంగా సేఫ్టీ కిట్లు పంపిణీ చేస్తున్నాం. ఎవరెస్టు ఎక్కిన వారి సూచనలు తీసుకుని సేఫ్టీ కిట్ రూపకల్పన జరిగింది.' అని అన్నారు.
ప్రతి బలహీనవర్గాల గొంతుకగా నిలవాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బలహీన వర్గాల సంక్షేమ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. తాటి, ఈత చెట్లకు సంబంధించి ఉపఉత్పత్తులను పెంచాలని సూచించారు. ఉపఉత్పత్తులను 80కి పైగా పెంచి మార్కెట్ కల్పించేలా చర్యలు చేపడతామని వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలుగా నిలిచే కలవృత్తులను ప్రోత్సహిస్తామని వెల్లడించారు. ఏ వృత్తిలోనైనా నైపుణ్యాలు పెంచే దిశగా స్కిల్ వర్సిటీలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
రియల్ ఎస్టేట్‌తో తాటి వనాలు కనుమరుగు : తాటి వనాల పెంపు కోసం ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని సీఎంను గీత కార్మికులు కోరారు. అలాగే తాటివనంలోకి వెళ్లేందుకు మోపెడ్లు ఇవ్వాలని కార్మికులు అడిగారు. రియల్ ఎస్టేట్ పెరగడం వల్ల తాటి వనాలు కనుమరుగు అవుతున్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సమాధానం చెబుతూ సీఎం, రియల్ ఎస్టేట్ వెంచర్లలో కూడా రహదారుల పక్కన తాటి చెట్లు నాటాలని నిబంధన విధిస్తామని హామీ ఇచ్చారు. భూములు ఇవ్వాలంటే ప్రభుత్వ భూములకు అడ్డగోలుగా ధరలు పెరిగాయని చెప్పారు. తాటి వనాల కోసం ప్రత్యేకంగా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తామన్నారు. గీత కార్మికుల పిల్లలు బాగా చదువుకుని ఉన్నతస్థాయిలో ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
గీత కార్మికులతో కలిసి సీఎం భోజనం : ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేతులు మీదగా గీత కార్మికులకు బీసీ కార్పొరేషన్ ద్వారా కాటమయ్య రక్ష కిట్ల పంపిణీని చేపట్టారు. ఆధునిక టెక్నాలజీతో ఈ సేఫ్టీ కిట్లును హైదరాబాద్ ఐఐటీ తయారు చేసింది. సమావేశం ముగిసిన అనంతరం గీత కార్మికులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భోజనం చేశారు.
వెదురు బొంగుల్లో తాటికల్లు - టేస్ట్ చూస్తే వారెవ్వా అనాల్సిందే