CM Revanth in Brahmakumaris program : తెలంగాణ ప్రభుత్వ మార్గంలోనే బ్రహ్మ కుమారీస్ నడుస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తుమ్మల నాగేశ్వరరావు 22 ఏళ్ల క్రితం మౌంట్ అబూ సందర్శించారని, వారి సూచనల మేరకు ఇక్కడ ఈ శాంతి సరోవర్ ప్రారంభమైందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో చార్మినార్, గోల్కొండ, శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఉన్నట్టే బ్రహ్మకుమారీలు కూడా ఉన్నారని చెప్పుకోవాలని సీఎం వ్యాఖ్యానించారు.
రైతులకు పెద్దపీట : గచ్చిబౌలిలో నిర్వహించిన బ్రహ్మ కుమారీస్ ద్విదశాబ్ధి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన కార్యాచరణను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్ నుంచి యువతను రక్షించేందుకు ఎంతో కృషి చేస్తున్నామని, రైతులను రుణ విముక్తులను చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఒకే విడతలో రైతులకు రూ.31 వేల కోట్లు రుణాలు మాఫీ చేస్తున్నామని, దేశంలో ఒకేసారి ఇంత మొత్తంలో రైతులకు రుణమాఫీ చేసిన రాష్ట్రం మరొకటి లేదని వ్యాఖ్యానించారు.
త్వరలో స్కిల్‌వర్సిటీ ప్రారంభం : రాష్ట్ర ప్రభుత్వం ఎజెండాకు, బ్రహ్మకుమారిల ఎజెండా ఆదర్శంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బ్రహ్మ కుమారీస్ కూడా డ్రగ్స్ నిర్మూలనకు ప్రయత్నించటం సంతోషకరమని, రైతుల ఆత్మహత్యలు తగ్గించేందుకు కూడా బ్రహ్మ కుమారీస్ కృషి చేస్తున్నారని సీఎం హర్షం వ్యక్తం చేశారు. యువతలో నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఆనంద్ మహీంద్రను ఛైర్మన్‌గా నియమించి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.
అండగా ఉంటాం : బ్రహ్మాకుమారీస్ సంస్థకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. మరో రెండు సంవత్సరాల్లో శాంతి సరోవర్ లీజు ముగియనుందని తమ దృష్టికి వచ్చిందని, తెలంగాణ ప్రభుత్వం శాంతి సరోవర్ లీజును రెన్యువల్ చేయడమే కాకుండా అన్ని రకాలుగా తోడుంటుందని స్పష్టం చేశారు. మౌంట్ అబూ తర్వాత ఇక్కడ శాంతి సరోవర్ ఉండడం అనేది తెలంగాణ ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల, శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
"తెలంగాణ ప్రభుత్వ మార్గంలోనే బ్రహ్మ కుమారీస్ నడుస్తున్నారు. డ్రగ్స్ నుంచి యువతను రక్షించేందుకు ఎంతో కృషి చేస్తున్నాము. రైతులను రుణ విముక్తులను చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. ఒకే విడతలో రైతులకు రూ.31 వేల కోట్లు రుణాలు మాఫీ చేస్తున్నాము". - రేవంత్ రెడ్డి, సీఎం
'వచ్చే విద్యా సంవత్సరానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ' - CM REVANTH ON SPORTS UNIVERSITY