CM Revanth Meeting on National Highways : రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి తమ పూర్తి సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రహదారుల నిర్మాణానికి ఏవైనా ఆటంకాలు ఉంటే వాటిని తొలగిస్తామని స్పష్టం చేశారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు.
భూ సేకరణ, తదితర ఇబ్బందులను సీఎంకు వివరించారు. ఆరు రహదారులను ఎన్‌హెచ్ఏఐ ప్రధానంగా ప్రస్తావించింది. ఎన్‌హెచ్ 163లో మంచిర్యాల-వరంగల్-ఖమ్మం-విజయవాడ కారిడార్ నిర్మాణానికి భూముల అప్పగించాల్సి ఉందని ఎన్‌హెచ్ఏఐ అధికారులు సీఎంకు తెలిపారు. ఎన్‌హెచ్ 63లో ఆర్మూర్-జగిత్యాల- మంచిర్యాల రహదారికి భూసేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సి ఉందన్నారు.
రహదారుల నిర్మాణంలో పోలీస్ భద్రత అవసరం : ఎన్‌హెచ్ 563లో వరంగల్- కరీంనగర్ రహదారి నిర్మాణానికి చెరువు మట్టి, ఫ్లై యాష్ కావాలని చెప్పారు. ఎన్‌హెచ్ 44తో కాళ్లకల్-గుండ్లపోచంపల్లి రహదారి ఆరు వరుసలుగా విస్తరించేందుకు భూసేకరణ చేయాలని సీఎంకు వివరించారు. ఖమ్మం- దేవరపల్లి, ఖమ్మం- కోదాడ రహదారుల నిర్మాణంలో పోలీస్ భద్రత అవసరం ఉందని ముఖ్యమంత్రికి జాతీయ రహదారుల అధికారులు తెలిపారు.
విద్యుత్ సంస్థలతో తలెత్తుతున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. స్పందించిన ముఖ్యమంత్రి జాతీయ రహదారుల అధికారులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి బుధవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. రహదారులు నిర్మాణం జరిగే జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు కూడా పాల్గొంటారని, సమస్యలపై చర్చించి అక్కడికక్కడే పరిష్కరించుకుందామని ఎన్‌హెచ్ఏఐ అధికారులకు సీఎం తెలిపారు.
TG RRR Construction Development : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణానికి సహకరించాలని ఎన్‌హెచ్ఏఐ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. భారత్ మాల పథకంలో ఆర్ఆర్ఆర్ను చేపట్టాలని ప్రధాని మోదీని ఇటీవల కోరిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.
ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య 12 రేడియల్ రోడ్లు నిర్మించడంతో పాటు, వాటి మధ్య పలు క్లస్టర్లు, శాటిలైట్ టౌన్షిప్లు నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కాంట్రాక్టు సంస్థతో మాట్లాడి హైదరాబాద్ - మన్నెగూడ రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం కోరారు.
రహదారుల నిర్మాణం పురోగతిపై ప్రతివారం నివేదిక ఇవ్వాలి : హైదరాబాద్-విజయవాడ రహదారి విస్తరణ పనులను వెంటనే మొదలు పెట్టాలన్నారు. హైదరాబాద్ - విజయవాడ మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయత్నిస్తోందని అధికారులు తెలపగా, ఏపీ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టు చేపట్టాలని సూచించారు.
తెలంగాణకు తీరప్రాంతం లేనందున, డ్రైపోర్టు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన సీఎం, దీనికోసం బందర్ పోర్టును అనుసంధానించేలా హైస్పీడ్ ఎక్స్ప్రెస్ వే నిర్మించాలని జాతీయ రహదారుల అధికారులకు రేవంత్ సూచించారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణం పురోగతిపై ప్రతీ వారం తనకు నివేదిక ఇవ్వాలని సీఎంవో కార్యదర్శి షానవాజ్ ఖాసీంను ముఖ్యమంత్రి ఆదేశించారు.