Revanth Reddy about 2028 Olympics : ప్రత్యేక రాష్ట్రం వచ్చాక క్రీడలను నిర్లక్ష్యం చేశారని, పదేళ్లలో యువత గంజాయి, డ్రగ్స్‌కు బానిసలు అయ్యారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడల్లో రాణించినవారికి ఉన్నత ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. నిబంధనలు సవరించి బాక్సర్ నిఖత్ జరీన్‌కు పోలీసు శాఖలో ఉద్యోగం ఇచ్చామని గుర్తుచేశారు. ఇంటర్మీడియట్ చదివిన క్రికెటర్ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ అథ్లెట్లకు శిక్షణ ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని వెల్లడించారు. హైదరాబాద్ క్రీడలకు వేదికగా కావాలని, 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ అథ్లెట్లు పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
అండర్-17 ఫుట్‌బాల్ జట్టును దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు. 25 ఏళ్ల క్రితం క్రీడల నిర్వహణలో దేశానికే తలమానికంగా నిలిచామని అన్నారు. చదువే కాదని, క్రీడల్లో రాణించినా మంచి భవిష్యత్ ఉంటుందని తెలిపారు. ఇవాళ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ క్రీడలు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డి క్రీడాజ్యోతిని వెలిగించి సీఎం కప్ క్రీడల లోగో, మస్కట్‌ను విడుదల చేశారు. ఈ నెల 21 నుంచి పోటీలు ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఇటీవల పలు క్రీడల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులను రెండు లక్షల నగదు బహుమతిని అందజేశారు. బాక్సర్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వగా ఆమెకు లాఠీని అందించి శుభాకాంక్షలు తెలిపారు.
'గత పదేళ్లలో క్రీడలను నిర్లక్ష్యం చేశారు. యువత గంజాయి, డ్రగ్స్‌కు బానిసలు అవుతున్నారని పేపర్లల్లో, టీవీల్లో చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. హైదరాబాద్ క్రీడలకు వేదికగా కావాలని ఈరోజు సీఎం కప్ వేడుకలను ప్రారంభించాం. సిరాజ్ ఇంటర్మీడియట్ వరకే చదివినా క్రీడల్లో రాణించినందుకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు సవరించి డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది'-రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
యువత వ్యసనాల జోలికి వెళ్లవద్దు : మతాలకు అతీతంగా దేశ ప్రతిష్ఠతను పెంపొందించేది క్రీడాకారులే అని రేవంత్‌రెడ్డి కొనియాడారు. త్వరలో ఎల్బీ స్టేడియంను అద్భుతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. 2018లో కొడంగల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి తాను ఓడిపోయానని, 2019లో ఎంపీగా గెలిచానని, ప్రస్తుతం సీఎంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. యువత వ్యసనాల జోలికి వెళ్లవద్దని, వ్యసనాల వల్ల ఏం సాధించలేరని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో క్రీడల సలహాదారులు జితేందర్ రెడ్డి, టీపీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, ఎంపీ అనిల్ కుమార్, తెలంగాణా క్రీడా ప్రాధికార సంస్థ చైర్మెన్ శివసేన రెడ్డి, డీజీపీ జితేందర్ పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.
'ఈరోజు నిఖత్ జరీన్, సిరాజ్, పీవీ సింధు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్ఠలు సంపాదించిన క్రీడాకారులు. మతాలకు అతీతంగా దేశ ప్రతిష్ఠతను పెంపొందించేది కూడా క్రీడాకారులే. క్రీడల్లో రాణించినవారికి మంచి భవిష్యత్ ఉంటుంది'-రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి