CM Revanth Meet Union Minister Nitin Gadkari : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటన మూడోరోజు కొనసాగుతోంది. ఈ పర్యటనలో పార్టీ పెద్దలతో పాటు పలువురు కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు. ఇవాళ మూడోరోజు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఎమ్మెల్యే వివేక్ ఉన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరమ, నూతన జాతీయ రహదారుల ప్రకటన, ఇప్పటికే జాతీయ రహదారులుగా ప్రకటించిన మార్గాల పనుల ప్రారంభం తదితర విషయాలను కేంద్రమంత్రి దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. సంగారెడ్డి నుంచి నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-జగదేవ్‌పూర్-భువనగిరి-చౌటుప్పల్(158.645కిమీ) రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని కోరారు. దాని భూ సేకరణకు అయ్యే వ్యయంలో సగ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని కేంద్రమంత్రి గడ్కరీకి సీఎం వివరించారు. చౌటుప్పల్ నుంచి అమన్‌గల్-షాద్‌నగర్-సంగారెడ్డి(181.87కిమీ) రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలన్నారు.
ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించి, ఈ ఏడాది ఎన్‌హెచ్ఏఐ వార్షిక ప్రణాళికలో నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నుంచి వలిగొండ-తొర్రూర్-నెల్లికుదురు-మహబూబాబాద్-ఇల్లెందు-కొత్తగూడెం వరకు రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలన్నారు. ఇందులో కేవలం ఒక ప్యాకేజీ కింద 69 కిమీలకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ రహదారిలో మిగిలిన మూడు ప్యాకేజీలకు(165కిమీ) టెండర్లు పిలిచినందున వెంటనే పనులు ప్రారంభించాలన్నారు.
హైదరాబాద్-విజయవాడ హైవే ఆరు వరుసలు : హైదరాబాద్-విజయవాడ (ఎన్‌హెచ్ 65) జాతీయ రహదారిని 2024, ఏప్రిల్‌లోగా ఆరు వరుసలుగా విస్తరించాల్సి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య కీలకమైన ఈ రహదారిలో రోజుకు 60 వేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, వాహనాల రద్దీతో ప్రమాదాలు చోటు చేసుకొని పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌హెచ్ఏఐ, కాంట్రాక్ట్ సంస్థ మధ్య వివాదాన్ని పరిష్కరించి త్వరగా ఆరు వరుసలుగా రహదారి విస్తరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఐకానిక్ బ్రిడ్జి, ఎలివేటెడ్ కారిడార్ : కల్వకుర్తి నుంచి కొల్లాపూర్-సోమశిల-కరివెన-నంద్యాల (ఎన్‌హెచ్-167కే) మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రకటించి 142 కి.మీ. పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారని కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. మిగిలిన 32 కి.మీ.పనులకు, ఐకానిక్ బ్రిడ్జికి టెండర్లు పిలిచారని, ఆ పనులు వెంటనే ప్రారంభించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్ వాసులకు తిరుపతికి 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివరించారు.
కల్వకుర్తి-నంద్యాల రహదారి (ఎన్‌హెచ్ -167కే) హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో ఉన్న రహదారిలో (ఎన్‌హెచ్ 765కే) 67 కిలోమీటర్ వద్ద (కల్వకుర్తి) ప్రారంభమవుతుంది. ఎన్‌హెచ్ 167కే జాతీయ రహదారి పనులు చేపట్టినందున, హైదరాబాద్- కల్వకుర్తి వరకు ఉన్న (ఎన్‌హెచ్ 765కే) రహదారిని రెండు వరుసల నుంచి నాలుగు వరుసలుగా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. కల్వకుర్తి-కరివెన వరకు జాతీయ రహదారి పూర్తయ్యే లోపు ఈ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరణకు అనుమతులు ఇవ్వాలని కోరారు.
ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో నాలుగు వరుసలు : హైదరాబాద్-శ్రీశైలం(ఎన్‌హెచ్ 765) మార్గంలో 62 కిలోమీటర్లు ఆమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉందని, అటవీ అనుమతులు లేక అక్కడ పనులు చేపట్టలేదని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి తెలిపారు. ఈ మార్గంలో నిత్యం ఏడువేలకుపైగా వాహన రాకపోకలు సాగిస్తాయని, ఈ నేపథ్యంలో ఆమ్రాబాద్ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌కు అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
మంథనికి జాతీయ రహదారిని ప్రకటించాలి : మంథని నుంచి సీనియర్ మంత్రి శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు, మాజీ సభాపతి శ్రీపాదరావు గతంలో ప్రాతినిధ్యం వహించారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇప్పటి వరకు జాతీయ రహదారుల చిత్రంలో మంథనికి చోటు దక్కలేదన్నారు. జగిత్యాల-పెద్దపల్లి-మంథని-కాటారం రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని కోరారు.
తగిన నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఈ రహదారి పూర్తయితే ఎన్‌హెచ్-565, ఎన్‌హెచ్-353సీ అనుసంధానమవుతాయని, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రజలకు అనువుగా ఉంటుందని, దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన కాళేశ్వరం క్షేత్రానికి అనుసంధానత పెరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ కేంద్ర మంత్రికి వివరించారు.
మరిన్ని విషయాలు : జగిత్యాల-కాటారం (130 కి.మీ.), దిండి-నల్గొండ (100 కి.మీ.), భువనగిరి-చిట్యాల (44 కి.మీ), చౌటుప్పల్-సంగారెడ్డి (182 కి.మీ), మరికల్-రామసముద్రం (63 కి.మీ.), వనపర్తి-మంత్రాలయం (110 కి.మీ.), మన్నెగూడ-బీదర్ (134 కి.మీ.), కరీంనగర్-పిట్లం (165 కి.మీ.), ఎర్రవెల్లి క్రాస్ రోడ్-రాయచూర్ (67 కి.మీ.), కొత్తపల్లి-దుద్దెడ (75 కి.మీ.), సారపాక-ఏటూరు నాగారం (93 కి.మీ.), దుద్దెడ-రాయగిరి క్రాస్ రోడ్ (63 కి.మీ.), జగ్గయ్యపేట-కొత్తగూడెం (100 కి.మీ.), సిరిసిల్ల-కోరట్ల (65 కి.మీ.), భూత్పూర్-సిరిగిరిపాడు (166 కి.మీ.), కరీంనగర్-రాయపట్నం (60 కి.మీ.) మొత్తం 1617 కి.మీ.జాతీయ రహదారులను అప్‌గ్రేడ్ చేయాలి.