CM Jagan Negligence on SC and ST Students : ఐదేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీలకు చరిత్రలో ఎన్నడూ, ఏ ముఖ్యమంత్రీ చేయని ద్రోహం చేశారు సీఎం జగన్. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం రద్దుతోనే దళిత, గిరిజన సంక్షేమంపై జగన్ తొలి వేటు వేశారు. ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించి, ప్రోత్సాహించేందుకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను జల్లెడ పట్టి వారు కోరుకున్న ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో చదివేందుకు అవకాశాలు కల్పించింది. వారికి పుస్తకాల నుంచి యూనిఫాం వరకూ అన్నింటినీ సమకూర్చింది. ఇలా 2014 నుంచి 2019 మధ్య దాదాపు లక్షా 40 వేల మందికి లబ్ధి చేకూర్చింది. ఈ ఒక్క పథకం కోసమే ఏటా 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దళిత బిడ్డలు చదువుకోవడం ఇష్టం లేదేమోగానీ 2019లో అధికారంలోకి వచ్చాక జగన్ ఆ పథకాన్ని రద్దు చేశారు. కొనసాగించాలని ఎస్సీ సంఘాలు న్యాయపోరాటం చేస్తే, జగన్ వారికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వరకూ వెళ్లి చివరకు చీవాట్లు తిన్నారు. సుప్రీంకోర్టు ఆదేశించే సరికి అయిష్టంగా, అరకొరగా అమలు చేశారు. టీడీపీ ప్రభుత్వం 3 నుంచి 10వ తరగతి వరకూ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని అమలు చేస్తే జగన్ దాన్ని కేవలం 9, 10 తరగతులకే పరిమితం చేశారు.
దళితులపై జగన్ కపట ప్రేమ - చేయిపట్టుకుని నడిపిస్తున్నామంటూనే వెన్నుపోటు
ఇక 30 ఏళ్లుగా ఎస్సీల కోసం వివిధ ప్రభుత్వాలు అమలు చేసిన భూమి కొనుగోలు పథకాన్నీ జగన్ రద్దు చేశారు. ఈ పథకం కింద ఎస్సీ కుటుంబానికి కనీసం ఎకరం పొలం కొనుగోలు చేసి, సాగుకు అనుకూలంగా మార్చి ఇవ్వాలి. 1988 నుంచి 2019 వరకూ 23 వేల 802 మంది ఎస్సీ మహిళలకు 24 వేల ఎకరాలను ఆయా ప్రభుత్వాలు అందించాయి.! జగన్ ఒక్కరికి కూడా ఒక సెంటు భూమి కొనివ్వలేదు. 2019 బడ్జెట్‌లో 35 కోట్ల రూపాయలు కేటాయించి, ఆ తర్వాత ఇతర పథకాలకు మళ్లించారు. ఇది దళితులకు జగన్ చేసిన రెండో ద్రోహం.
ఎస్సీలపై జగన్ కొట్టిన మరో దెబ్బ స్వయం ఉపాధి రాయితీ రుణాల రద్దు. తెలుగుదేశం హయాంలో 40 నుంచి 90 శాతం రాయితీతో లక్ష నుంచి 5 లక్షల వరకూ రుణాలు ఇచ్చారు. 85 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1739 మందికి ఇన్నోవా, ఇతియోస్ వంటి కార్లను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించారు. 2019లో 3.15 లక్షల మంది ఎస్సీ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన జగన్ సర్కార్ ఒక్కరికంటే ఒక్కరికీ రాయితీ రుణాలివ్వలేదు. పైగా టీడీపీ ప్రభుత్వం ఎస్సీలకు ఉపాధి కల్పన కోసం బ్యాంకుల్లో 200 కోట్ల రూపాయలు ఉంచితే, వైఎస్సార్సీపీ సర్కార్ వాటినీ వెనక్కి తీసుకుని ఇతర పథకాలకు మళ్లించింది.
కేంద్ర ప్రభుత్వ సంస్థలైన జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ, జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థలు అందించే రుణాలకూ వైసీపీ సర్కార్ మోకాలడ్డింది. ఈ సంస్థలు టర్మ్‌లోన్ పేరిట గరిష్ఠంగా 50 లక్షలు, సూక్ష్మరుణం కింద 3 లక్షల వరకూ ఇస్తాయి. రాయితీ గరిష్ఠంగా 50శాతం ఉంటుంది. ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర సంస్థలు ఇచ్చే 60శాతం రుణానికి, రాష్ట్రం 35శాతం రాయితీని జోడించి ఇవ్వాలి. లబ్ధిదారుడి వాటా 5శాతం. కానీ రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇవ్వకుండా పూర్తిగా పథకాలనే నిలిపేసింది. 2015-19 మధ్య టీడీపీ హయాంలో రాష్ట్రంలో 23 వేల మంది ఎస్సీ, ఎస్టీలకు 515 కోట్ల రూపాయలపైనే సాయం అందింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ టర్మ్ రుణాల కింద, ఏపీకి 6కోట్ల 54 లక్షల రుపాయలు కేటాయించినా రాష్ట్రం రాయితీ ఇవ్వలేదు. ఫలితంగా యూనిట్ల ఏర్పాటుకు గిరిజనులు ముందుకు రాలేదు. ఆయా వర్గాల నుంచి వ్యతిరేకత పెల్లుబకడంతో ఎన్నికల నోటిఫికేషన్‌కు ఆర్నెళ్ల ముమందు జాతీయ సఫాయి కర్మచారీ ఆర్థికాభివృద్ధి సంస్థ ద్వారా కేంద్రమిచ్చిన 38 కోట్ల రూపాయలతో ఇటీవల 100 మందికి మురుగు శుద్ధి వాహనాలు పంపిణీ చేశారు. ఇందులోనూ వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయైనా కేటాయించలేదు.
అంబేడ్కర్ విదేశీ విద్య పథకం నిర్వర్యంతో జగన్ ఎస్సీ,ఎస్టీలపై మరో వేటు వేశారు. దళిత, గిరిజన బిడ్డలు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు తెలుగుదేశం ప్రభుత్వం అంబేడ్కర్ విదేశీ విద్య పథకం తెచ్చింది. 15 దేశాల్లో కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు 2014-19 మధ్య 491 మందికి ఆర్థికసాయం అందించింది. జగన్ అధికారంలోకి వచ్చాక మూడేళ్లపాటు ఈ పథకాన్ని పక్కన పెట్టారు. ఆ తర్వాత ఎక్కడలేని నిబంధనలు తెచ్చి అర్హుల సంఖ్య పెరగకుండా చూశారు. తొలుత క్యూఎస్ ర్యాకింగ్‌లో టాప్ 200లోని వర్సిటీల్లో సీటు సంపాదించిన వారికే ఆర్థిక సాయమని ప్రకటించారు. ఆ తర్వాత టాప్-50 ర్యాంకింగ్ వర్సిటీల్లో సీటు పొందిన వారికే పరిమితం చేశారు. పథకానికి అంబేడ్కర్ పేరును తీసేసి తన పేరును పెట్టుకున్న జగన్ 50 మందికి ఎస్సీ విద్యార్థులకైనా సాయం చేయలేదు. ఎస్టీ విద్యార్థుల్లో ఒక్కరంటే ఒక్కరినే విదేశీ విద్య పథకానికి అర్హుడని తేల్చారు. జగన్ మోసానికి ఇంతకంటే రుజువేముంది?
జగనన్న మార్క్ మోసం- నా ఎస్సీ, నా ఎస్టీ అంటూనే సంక్షేమాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తూట్లు
ఎస్సీ, ఎస్టీ బిడ్డలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన శిక్షణను ఉచితంగా అందించేందుకు ఏర్పాటైన అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లనూ జగన్ నామమాత్రంగా మార్చేశారు. తెలుగుదేశం హయాంలో విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసి సివిల్స్, రైల్వే, గ్రూప్స్, డీఎస్సీ సహా వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇప్పించారు. అప్పట్లో విజయవాడ కేంద్రంలో శిక్షణ తీసుకున్న 385 మంది విద్యార్థుల్లో 121 మంది, తిరుపతిలో 402 మందిలో 78 మంది ఉద్యోగాలు సాధించారు. అధికారం చేపట్టిన మొదటి రెండేళ్లు స్టడీ సర్కిళ్లు పట్టించుకోని జగన్ ఆ తర్వాత ఒక్కసారి మాత్రమే సివిల్ సర్వీసెస్‌కు, గ్రూప్-1, బ్యాంకు పీవో ఉద్యోగాలకు శిక్షణ ఇప్పించారు.
ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ వంటి సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలు ఎదుర్కొనేందుకు దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు ఇలా కోరుకున్నచోట ఎస్సీ, ఎస్టీ బిడ్డలకు తెలుగుదేశం ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన శిక్షణ ఇప్పించింది. ఒక్కో విద్యార్థిపై 80 వేల నుంచి లక్షా 20 వేల రూపాయల వరకు ఖర్చు చేసింది. పుస్తకాలు, మెటీరియల్, ఇతర ఖర్చులకు నెలనెలా 12 వేల రూపాయల చొప్పున 9 నెలలపాటు అందించింది. మొత్తంగా 1,200 మంది ఎస్సీ విద్యార్థులకు, 910 మంది గిరిజన విద్యార్థులకు శిక్షణ అందించింది. జగన్ అధికారంలోకి రాగానే దీన్నీ రద్దు చేశారు. ఎస్సీ, ఎస్టీలు ప్రైవేటుగా పీజీ చేసినా గత ప్రభుత్వాలు ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇచ్చారు. జగన్ జమానాలో దాన్ని రద్దు చేశారు. ఇక కొత్త వైద్య కళాశాలల్లో 50శాతం సీట్లు అమ్మకానికి పెట్టిన జగన్ ఎస్సీ, ఎస్టీలకు సీట్లు దక్కకుండా కుతంత్రం చేశారు.
ఇక వైసీపీ ఏలుబడిలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమ వసతి గృహాల నిర్వహణ అధ్యానంగా తయారైంది. నాడు-నేడు కింద 3వేల300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడతామని ఏడాది క్రితం ప్రకటించినా ఇప్పటివరకు ఆయా పనులకు అతీగతీ లేదు. కొన్నిచోట్ల ఒకే గదిలో పిల్లల్ని కుక్కేస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా మరుగుదొడ్లు, స్నానపు గదులు లేవు. ఇక్కట్ల మధ్యే ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు చదువులు కొనసాగిస్తుంటే డైట్, కాస్మొటిక్ ఛార్జీలు నాలుగు నెలలుగా చెల్లించకుండా జగన్ వేడుక చూస్తున్నారు. ఆఖరికి సంక్షేమ వసతి గృహాల్లో అవసరాలకు సరిపడా వంట గ్యాస్‌నూ ప్రభుత్వం అందించడం లేదు. ఇన్ని దారుణాలకు ఒడిగట్టిన జగన్ తాను పిల్లలకు మేనమామనంటూ ప్రచారం చేసుకుంటున్నారు. బడుగు, బలహీనవర్గాల పిల్లల్ని క్షోభ పెడుతున్నారు.
ఎస్సీ, ఎస్టీలపై జగన్ స్వీట్ మాటలు - పథకాలు కట్- ఉపాధిని దూరం చేసి కట్టు బానిసలుగా మార్చాలనే కుట్ర!