CM Jagan Negligence on People Health : వినేవాడు వెర్రినాగన్నైతే చెప్పేవాడు జగనన్న అని జనం ఊరికే తిట్టుకోవడం లేదు! వైద్యారోగ్య రంగానికి విప్లవాత్మక చర్యలతో చికిత్స చేశాం, ఏదైనా జబ్బు బారినపడితే రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందించేలా సమూల మార్పులు చేశాం వంటి కల్లబొల్లి కబుర్లకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు జగన్. నోటికొచ్చినట్లు అబద్ధాలాడితే ప్రజలు అసహ్యించుకుంటారనే ఇంగిత జ్ఞానం కూడా సీఎంలో కనపడదు. ప్రభుతాసుపత్రులకు మహర్దశ పట్టిస్తానంటూ పదవిలోకి వచ్చిన ఆయన సర్కారీ దవాఖానాల్లో మందులకూ దిక్కు లేకుండా చేశారు. బిల్లుల చెల్లింపులకు ఎగనామం పెట్టి ఆరోగ్యశ్రీనీ అవస్థల పాల్జేశారు. సామాన్యులకు సకాలంలో నాణ్యమైన వైద్యసేవలు అందకుండా చేసిన జగన్ ఏపీ ఆరోగ్యాన్ని హరించిన మురికి రాజకీయ ముఠా నాయకుడు.
జగన్ కాళ్ల కింద జన జీవనహక్కు! : ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని 47వ రాజ్యాంగ అధికరణ నిర్దేశిస్తోంది. ఆరోగ్యంగా జీవించడం అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. దాన్ని సంరక్షిస్తూ ప్రజలకు వైద్యారోగ్య సేవలను సక్రమంగా అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు ఎప్పుడో స్పష్టంచేసింది. రాజ్యాంగ అధికరణలు, న్యాయపాలిక ఆదేశాలను లెక్కచేయని జగన్ వైద్యారోగ్య రంగాన్ని ఉద్ధరిస్తున్నానంటూ గాలిమాటలు చెబుతూ, సర్కారీ ఆసుపత్రులను అన్ని విధాలుగా భ్రష్టు పట్టించారు. జన జీవనహక్కును తన పాదాలకింద వేసుకుని తొక్కిపడేశారు.
చీకట్లో ప్రభుత్వ ఆసుపత్రి - సెల్ ఫోన్ వెలుతురులోనే వైద్య సేవలు
ఏలూరు జిల్లా తేరగూడేనికి చెందిన వీరాబత్తిని కన్నయ్య ఊపిరితిత్తుల చికిత్స కోసం గతేడాది డిసెంబర్‌లో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు వార్డుల్లో మంచాల్లేవన్నారు. మనిషి ప్రాణాపాయంలో ఉన్నాడని బతిమాలినా వినకుండా రాత్రి 9న్నర గంటల సమయంలో ఇంటికెళ్లిపోమని చెప్పేశారు. ఆ రాత్రి ఆసుపత్రి ఆవరణలోనే కన్నయ్య ప్రాణం పోయింది. ఇది సర్కారీ దవాఖానాల్లో బెడ్ల కొరతను పట్టించుకోకుండా పైలాపచ్చీసు వేషాలేసిన జగన్ ప్రభుత్వం చేసిన హత్యే.
పని తక్కువ ప్రగల్భాలెక్కువ! : ఒక సీఎంగా జనంకోసం చేయాల్సినవి చేయని జగన్ ప్రగల్భాలకు కొదవేలేదు! సిగ్గూశరం అనేవాటికి నీళ్లొదిలేసి ప్రభుత్వాసుపత్రులు మారాయంటే కారణం మీ జగన్ అంటూ ఆయన జబ్బలుచరుకుంటున్నారు. జగన్ ఏలుబడిలో సర్కారీ దవాఖానాలు ఎంతలా దిగజారాయో చూడాలంటే దొరగారి స్వస్థలానికి వెళ్తే సరిపోతుంది. కడప శివారులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోజుకు ఇరవైమందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేచోట గతేడాది నవంబరులో పైకప్పు పెచ్చులూడిపడ్డాయి! 15 రోజుల ముందే అక్కడ శస్త్రచికిత్సలు నిలిపివేడయంతో ప్రమాదం తప్పిందిగానీ.. లేదంటే ఎవరో ఒకరి తలలు పగిలేవి.
తిరుపతిలోని స్విమ్స్ కొవిడ్ ఆసుపత్రిలో పైపెచ్చులు మీదపడి 3నెలల గర్భవతైన ఉద్యోగిని ప్రాణాలు పోగొట్టుకుంది. సర్కారీ ఆసుపత్రుల సొబగు ఇలా ఉంటే వైద్యసేవలూ అలాగే అఘోరిస్తున్నాయి. కొన్నిచోట్ల అసలు ఎవరు వైద్యం చేస్తున్నారో తెలుసుకుంటే గుండెలవిసిపోతాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన రామకృష్ణారావు అనే వ్యక్తిని నెల్లూరు జిల్లా ఆత్మకూరు సర్కారీ దవాఖానాకు తీసుకెళ్తే డాక్టర్లు లేక స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులే అతనికి వైద్యం చేశారు. ఆపై పరిస్థితి విషమించి ఆయన మరణించాడు.
పల్నాడు జిల్లా మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో బొడ్డుతాడు కోయాల్సింది బిడ్డ వేలు తెగ్గోశారు. దానికి కారకురాలంటూ ఓ పారిశుద్ధ్య కార్మికురాలిపై చర్యలు తీసుకున్నారు. అసలు ఆ పని ఆమెకు అప్పగించిందెవరు? ఆసుపత్రుల బాగోగుల గురించి ఆరా తీసే నాథుడు లేని జగన్ రాజ్యంలో ఇలాంటి దారుణాలు ఎన్నెన్నో!
మడమ తిప్పడంలో మొనగాడు : అధికారంలోకొచ్చిన రెండేళ్లలోగా కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ ఒట్టేశారు. ఐదేళ్లుగడినా సర్కారీ ఆసుపత్రులకొచ్చే సామాన్యులకు సరైన వసతులు సమకూర్చలేదు. విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో ఒకే మంచంపై ఇద్దరు గర్భిణుల్ని ఉంచుతున్న పరిస్థితి. పడకల కొరత తీర్చేందుకు 25 లక్షల రూపాయలతో తాత్కాలిక షెడ్డు నిర్మించినఅప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కొత్త బ్లాక్ నిర్మాణానికి 19 కోట్లు కేటాయించింది. పునాదులు, పిల్లర్ల దశ వరకూ సాగిన పనలు వైసీపీ అధికారంలోకి వచ్చాక పడకేశాయి. నేటికీ ఆ నిర్మాణం పూర్తిచేయించలేదు.
గుంటూరు జిల్లా పత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం కొత్త భవన నిర్మాణం ప్రారంభమై నాలుగేళ్లైనా పూర్తికాలేదు. విలేజ్ హెల్త్ క్లినిక్‌ల పేరిట జగన్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. బ్రహ్మాండం బద్దలు కొట్టేసినట్లు గప్పాలు కొట్టుకునే ఆయన గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలను నడిమధ్యలోనే వదిలేశారు. పల్లెల్లో 8వేల 332 ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసిన జగన్ సర్కార్ వాటిలో 2వేల899 కేంద్రాల పనులను ఏదో ఒక వంకతో ఆపేసింది. గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించని కారణంగా గత డిసెంబరు నాటికి 5వేల414 భవనాల నిర్మాణాలు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. జమ్మలమడుగులో అద్దెభవనంలో పట్టణ ఆరోగ్యం ఏర్పాటు చేశారు. నెలకు నాలువేల రూపాయల బాడుగ కూడా జగన్ సర్కార్ చెల్లించకపోవడంతో యజమాని చివరకు తాళం వేయాల్సిన పరిస్థితి.
సమస్యలకు నిలయాలుగా డయాలసిస్ సెంటర్లు!- ఏసీల్లో ఎలుకలు - Problems at Dialysis Centre
తెలుగుదేశం పార్టీపై కక్షతో జగన్ చేసిన పనికిమాలిన పనులూ ప్రజారోగ్యానికి శాపాలయ్యాయి. అన్నమయ్య జిల్లా మల్లెల గ్రామంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్య ఉపకేంద్రాన్ని నిర్మించారు. దాన్ని ప్రారంభించకుండా జగన్ సర్కారు పాడుపెట్టేసింది. మూడు పంచాయతీలకు వైద్యసేవలు అందించాల్సిన భవనాన్ని అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా మార్చేసింది. జగన్ చేతలన్నీ ఇలాంటివే- జనంకోసం ఆయన ఏమీ చేయరు, ఎవరైనా చేసినా పడనివ్వరు!
బీరాల ముఖ్యమంత్రీ.. మందులేవి? : 16 వేల కోట్ల రూపాయలతో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, బోధనాసుపత్రుల ఆధునికీకరణ అంటూ జగన్ అరచేతిలో వైకుంఠం చూపించారు. తిరుపతి, కాకినాడ, కర్నూలు, విజయవాడ, అనంతపురం సర్వజన ఆస్పత్రులల్లో ఎక్కడా రోగులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. క్యాథ్‌లాబ్‌ల అందుబాటు నుంచి కాలంచెల్లిన వైద్యఉపకరణాల వరకూ ప్రతిచోటా ఏదో ఒక సమస్య తిష్ఠవేసింది. వైద్యారోగ్య సిబ్బంది తగినంత సంఖ్యలో లేకపోవడమూ రోగులకు శాపమవుతోంది. కొత్తగా తెచ్చిన ఐదు బోధనాసుపత్రుల్లో ఏదీ సక్రమంగా పనిచేయట్లేదు.
ఏ పేదవాడూ మందులకోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం రానివ్వం అని ప్రతిపక్షనేతగా జగన్ తెగ బీరాలు పలికారు. సీఎం అయ్యాకేమో మందుబిళ్లలూ దొరకని దుస్థితిలోకి దవాఖానాలను నెట్టేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమైన ఔషధాలు ఉండటం లేదని, వ్యాధినిర్థరణ పరీక్షలూ సరిగ్గా జరగడం లేదని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయ నివేదికే తేల్చి చెప్పింది. వీల్‌ఛైర్లు, స్ట్రెచర్లకూ నోచుకోని సర్కారీ దవాఖానాల దుస్థితి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీల్లో బయటపడింది.
జగన్ ప్రచార కక్కుర్తి! : తెలుగుదేశం హయాంలో 104 సంచార వైద్యసేవలు మొదలయ్యాయి. వాటికే పైపై నగిషీలద్దీ ‘ఫ్యామిలీడాక్టర్’ పేరిట తన ఖాతాలో వేసుకున్న కక్కుర్తి జగన్‌ది. రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన 8 ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో అయిదింటికి భూములు కూడా కేటాయించని దౌర్భాగ్య పాలన జగన్‌ది! హెల్త్‌హబ్‌ల ఏర్పాటుతో ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తెస్తానని చెప్పి చేతులెత్తేసిన నిష్ప్రయోజకత్వం జగన్‌ది. సర్కారీ దవాఖానాల్లో కనీస వసతులు కల్పించకుండాయ గర్భిణులు, బాలింతలను విపరీతంగా ఏడిపించిన అమానుషత్వం జగన్‌ది!
కేంద్ర నిధులూ హుష్‌కాకి! : అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా జగన్ దగుల్బాజీతనం జనానికి తెలియదా? అయినాసరే, ఆయన ఆత్మస్తుతి ఆపరు. ఆరోగ్యశ్రీని విస్తరించి ఉచితంగా వైద్యం అందిస్తున్న ప్రభుత్వం మీ జగన్‌దే అని మొన్నా మధ్య డప్పు కొట్టుకున్నారు. ఆరోగ్యశ్రీ అనుబంధ ప్రైవేటు ఆసుపత్రులకు జగన్ సర్కారు చెల్లించాల్సిన బిల్లుల విలువ మొన్న మార్చినాటికి 1400 కోట్ల రూపాయలకు చేరింది. 60 రోజుల్లో జరగాల్సిన చెల్లింపులకు ఆర్నెళ్లు దాటిపోయినా అతీగతీ లేదు. ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలను అందించడం ఆపేస్తామని ప్రైవేటు ఆసుపత్రులు ఎన్నిసార్లు హెచ్చరించాయో లెక్కేలేదు. గ్రామీణ ప్రాంత వైద్యశాలలకు కేంద్రం నుంచి వచ్చే నిధులనూ జగన్ సర్కారు మధ్యలోనే మాయంచేసింది.
ఏపీలోని పల్లెల్లో వైద్య వసతులను మెరుగుపరచడం కోసం 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 514 కోట్ల రూపాయలను కేంద్రం ఇచ్చింది. నిరుడు నవంబరు నాటికి వాటిలో 25 కోట్ల రూపాయలు మాత్రమే వైద్యారోగ్య శాఖకు విదిల్చారు జగన్. మిగిలిన డబ్బు ఏం చేశారో ఆ దేవుడికే తెలియాలి! అంతకు ముందుఏడాదిలోనూ, కేంద్ర నిధులను జగన్ ప్రభుత్వం ఇలాగే దారిమళ్లించేసింది. నరసరావుపేట వంటి ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో దూది, బెడ్‌షీట్లు కూడా కరువయ్యాంటే- కారణం జగనాసుర పాలనే! జగన్‌మోహన్ రెడ్డి అసమర్థ, అరాచక నిర్వాకాలతో అంతిమంగా నష్టపోయింది. రోగాలు,రొష్టులతో బతుకులీడిస్తున్న సామాన్యులే!