Varikapudishela Project : చెంతనే కృష్ణమ్మ పక్కనే నాగార్జునసాగర్ డ్యామ్ ఉన్నా పల్నాడు జిల్లాలో వేలాది ఎకరాలకు సాగునీరు అందడం లేదు. తీవ్రమైన నీటి ఎద్దడితో పంటలు ఎండిపోతున్నాయి. అయిదేళ్ల వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో అడుగు ముందుకు పడలేదు. వరికపూడిశెల ప్రాజెక్టు పనుల ప్రారంభం కేవలం ఎన్నికల హడావుడిగా మిగిలిపోయింది. పల్నాడుకు తీరని అన్యాయం చేసిన జగన్ మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు జిల్లాలో పర్యటిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరాంధ్రపై మాటల్లోనే జగన్ ప్రేమ - అభివృద్ధిలో ఉత్త చేయే
CM Jagan Neglect Varikapudishela Project in Palnadu District : పల్నాటి రూపురేఖలను మార్చేలా రూ. 340 కోట్లతో వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తున్నట్లు 2023 నవంబర్ 15న సీఎం జగన్ గొప్పలు చెప్పారు. అన్ని అనుమతులూ వచ్చాకే శంకుస్థాపన చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రాజెక్టును దశల వారీగా వినుకొండ, ఎర్రగొండపాలెం ప్రాంతాలకు విస్తరిస్తామని బీరాలు పలికారు. జగన్ ఆర్భాటంగా శంకుస్థాపన చేసి నాలుగు నెలలు గడిచినా నిర్మాణ పనులు అడుగు ముందుకు పడలేదు.
నాగార్జునసాగర్ జలాశయం బ్యాక్‌వాటర్‌ను ఎత్తిపోసి పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో రైతులకు సాగునీరు అందించడానికి నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం మరోసారి ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పరిపాలనా అనుమతులు ఇచ్చి నిధులు కేటాయించి పనులను గుత్తేదారుకు సైతం అప్పగించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. వైల్డ్‌లైఫ్ నుంచి అనుమతులు వచ్చాయంటూ గతేడాది జగన్ అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఐతే అటవీ శాఖకు రూ.14.61 కోట్లు చెల్లించకపోవడంతో తమ భూమిలో పనులు చేసేందుకు వీల్లేదని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. మరో వైపు ప్రాజెక్టుకు సాంకేతికంగా పలు అనుమతులు రావాల్సి ఉంది. రెండుదశల్లో రూ. 1.25లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కీలకమైన ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకువచ్చి అటవీ శాఖకు అవసరమైన సొమ్ము చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన నేతలు మిన్నకుండిపోయారు. తీరా ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే పనులు ప్రారంభిస్తున్నట్లు నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హడావుడి చేసినా మూడు రోజులకే ఆ పనులు నిలిచిపోయాయి.
నాగార్జునసాగర్ కుడికాలువ పరిధిలో దుర్గి మండలంలో 3300 ఎకరాల్లో విస్తరించి ఉన్న బుగ్గవాగును 7 టీఎంసీల సామర్థ్యానికి పెంచితే తాగునీటికి శాశ్వత పరిష్కారంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో పంటలకు ఒకటి రెండు తడులు సాగునీరు ఇచ్చే వెసులుబాటు ఉంటుంది. 3.4 టీఎంసీల నుంచి సామర్థ్యమున్న బుగ్గవాగు విస్తరణ, కట్టల బలోపేతం, 7 టీఎంసీలు నీటిని నిల్వచేయడానికి సవివర ప్రాజెక్టు నివేదిక తయారీకి వైసీపీ ప్రభుత్వం రూ. 1.04 కోట్ల నిధులు కేటాయించింది. అక్టోబరు 2020లో గుత్తేదారుకు పనులు అప్పగించినా ఇప్పటికీ పూర్తికాని పరిస్థితి. ఎప్పటికప్పుడు గుత్తేదారుకు గడువు పెంచడం మినహా నివేదిక సిద్ధం కాలేదు.
పోలవరాన్ని జల్లెడ పడుతున్నారు!- నిషేధిత వలలతో చేపల వేటపై స్థానికుల ఆందోళన - Illegal Fishing
సాగర్ కుడికాలువ కింద ఆయకట్టు స్థిరీకరణకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెన్నా-గోదావరి అనుసంధాన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. గోదావరికి వరద సమయంలో వచ్చే నీటిని కృష్ణాకు తరలించి ఆ నీటిని సాగర్ కాలువలో ఎత్తిపోయడం ద్వారా పల్నాడు ప్రాంతంలో సాగు, తాగునీరు అందించాలనేది లక్ష్యం. గత ప్రభుత్వంలోనే పనులు మొదలై కొంత జరిగాయి. వైసీపీ వచ్చిన తర్వాత దీనిని వైఎస్సార్ పల్నాడు కరవు నివారణ పథకంగా పేరు మార్చారు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణం గుత్తేదారులకు చెల్లింపులు చేయకపోవడంతో పనులు అర్థంతరంగా నిలిచిపోయాయి. ప్రాజెక్టు ప్రాధాన్యం గుర్తించిన గత తెలుగుదేశం ప్రభుత్వం రూ. 620.15 కోట్లకు పరిపాలన అనుమతులిచ్చింది. ఇది పూర్తయితే 9,61,231 ఎకరాల సాగర్ ఆయకట్టును స్థిరీకరిస్తారు. గుంటూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాల రైతులకు లబ్ధి చేకూరేది.