CM Jagan Forget Their Promises : ముఖ్యమంత్రి ఏదైనా ప్రాంతానికి వచ్చి హామీల జల్లు కురిపిస్తే ఆ పనులన్నీ త్వరితగతిన పూర్తవుతాయని అక్కడ ప్రజలు భావిస్తారు. కానీ అంతా అనుకున్నట్లు జరిగితే ఆ సీఎం జగన్ ఎందుకవుతారు? రివర్స్ పాలన సాగించే మన ముఖ్యమంత్రి రూటే సపరేటు కదా! రెండేళ్ల క్రితం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సభలోనూ గుంటూరు ఛానల్ పొడిగింపు సహా వేళ్లపై లెక్కపెట్టలేనన్ని హామీలు గుప్పించారు. తీరా చూస్తే ఒక్కటి అమలుకు నోచుకోలేదు. దీంతో సీఎం ఇచ్చే హామీలకే దిక్కులేకపోతే సమస్యలు ఎలా తీరతాయని జనం చర్చించుకుంటున్నారు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ ఇన్నీకావు. రెండు సంవత్సరాలు దాటినా ఒక్క హామీకి సంబంధించిన పనులు ప్రారంభం కాలేదు. గుంటూరు ఛానల్ పొడిగింపుపైన అయితే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు రెండు సార్లు, సీఎం హోదాలో ఒకసారి హామీ ఇచ్చారు. ఛానల్ పొడిగింపు పనులకు గత ప్రభుత్వంలోనే పరిపాలనా అనుమతులు వచ్చి నిధులు కేటాయించారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో పనుల్ని నిలిపివేసింది. భూసేకరణ ప్రక్రియ తామే చేపట్టినట్లు ప్రచారం చేసుకోవటం కోసం గత ప్రభుత్వ కేటాయింపుల్ని రద్దు చేశారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా పరిధిలో 381 ఎకరాలు, బాపట్ల జిల్లా పరిధిలో 51 ఎకరాలు భూసేకరణకు సంబంధించి ప్రాథమిక ప్రకటన విడుదల చేశారు. రైతులకు పరిహారం ఇవ్వడానికి నిధులు మంజూరు చేయకపోవడంతో భూసేకరణకు ముందడుగు పడలేదు. సాక్షాత్తు సీఎం జగన్ ఇచ్చిన హామీకే దిక్కులేకపోతే ఎలాగంటూ స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సీఎం జగన్ ఇచ్చిన మిగిలిన హామీలను గాలికొదిలేశారు. ప్రత్తిపాడు ప్రధాన రహదారి విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. 7 కోట్ల నిధులు లేవని ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ పెండింగ్‌లో పెట్టింది. ప్రత్తిపాడులో తాగునీటి పంపిణీకి కొత్త పైపులైన్లు నిర్మించటానికి 13 కోట్లకు ఆమోదం తెలిపారు. జల జీవన్ మిషన్ (Jal Jeevan Mission) ద్వారా కేంద్రం నిధులు మంజూరు చేసినా పనులు మాత్రం చేపట్టలేదు.
హామీలపై బదులిచ్చాకే బస్సెక్కు - జగన్కు చంద్రబాబు సవాల్ - Chandrababu fire on Jagan
పెదనందిపాడులో 2 కోట్లతో క్రీడా వికాస కేంద్రం నిర్మించాలన్న ప్రతిపాదన కూడా అలాగే ఉండిపోయింది. శిథిలావస్థకు చేరిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని 2 కోట్ల 80 లక్షలతో నిర్మిస్తామన్న హామీ నెరవేరలేదు. పెదనందిపాడులో మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్మించటంతో పాటు కొన్ని చోట్ల సీసీ రోడ్లు వేయడానికి 7 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపినా నిధులకు మోక్షం లభించలేదు. దీంతో ఈసారి జగన్‌ని మరోసారి నమ్మే పరిస్థితి లేదని స్థానికులు చెబుతున్నారు.
జనానికి అరుంధతి నక్షత్రాన్ని చూపించిన జగన్ ! - పెళ్లిరోజు హామీకి నాలుగేళ్లు