CM Jagan Cheats Muslims: ఉద్ధరిస్తామంటూ బాకా ఊదారు.! పీఠమెక్కాక ధోకా చేశారు.! కపటప్రేమతో నమ్మించి దగా చేశారు. ఐదేళ్ల జగన్ దగాపై ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం కంటే మెరుగైన పథకాలిస్తామంటూ పాతవాటికే పాతరేశారని మండిపడుతున్నారు. ఓటు బ్యాంకుగా తమను వాడుకున్న జగన్‌కు అదే ఓటుతో బుద్ధిచెబుతామంటున్నారు. కూటమి మేనిఫెస్టో తమ జీవితాల్లో వెలుగులు నింపేలా ఉందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని ముస్లింలు వైఎస్సార్సీపీకి గంపగుత్తగా ఓట్లు వేశారు. జగన్ ముఖ్యమంత్రి కావడంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఇంత చేసిన తమను అధికార పీఠమెక్కిన తర్వాత జగన్ నిండా మోసం చేశారని ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నమ్మించి నట్టేట ముంచిన సీఎంకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని తేల్చిచెబుతున్నారు. కొత్త పథకాలు కాదు కదా! తెలుగుదేశం సర్కార్ హయాంలో అమలైన పథకాలనే నిబంధనల కొర్రీలతో నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ ఐదేళ్ల పాలనలో జరిగిన నష్టాన్ని సరిచేసేలా కూటమి మేనిఫెస్టోలో మైనార్టీ వర్గానికి హామీలిచ్చారని ముస్లింలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ వర్గం అభ్యున్నతికి తోడ్పడుతుందని హర్షాన్ని వెలిబుచ్చుతున్నారు. బీజేపీతో పొత్తువల్ల మైనార్టీలకు అన్యాయం జరుగుతుందన్న వైఎస్సార్సీపీ నేతల అసత్య ప్రచారాన్ని ముస్లిం సోదరులు తిప్పికొడుతున్నారు. గతంలోనూ ఈ రెండుపార్టీలు కలిసినా ఎక్కడా తమపై చిన్నదాడి ఘటన కూడా చోటుచేసుకోలేదని గుర్తుచేస్తున్నారు.
"సీఎం జగన్ మా ముస్లింలకు తీరని ద్రోహం చేశారు. గత ప్రభుత్వం కంటే మెరుగైన పథకాలిస్తామని చెప్పి పాతవాటికి పాతరేశారు. జగన్ ముఖ్యమంత్రి కావడంలో కీలక పాత్ర పోషించిన మమ్మల్ని అధికార పీఠమెక్కాక మోసం చేశారు. నమ్మించి నట్టేట ముంచిన సీఎం జగన్‌కు ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతాం. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన నష్టాన్ని సరిచేసేలా కూటమి మ్యానిఫెస్టోలో మైనార్టీ వర్గానికి హామీలిచ్చారు. ఎన్డీఏ కూటమి మ్యానిఫెస్టో మా జీవితాల్లో వెలుగులు నింపేలా ఉంది." - ముస్లిం సోదరులు