CM Jagan Cheating Outsourcing Employees : ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పాదయాత్రలో జగన్ ఎన్నో మాటలు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక సమాన వేతనం పక్కనపెట్టేసి మూడు కేటగిరీల్లో జీతాలు ఇస్తున్నారు. సీనియారిటీకి సమాధి కట్టేశారు. కొన్నేళ్లుగా పని చేస్తున్న వారిని, కొత్తగా ఉద్యోగంలో చేరిన వారిని ఒకేగాటిన కట్టి వేతనాలిస్తున్నారు. ఇక ఒక్కో జిల్లాలో ఒక్కోమాదిరిగా జీతాలు చెల్లిస్తున్నారు.
విజయవాడ, విశాఖ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒకే కేటగిరీలో పని చేస్తున్నవారి వేతనాలు వేర్వేరుగా ఉన్నాయి. మెప్మా, సెర్ప్ ప్రాజెక్టు ఉద్యోగుల మాదిరిగా తమకూ హెచ్ఆర్ పాలసీ తేవాలని, సర్వీస్ రూల్స్ రూపొందించాలని, ఏటా కనీసం 5 శాతమైనా జీతాలు పెంచాలని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు మొత్తుకుంటున్నా జగన్ ఆలకించడం లేదు! పైగా పొరుగు సేవల సిబ్బందికి 30శాతం జీతం పెంచాలని 11వ పీఆర్సీ కమిషన్ సిఫార్సు చేస్తే 23 శాతంతోనే సరిపెట్టారు.
వైసీపీ సానుభూతిపరులకే ఉద్యోగాలు : పొరుగుసేవల సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని నమ్మబలికిన జగన్ ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సుడ్ సర్వీసెస్-ఆప్కాస్ ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. ఆప్కాస్‌కు ఇప్పటిదాకా ఎలాంటి బడ్జెట్ కేటాయింపులులేవు. ఆయా విభాగాలు డబ్బులు ఇస్తేనే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నారు. కొన్ని శాఖలు ఆలస్యంగా డబ్బులు ఇస్తుండడంతో ఉద్యోగులకు వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. అలాంటప్పుడు కార్పొరేషన్ ఉండి లాభమేంటి? అనేది ఉద్యోగుల ప్రశ్న. ఇక ఆప్కాస్ ఏర్పాటు తర్వాత పొరుగుసేవల నియామకాలన్నీ వైఎస్సార్సీపీ చేతుల్లోకి వెళ్లాయి.
జిల్లా ఇంఛార్జి మంత్రి జిల్లా కలెక్టరు సిఫార్సు చేస్తే చాలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నియమిస్తున్నారు. నియామకాల్లో రిజర్వేషన్ రోస్టర్‌ను గానీ, అభ్యర్థుల ప్రతిభను గానీ చూడలేదు. వైసీపీ సానుభూతిపరులకే ఉద్యోగాలు ఇచ్చారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ కూడా సక్రమంగా చెల్లించడం లేదు. ఆప్కాస్ పరిధిలోప్రస్తుతం లక్షకుపైగా ఉద్యోగులున్నారు. ఆర్టీసీ, గురుకులాలు, పర్యాటక, అటవీ, నీటిపారుదల శాఖల్లో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ వారిని ఇంతవరకూ ఈ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురాలేదు. ఇలాంటి వారు మరో లక్షన్నర మంది వరకూ ఉన్నారు.
సంక్షేమ పథకాలు కట్ : అరకొర వేతనాలతో కుటుంబాలు నెట్టుకొస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వైసీపీ సర్కారు సంక్షేమ పథకాలనూ దూరం చేసింది. విజయవాడలాంటి నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు గతంలో 12 వేల రూపాయల వేతనం ఉండేది. దాన్ని 3 వేల రూపాయలు పెంచారు. వేతనం 15 వేలకు చేరిందనే సాకుతో పొరుగు సేవల ఉద్యోగులకు సంక్షేమ పథకాలు తొలగించింది. అంటే 3 వేల రూపాయల జీతం పెంచి ఉద్యోగుల పేర్లపై ఉన్న రేషన్‌కార్డులను రద్దు చేసేసింది.
పొరుగు సేవల ఉద్యోగుల కుటుంబాల్లో అమ్మఒడి ఉండదు. వికలాంగ, వృద్ధాప్య పింఛన్లేవీ ఇవ్వరు. పొరుగు సేవల సిబ్బందికి వేతనాలను సీఎఫ్ఎమ్ఎస్ ద్వారా చెల్లిస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూపుతున్నారు. కానీ వారికి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న సదుపాయాలేవీ కల్పించడం లేదు. ఆరోగ్య పథకాలూ వర్తింపజేయకపోవడంతో జబ్బున పడిన సందర్భాల్లో సొంత డబ్బుతో వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించాలి: బొప్పరాజు