Chandrababu Review on AP Rains : రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయన్న హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. తుంగభద్ర, శ్రీశైలం, సోమశిల తదితర ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహించినట్లు నిమ్మల తెలిపారు. సోమశిలలో ఇంకా 26 టీఎంసీల నీటిమట్టం ఉందని, ఎగువ నుంచి వచ్చే నీటిని నింపుకుని అదనపు నీటిని సరిగ్గా నిర్వహించేలా చూడాలని చంద్రబాబు చెప్పారని ఆయన పేర్కొన్నారు.
ఆకస్మికంగా వచ్చే వరదల కారణంగా రైల్వేలైన్లు, సమీపంలో నగరాలు ఇబ్బందులు పడుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నట్లు నిమ్మల రామానాయుడు వివరించారు. వాగులు, చెరువులపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారని తెలిపారు. నెల్లూరు, ప్రకాశం, సత్య సాయి, అనంతపురం, చిత్తూరు సహా వివిధ జిల్లాల్లో వాగులు, కాలువల క్యాచ్మెంట్ ఏరియాలో వరద నీటిని అంచనా వేసి అందుకు అనుగుణంగా చర్యలు చేపడతామని స్పష్టంచేశారు. వరద నిర్వహణను పటిష్టంగా చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. ఈ మేరకు దీనిపై జిల్లా కలెక్టర్లకు కూడా సమాచారం ఇచ్చామని రామానాయుడు వెల్లడించారు.
"ఇంకా కొన్ని జిల్లాల్లో రిజర్వాయర్లు నింపాల్సి ఉంది. పెన్నా బేసిన్, రాయలసీమ జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొంది. గత ఐదేళ్లలో చాలా ప్రాజెక్టులు నిర్వహణ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కనీసం 30-40 లక్షల రూపాయలు కూడా నిర్వహణ కోసం జగన్ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ఏపీకీ 760 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ప్రస్తుతం 686 టీఎంసీల నీటిని నింపగలిగాం. పులిచింతల నీటి నిల్వ సామర్థ్యం 45 టీఎంసీలు. మేము అధికారంలోకి వచ్చే నాటికి కేవలం 0.5 టీఎంసీ నీరు మాత్రమే ఉంచారు. నవంబర్ నెల నుంచి ప్రాధాన్యతా క్రమంలో అన్ని ప్రాజెక్టుల మరమ్మతులు, పనులు చేపడతాం." - నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ మంత్రి
Heavy Rains in AP 2024 : గుండ్లకమ్మ ప్రాజెక్టును పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని నిమ్మల రామానాయుడు తెలిపారు. నవంబర్ నెల నుంచే పోలవరం ప్రాజెక్టు పనులు పునఃప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. పోలవరం పనులపై వర్క్ క్యాలెండర్ రూపొందిస్తున్నామని చెప్పారు. డయాఫ్రం వాల్ పనులు కూడా నవంబర్ నెల నుంచే ప్రారంభం అవుతాయని స్పష్టం చేశారు. ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. ఈ నెలాఖరులోగా కాపర్ డ్యాంల మధ్యలో నిల్వ ఉన్న నీటిని తోడే ప్రయత్నం చేస్తున్నామని నిమ్మల వివరించారు.
అల్పపీడనం ఎఫెక్ట్ - పలు జిల్లాల్లో దంచికొడుతున్న వానలు
4 రోజుల పాటు భారీ వర్షాలు - అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు