Public Grievance at TDP Office : తెలుగుదేశం పార్టీ కేంద్రకార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతులు వెల్లువెత్తాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ బాధితులమంటూ వివిధ వర్గాల ప్రజలు సమస్యలు వినవించుకున్నారు. అందరి వినతులూ స్వీకరించడంతో పాటు ఓపికగా వారు చెప్పేది విన్న సీఎం సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.
పలు అర్జీల్ని ఆయా శాఖలకు రిఫర్ : సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి రావడంతో బాధితులు పోటెత్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ బాధితులు, వివిధ సమస్యలతో వృద్ధులు, దివ్యాంగులు, సీఎంఆర్ఎఫ్ కింద సాయం కోరుతూ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు రాగా చిరునవ్వుతో వారందరిన్నీ పలకరిస్తూ చంద్రబాబు స్వయంగా వినతులు స్వీకరించారు. వారి ఇబ్బందుల్ని తెలుసుకొని వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. పలు అర్జీల్ని ఆయా శాఖలకు రిఫర్ చేశారు. పెద్ద సంఖ్యలో బాధితులు రావడంతో క్యూలైన్ల వద్దకు వెళ్లి సీఎం స్వయంగా వినతులు స్వీకరించారు. బాధితుల గోడును ఆలకించిన ముఖ్యమంత్రి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.
ఎంతటి వాళ్లున్నా వదలం - న్యాయం చేస్తాం : డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న తన కుమార్తెను ఆనంద్ అనే ఆటోడ్రైవర్ మాయమాటలు చెప్పి ప్రేమపేరుతో వంచించి చంపేశారంటూ గుంటూరు జిల్లాకు చెందిన మహిళ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇదేంటని నిలదీస్తే మేం మాజీ మంత్రి విడదల రజనీ, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుచరులమని బెదిరిస్తున్నారని తెలిపారు. ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసులే తమపై ఎదురు కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన చంద్రబాబు కేసులో ఎంతటి వాళ్లున్నా వదలమని, తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఎంపీడీవోపై దాడి - విడదల రజిని ముఖ్య అనుచరుడు అరెస్ట్
వైఎస్సార్సీపీ నేతలు చంపేస్తామని బెదిరిస్తున్నారు : గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు అర్జీ పెట్టుకొన్నా సీఎంఆర్ఎఫ్ కింద సాయం అందలేని కేన్సర్‌తో బాధపడుతున్న 72 ఏళ్ల రాఘవ అనే వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న తన కుమారుడి చికిత్సకు ఆర్థికసాయం అందించాలని విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన గణపతి కోరారు. తనకు ఇంటి స్థలం మంజూరు చేయాలని గుంటూరుకు చెందిన కోటేశ్వరరావు అనే దివ్యాంగుడు వేడుకున్నారు. పొలాన్ని ఆక్రమించిన వైఎస్సార్సీపీ నేతలు, అడుగు పెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారని రాజమహేంద్రవరం హుకుంపేటకు చెందిన బొప్పన సురేశ్‌బాబు ఫిర్యాదు చేశారు.
మోసం చేసి టీడీపీ చేరాడు : మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు కొండ్రెడ్డి భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా తనను మోసం చేశాడని ప్రస్తుతం అతడు టీడీపీలో చేరాడని తిరుపతికి చెందిన బయ్యన్న వాపోయారు. సీఎం న్యాయం చేస్తామన్నారని బయ్యన్న బంధువు తెలిపారు.
ప్రజావేదికకు వెల్లువెత్తిన వినతులు - అన్నీ వైఎస్సార్సీపీ నేతల అరాచకాలపైనే!