CM Chandrababu on CCTV Cameras Usage: శాంతి భద్రతలపై సమీక్షలో సీసీ కెమెరాలపై ఆసక్తికర చర్చ జరిగింది. నేరాలను కంట్రోల్ చేసేందుకు సీసీ కెమెరాలను గత ప్రభుత్వం సరిగా వినియోగించుకోలేకపోయిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీలో ఉన్న 14 వేల సీసీ కెమెరాలను దేనికి వినియోగిస్తున్నారని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద జంపింగ్ చేసే వాళ్లను గుర్తించడానికి 14 వేల సీసీ కెమెరాలను వినియోగిస్తున్నామని సౌరభ్ గౌర్ అన్నారు.
సిగ్నల్స్ వద్ద జంపింగ్ చేసే వారినే కాదు చాలా వాటికి చంద్రబాబు వినియోగించుకోవచ్చనన్నారు. 14 వేల సీసీ కెమెరాలను ఇంటిగ్రేట్ చేయాలన్నారు. ఎవరైనా నేరానికి పాల్పడి పారిపోయే ప్రయత్నం చేస్తే.. వారిని ట్రేస్ చేసే పరిస్థితి రావాలని సూచించారు. రౌడీ షీటర్లను వాచ్ చేయడానికి సీసీ కెమెరాలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి షాపింగ్ మాల్స్ సినిమా థియేటర్లల్లో సీసీ కెమెరాలను పెట్టాలన్నారు. గంజాయి తాగేసి చాలా మంది నేరాలకు పాల్పడుతున్నారన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల క్రైమ్ ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్టుగా పరిస్థితి మారిందన్నారు.
అదే విధంగా శాంతిభద్రతల అంశంపై సీఎం చంద్రబాబు మరిన్ని సూచనలు చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పని చేయాలని, అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి నేను సిద్ధంగా లేనని తేల్చి చెప్పారు. నేరాలు అదుపు చేసేందుకు సీసీ కెమెరాలు, డ్రోన్లు వాడాలన్న చంద్రబాబు, గత ప్రభుత్వం ప్రత్యర్థులను వేధించడానికి పోలీస్ వ్యవస్థను వాడుకుందని మండిపడ్డారు.
భూ సమస్యల విషయంలో ప్రజల్లో చాలా అశాంతి ఉందన్న సీఎం, మదనపల్లె ఘటన జరిగితే హెలీకాప్టర్ ఇచ్చి డీజీపీని పంపానన్నారు. కంప్యూటర్‌లో చిన్నపాటి మార్పు చేసి భూములు కాజేశారని, భూములను ఫ్రీ హోల్డ్ చేసి, రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని తెలిపారు. నేరాలు చేసి కప్పిపుచ్చుకోవడం కొందరికి అలవాటుగా మారిందన్న సీఎం, వివేకా గొడ్డలిపోటు హత్యను గుండెపోటుగా మార్చారని పేర్కొన్నారు.
36 మందిని రాజకీయ హత్యలు చేశారని ఆరోపణలు చేస్తున్నారని, తప్పుడు ఆరోపణలను సీరియస్‌గా తీసుకుంటున్నామన్నారు.గంజాయి సేవించి ఆడవాళ్ల మీద దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, శాంతిభద్రతల నిర్వహణపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. పోలీసులు గంజాయి హాట్‌స్పాట్‌లపై దృష్టి పెట్టాలన్నారు.
DGP Presentation in Collectors Conference: శాంతి భద్రతలపై డీజీపీ ద్వారకా తిరుమల రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గంజాయి నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర స్థాయిలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోందన్నారు. జిల్లా స్థాయిలో యాంటీ నార్కోటిక్ టాస్క్‌ఫోర్స్ టీంలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాట్లు తెలిపారు. గంజాయి సాగు, రవాణలోని కింగ్ పిన్‌లను పట్టుకునేలా చర్యలు చేపట్టమన్నారు. క్రైమ్ కంట్రోల్ చేయడానికి సీసీ కెమెరాలతో నిఘా పెంచుతామన్నారు. నరసాపురం ఎంపీడీవో అదృశ్యం కేసులో కూడా సీసీ కెమెరాలను వినియోగించామని వివరించారు.