CM Chandrababu Naidu Comments at Kuppam: వచ్చే అయిదేళ్లలో కుప్పంతో పాటు రాష్ట్ర ప్రజల రుణం తీసుకుంటానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. సొంత నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనలో భాగం తొలిరోజు చంద్రబాబుకు నేతలు, కార్యకర్తలు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కుప్పం బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు, నియోజకవర్గానికి వరాల జల్లు ప్రకటించారు. అహంకారంతో విర్రవీగిన వైఎస్సార్సీపీని మొన్నటి ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారన్నారు.
మీ ముద్దుబిడ్డగానే పుడతా: ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యవహారాలు చూసే ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ను అభినందించారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, మండల పార్టీ నేతలకు అభినందనలు తెలిపిన చంద్రబాబు, నియోజకవర్గ ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నారు. ఇప్పటివరకు 8 సార్లు ఇక్కడ నుంచి గెలిచానని, మళ్లీ జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతానన్నారు. తాను ఇక్కడకు వచ్చినా, రాకున్నా తనను ఆదరించారన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తిరగరాయబోతున్నామన్న చంద్రబాబు, కుప్పం నియోజకవర్గం తన రాజకీయాలకు ప్రయోగశాల అని తెలిపారు.
అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా: యువత, మహిళలు, బలహీనవర్గాలకు అవకాశం ఇచ్చామని, మొన్నటి ఎన్నికల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామన్నారు. కేబినెట్‌లో 8 మంది బీసీలకు అవకాశం ఇచ్చామని, ప్రమాణస్వీకారం చేసిన వెంటనే పోలవరం, అమరావతికి వెళ్లానని గుర్తు చేశారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేముందు మీ ఆశీస్సుల కోసమే ఇక్కడకి వచ్చానన్న చంద్రబాబు, వచ్చే ఐదేళ్లలో నియోజకవర్గ ప్రజల రుణం తీసుకుంటానన్నారు. కుప్పంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నానని, నియోజకవర్గాన్ని అన్నింట్లో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారు.
రౌడీయిజం చేసేవారు జాగ్రత్త: వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే తాను ఈ నియోజకవర్గం ఎంచుకున్నానన్న చంద్రబాబు, చిత్తూరు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. వైఎస్సార్సీపీ పాలన పీడకల అని, అలాంటి దాన్ని ఎప్పుడూ చూడలేదని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ దౌర్జన్యాలను ప్రజలు అసహ్యించుకున్నారని, ఏ తప్పూ చేయకున్నా 30 మంది కార్యకర్తలను జైలులో పెట్టారని ఆరోపించారు. కుప్పం ప్రశాంతమైన స్థలం అని, ఇక్కడ హింసకు చోటు లేదన్నారు. రౌడీయిజం చేసేవారికి అదే కడపటి రోజు అని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ఔటర్ రింగ్‌రోడ్ వేస్తాం: గత ఐదేళ్లుగా ఎలాంటి అభివృద్ధీ లేదని, తమ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గాన్ని మోడల్ మున్సిపాలిటీగా తయారుచేస్తామని హామీ ఇచ్చారు. ఔటర్ రింగ్‌రోడ్, ఆధునిక రోడ్లు వేస్తామన్నారు. 4 మండల కేంద్రాలనూ ఆదర్శ పట్టణాలుగా అభివృద్ధి చేస్తామన్న సీఎం, నియోజకవర్గ అభివృద్ధి పనులు ఇవాళ్టి నుంచే ప్రారంభం అయ్యాయని తెలిపారు. కుప్పంలోని ప్రతి ఊరిలో తాగునీరు, డ్రైనేజ్‌లు, వీధిదీపాలు ఏర్పాటు చేస్తామని, గ్రామాలకు కుళాయి ద్వారా తాగునీరు అందిస్తారమన్నారు.
నియోజకవర్గంలో మినరల్ వాటర్ ఇస్తాం: ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా మళ్లీ నియోజకవర్గంలో మినరల్ వాటర్ ఇస్తామన్న చంద్రబాబు, అన్ని గ్రామాలు, పంటపొలాల వద్దకు రోడ్లు వేస్తామని, హంద్రీ-నీవా కాలువను ఇప్పుడే పరిశీలించానన్నారు. కుప్పంలో కరవు అనే మాట వినపడకుండా చేస్తానని, గత ప్రభుత్వానికి గుత్తేదారులపై ఉండే ప్రేమ రైతులపై లేదని విమర్శించారు. తమ ప్రభుత్వం హయాంలో అవసరమైతే లిఫ్ట్‌లు పెట్టి మరీ పొలాలకు నీరు ఇస్తామని, ఈ నియోజకవర్గంలో అన్ని రకాల పంటలూ పండుతాయని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను మరింత ప్రోత్సహిస్తామని తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సరకు నిల్వ చేసేలా గిడ్డంగులు నిర్మిస్తామన్న చంద్రబాబు, పూలు పండించే రైతులకు మార్కెట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
కొలువుదీరిన క్యాబినెట్- చంద్రబాబుకు కుడి, ఎడమన ఆ ఇద్దరు! - ap cabinet meeting
తొందరలోనే విమానాశ్రయం: పండ్లు, కూరగాయల రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు, నియోజకవర్గానికి విమానాశ్రయం తెచ్చి కార్గో ద్వారా పంపించాలని ఆలోచించాన్ననారు. వీలైనంత తొందరలోనే కుప్పంకు విమానాశ్రయం వస్తుందన్న చంద్రబాబు, ఇక్కడ నుంచి ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు పంపిస్తామని స్పష్టం చేశారు. ఇంటికి రెండు ఆవులు ఇస్తే ఆరోజు తనను ఎగతాళి చేశారన్న చంద్రబాబు, నేడు నియోజకవర్గంలో 4 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు.
నియోజకవర్గానికి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తా: భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో 10 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అయ్యేలా చూస్తామని, పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమను మరింత ప్రోత్సహిస్తామని, తేనె ఉత్పత్తి మరింత పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేస్తామన్న చంద్రబాబు, ఏ కుటుంబంలోనూ పేదరికం ఉండకూడదన్నదే తన ఆశయం అని స్పష్టం చేశారు. మల్లన్న, రాళ్లమణుగూరును మండలాలు చేస్తామని, కుప్పం బస్టాండ్, డిపో రూపురేఖలు మారుస్తామని, నియోజకవర్గానికి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
భవిష్యత్తులో రైల్వే జంక్షన్: భవిష్యత్తులో కుప్పం రైల్వే జంక్షన్‌లా మారే అవకాశం ఉందని, వి.కోట-పలమనేరు రోడ్డును నాలుగు లేన్లుగా మార్చాలన్నారు. ఫోర్ లేన్ రోడ్డు వేస్తే బెంగళూరుకు గంటలోనే వెళ్లవచ్చన్న చంద్రబాబు, మొన్నటి ఎన్నికల్లో యువత తమ వెంటే నడిచారని తెలిపారు. టెక్స్‌టైల్స్, పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు తెస్తామని, ద్రవిడ వర్సిటీలో పరిపాలనను గాడిలో పెడతామన్నారు. నియోజకవర్గాన్ని ప్రముఖ విద్యాకేంద్రంగా మారుస్తామని, కురబ, బలిజ, వాల్మీకి భవనాలు పూర్తి చేస్తామని అన్నారు. దేవాలయాలను అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు.
గంజాయి పండించే వారిపై ఉక్కుపాదం: గంజాయి పండించే వారిపై ఉక్కుపాదం మోపుతామన్న చంద్రబాబు, మన రాష్ట్రంలో ఇకనుంచి గంజాయి పేరే వినిపించకూడదని అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగులు, యువత, మహిళలు పూర్తిగా మనవైపే నిలిచారని, వైఎస్సార్సీపీ ఉంటే తమకు భవిష్యత్తు ఉండదని ప్రజలు భయపడ్డారని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని, ఎలా పాలన చేస్తారని కొందరు అడిగారని పేర్కొన్నారు. తనకు మనోధైర్యం ఉందని, ఎన్ని కష్టాలైనా పడతానన్నారు. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత తనది అన్న చంద్రబాబు, కొందరు స్వార్థపరులు ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు చరిత్రను తిరగరాశారని, ఆర్థిక పరిస్థితి, సాగునీటి ప్రాజెక్టులు, అమరావతి, మద్యం పాలసీ, భూగర్భ ఖనిజాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామన్నారు.
రాజముద్ర వేసి మళ్లీ పట్టాలు ఇస్తాం: మెగా డీఎస్‌సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నామన్న చంద్రబాబు, వృద్ధులకు పింఛన్లు ప్రవేశపెట్టిందే ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. మభ్యపెట్టి మోసం చేసే పాలకులు పోవాలని మండిపడ్డారు. పెంచిన పింఛను మొత్తాన్ని ఒకటో తేదీనే ఇస్తామన్న చంద్రబాబు, దివ్యాంగులు, కొన్ని వ్యాధులు ఉన్నవారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ప్రభుత్వం చేసే మంచిపనులకు ప్రజలంతా అండగా ఉంటాలని, గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం పెద్ద మోసని దుయ్యబట్టారు. మీ భూమిపై జగన్ బొమ్మ ఎందుకు అని ప్రశ్నించిన చంద్రబాబు, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తున్నామన్నారు. జగన్ బొమ్మ తీసేసి రాజముద్ర వేసి మళ్లీ పట్టాలు ఇస్తామన్నారు.
ప్రతి డ్వాక్రా మహిళను లక్షాధికారిగా చేస్తా: త్వరలోనే అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామన్న చంద్రబాబు, దాతల ఫొటోలను అన్న క్యాంటీన్ల వద్ద ఏర్పాటు చేస్తామని తెలిపారు. 1996-97లో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశామన్న చంద్రబాబు, మన మహిళా సంఘాలు దేశానికే ఆదర్శంగా మారాయని ప్రశంసించారు. వడ్డీ లేని రుణాలిచ్చి మహిళా సంఘాలను ప్రోత్సహించామని, ఎన్ని ప్రభుత్వాలు మారినా మహిళా సంఘాలు అలాగే నిలబడ్డాయని గుర్తుచేసుకున్నారు. ప్రతి డ్వాక్రా మహిళను లక్షాధికారిగా చేసేందుకు చర్యలు తీసుకొంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం బహిరంగ సభలో డ్వాక్రా గ్రూపు మహిళలు ప్రసంగించారు. అమరావతి నిర్మాణానికి చిత్తూరు జిల్లా మహిళలు రూ.4.5 కోట్లు విరాళం ఇచ్చారు. అదే విధంగా మెప్మా తరఫున రూ.కోటి విరాళం అందించారు. అంతకుముందు జల్లిగానిపల్లెలో హంద్రీ-నీవా కాల్వ పనులను సీఎం పరిశీలించారు.