How to Book Free Sand in Online in AP : ఇసుక ఆన్‌లైన్ బుకింగ్ 24 గంటలూ అవకాశం ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పరిమితంగా కొంత సమయం అనే నిబంధన వద్దని, ఎవరైనా ఎక్కడి నుంచైనా ఏ సమయంలో అయినా సులువుగా ఇసుక బుక్‌చేసుకునేలా పోర్టల్‌ను నవీకరించాలని తెలిపారు. శాండ్ మేనేజ్మెంట్ సిస్టం పోర్టల్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. గనులశాఖ అధికారలు, జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ సమయంలోనైన సులువుగా ఇసుక బుక్ చేసుకునేలా పోర్టల్ నవీకరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
Sand Management System Portal in AP : ఆన్‌లైన్ బుకింగ్‌లో ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అనంతరం సాయంత్రం వరకు 6 గంటల వరకు ఎవరైనా వ్యక్తిగతంగా ఇసుక బుక్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. అయితే 24 గంటలు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేలా వీలు కల్పించాలన్న చంద్రబాబు ఆదేశాలతో పోర్టల్‌లో మార్పులు చేశారు. ఇసుక అక్రమ రవాణాకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని నిఘా వ్యవస్థను పటిష్ఠపరచాలని పేర్కొన్నారు.
వాగులు, వంకలకు సమీప గ్రామాల ప్రజలు కనీస రుసుము చెల్లించకుండా పూర్తి ఉచితంగా ఇసుక తీసుకెళ్లేలా నిబంధనలు రూపొందించాలని ఆదేశించారు. ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్‌పై థర్డ్ పార్టీతో తనిఖీలు చేయిస్తామని, అన్ని రూపాల్లో నిఘా ఉంచుతామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు ఇలా చేసుకోండి :
- ఇసుక ఆన్‌లైన్ బుకింగ్ కోసం 'mines.ap.gov.in' వెబ్‌సైట్‌లోకి వెళితే, ఏపీ శాండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(APSMS) అనే పోర్టల్ ఉంటుంది. తొలుత అందులోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- ఈ పోర్టల్‌లోకి వెళ్లాక రిజిస్ట్రేషన్స్‌పై క్లిక్ చేయాలి. అక్కడ జనరల్ కన్‌జ్యూమర్, బల్క్ కస్టమర్, ట్రాన్స్‌పోర్టర్ రిజిస్ట్రేషన్ అనే 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో జనరల్ కన్‌జ్యూమర్ రిజిస్ట్రేషన్స్‌పై క్లిక్ చేయాలి.
- అందులో ఆధార్ నంబరు, మొబైల్ నంబరు నమోదు చేస్తే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నమోదు చేయాలి.
- తర్వాత మొబైల్ నంబర్ యూజర్ నేమ్‌గా చూపిస్తుంది. ఆధార్ ప్రకారం పూర్తిపేరు వంటివి కనిపిస్తాయి. అనంతరం ప్రత్యామ్నాయంగా ఉండే మరో ఫోన్ నంబరు, మెయిల్ ఐడీ, జిల్లా, గ్రామం, పట్టణం, మండలం, మున్సిపాలిటీ, వార్డు, చిరునామా, ల్యాండ్ మార్క్, పిన్‌కోడ్ నమోదు చేసి, రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయాలి. దీంతో రిజిస్ట్రేషన్‌ను ఖరారు చేస్తూ మెసేజ్ వస్తుంది.
- అనంతరం రిజిస్టర్ నంబరుతో జనరల్ కంజ్యూమర్ కస్టమర్‌లో లాగిన్ కావాలి. అక్కడ డ్యాష్‌బోర్డులో శాండ్ బుకింగ్‌పై క్లిక్ చేస్తే నిర్మాణం చేయదలచుకున్న దాని వివరాలు, కచ్చితమైన చిరునామా నమోదు చేయాలి.
- తర్వాత ఇసుక డెలివరీ కావాల్సిన చిరునామా నమోదు చేస్తే, గూగుల్ శాటిలైట్ మ్యాప్‌లో ఆ ప్రాంతం కనిపిస్తుంది. దాని కింద ఉన్న సేవ్‌పై క్లిక్ చేయాలి. అనంతరం ఇసుక ఆర్డర్ వివరాలన్నీ కనిపిస్తాయి.
- ఆ తర్వాత ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్న కేంద్రం, వాహనం, ఎంత పరిమాణం కావాలి అనేది నమోదు చేయాలి. ఇసుక నామమాత్రపు ధర, రవాణా ఛార్జీ కలిపి ఎంత అవుతుందో కనిపిస్తుంది. దీనికి పే అని క్లిక్ చేయాలి. చివర్లో ఆన్‌లైన్ చెల్లింపులకు నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డ్, యూపీఐ పే వంటి ఆప్షన్లు ఉంటాయి. ఇందులో ఏదైనా ఎంపికచేసుకొని చెల్లింపులు చేయాలి.
- వీరికి ఏ రోజు, ఎన్ని గంటలకు ఇసుక డెలివరీ అవుతుందో మెసేజ్ వస్తుంది.
అక్రమార్కులకు వరంగా ఉచిత ఇసుక విధానం- వినియోగదారుల పడిగాపులు - Free sand policy irregularities