TDP Membership Registration Program : తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించి తన సభ్యత్వాన్ని సీఎం పునరుద్ధరించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈసారి ఆన్‌లైన్‌లో డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు చేపట్టినట్లు టీడీపీ నేతలు తెలిపారు.
ఈ క్రమంలోనే సభ్యత్వ నమోదు తీసుకున్న కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు జూమ్ మీటింగ్లో నేరుగా మాట్లాడారు. సభ్యత్వ నమోదు విధివిధానాల కరపత్రాన్ని విడుదల చేశారు. మాచర్లలో హత్యకు గురైన చంద్రయ్య కుటుంబసభ్యులతో సీఎం ముచ్చటించారు. ఈ నేపథ్యంలోనే నామినేటెడ్ పదవుల జాప్యంపై అంజిరెడ్డి ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. 42ఏళ్లుగా ఏ పదవీ ఆశించకుండా పార్టీకి సేవ చేశానని అంజిరెడ్డి తెలిపారు. పార్టీ అధికారంలోకి వచ్చాక తనకు పదవీ ఇస్తానని చెప్పారని, మూడు నెలలైన ఇంతవరకు పదవీ ఇవ్వకపోవడం బాలేదని ఆయన వ్యాఖ్యానించారు.
నేతలకు చంద్రబాబు పిలుపు : అంజిరెడ్డి మాటల పట్ల చంద్రబాబు ఎంతో ఆసక్తి కనబర్చారు. ఆశావహులు ఎక్కువమంది వల్ల జాప్యం జరుగుతోందంటూ అంజిరెడ్డికి ముఖ్యమంత్రి సర్దిచెప్పారు. సరైన వారిని సరైన పదవీలో నియమిస్తానని చెప్పారు. సభ్యత్వాలు నమోదు చేసుకున్న తెలంగాణ, అండమాన్ ప్రాంతాల నేతలతోనూ సీఎం స్వయంగా మాట్లాడారు. సభ్యత్వ నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నేతలు, కార్యకర్తలు రికార్డు స్థాయిలో నిర్వహించాలని నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే రూ.లక్ష చెల్లించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు.
"టీడీపీ రాకముందు తెలుగుజాతికి గుర్తింపు లేదు. టీడీపీ రాకముందు తెలుగువాళ్లను మద్రాసీ అని పిలిచేవారు. తెలుగువాళ్లకు ఎన్టీఆర్ ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. కార్యకర్తల మనోభావాలను టీడీపీ గౌరవించింది. రాజకీయ విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ. అనేకమంది నాయకులను తయారుచేసిన పార్టీ తెలుగుదేశం. ఇప్పుడు ఎవర్ని చూసినా వారి రాజకీయ జీవితం టీడీపీతోనే ప్రారంభమైంది. రాజకీయ కార్యకర్తల కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం." - చంద్రబాబు, ముఖ్యమంత్రి
మరోవైపు రూ.లక్ష కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం ఇవ్వనున్నారు. రూ.100 చెల్లించినవారికి గతంలో ఉన్న రూ.2 లక్షల బీమాను రూ.5 లక్షలకు పెంచారు. సభ్యత్వ కార్డు ఉన్న వ్యక్తి చనిపోయిన రోజే అంత్యక్రియలకు రూ.10,000లు ఇవ్వనున్నారు. కార్యకర్తల కుటుంబాలకు విద్య, వైద్యం, ఉపాధి కోసం పార్టీ సాయం అందించనుంది.