CM Chandrababu Inaugurated Anna Canteens: రెండో విడత అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ రోజు 75 అన్న క్యాంటీన్లు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం అన్నక్యాంటీన్ల సంఖ్య 175కు చేరింది. క్యాంటీన్‌కు వచ్చిన వారికి స్వయంగా చంద్రబాబే టోకెన్లు ఇచ్చి అన్నం వడ్డించారు.పేదలకు కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమంతో తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని సీఎం అన్నాకుయ రెండు విడతల్లో 175 అన్న క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. గతంలో అన్న క్యాంటీన్లను దుర్మార్గంగా రద్దు చేశారని మండిపడ్డారు.
ఇదో పవిత్ర కార్యక్రమం అన్న అయన పేదలకు అన్నం పెట్టే కార్యక్రమాన్ని చేపట్టేలా ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. పరిశుభ్రమైన, పౌష్టికాహారం పెట్టాలనే ఉద్దేశ్యంతో అన్న క్యాంటీన్లను ప్రారంభించామని వెల్లడించారు. 15 రూపాయలతో మూడు పూటలా అన్నం పెట్టే ఉద్దేశంతో అన్న క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. ప్రతి నియోజకవర్గానికి అన్న క్యాంటీన్ ఉంటుందని తెలిపారు. అన్న క్యాంటీన్లలో పూటకు 450 మంది భోజనం చేస్తున్నారన్నారు.
వరద సాయం కోసం చిన్నారులు మొదలుకుని చాలా మంది విరాళాలు ఇచ్చారని, మంచికి స్థానం ఉందని దాతలు నిరూపించారని పేర్కొన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలన్నారు. అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలని కోరారు. అన్న క్యాంటీన్ల కోసం సుమారు 150 కోట్లు ఖర్చు అవుతుందని ఈ ఖర్చును ప్రభుత్వం భరించగలదని వెల్లడించారు. కానీ ప్రజల్లో సేవా స్ఫూర్తిని పెంచేలా చేయడం కోసం విరాళాలు అడుగుతున్నామన్నారు. అన్న క్యాంటీన్ల మీద కూడా కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
సేవా కార్యక్రమాల పైనా ఈ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. సేవా భావంతో పని చేసే కార్యక్రమాలను విమర్శలు చేయడం దివాళాకోరుతనమే అన్నారు. ఏపీ చేపట్టిన వరద సహయక చర్యలను దేశం మొత్తం గుర్తించిందన్నారు. జల్ జీవన్ మిషన్ స్కీంను అన్ని రాష్ట్రాలు ఉపయోగించుకున్నాయని, గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఏపీ మాత్రం జల్ జీవన్ మిషన్ వినియోగించుకోలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ స్కీంను వినియోగించుకోకుండా రాష్ట్రానికి ద్రోహం చేశారన్నారు.
వైఎస్సార్సీపీ నేతలు తిరుమల లడ్డూనూ అపవిత్రం చేశారా? - రాజకీయ దుమారం - FAT IN TIRUMALA LADDU ISSUE
అన్ని హామీలను అమలు చేస్తున్నామన్న సీఎం, తిరుమలలో గత ప్రభుత్వం నాసిరకం భోజనం పెట్టారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో లడ్డూల విషయంలోనూ ఫిర్యాదులు వచ్చాయని, పవిత్రమైన లడ్డూల విషయంలోనూ అపవిత్ర ముడి సరుకు వాడారని ఆరోపించారు. తిరుమలలో అన్ని వ్యవస్థలను మళ్లీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నామన్న సీఎం, భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని దుయ్యబట్టారు.
వెంకన్న సన్నిధిని అపవిత్రం చేసింది గత వ్రభుత్వమని విమర్శించారు. అపవిత్ర ముడి సరుకులు వాడారని, అదే విషయం ల్యాబ్ టెస్టుల్లో బయట పడిందన్నారు. కక్కుర్తికి హద్దులుంటాయి కానీ వైఎస్సార్సీపీ నేతలు హద్దులు దాటారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాలకు వెెంకన్నను వాడుకోవడం సరికాదన్నారు. తిరుమలను అపవిత్రం చేసిన వాళ్ల గురించి ఆధారాలు లభ్యమైన వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తిరుమల ల్యాబ్ రిపోర్టులో అపవిత్ర పదార్ధాలు వాడారని చెప్పారని, దీనికి కారకులెవరో కనిపెట్టి చర్యలు తీసుకుంటామన్నారు. గత ఎన్నికల్లో సైలెంట్ రివల్యూషన్ వచ్చిందన్న సీఎం, అందుకే ఇంత పెద్ద ఎత్తున గెలుపు సాధ్యమైందన్నారు.