CM Chandrababu Help YSRCP Govt Victim Arudra : వైఎస్సార్సీపీ పాలనలో ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న ఆరుద్ర కుటుంబానికి చంద్రబాబు ఆపన్న హస్తం అందించారు. వీల్ చైర్‌కే పరిమితమైన ఆరుద్ర కుమార్తెకు మెరుగైన వైద్యం అందిచాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగురాలైన తన కుమారైకు పింఛను, ఆర్థిక సాయం ప్రకటించి భవిష్యుత్తులోనూ అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇన్నాళ్లూ కష్టాలతో కన్నీళ్లు కార్చిన ఆరుద్ర ఇప్పడు సంతోషంతో ఆనందబాష్పాలు రాల్చారు.
ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ పాలనలో నరకం అనుభవించిన ఓ బాధితురాలికి ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలిచారు. కుమార్తెకు తీవ్ర ఆరోగ్య సమస్యలతోపాటు, వైఎస్సార్సీపీ నేతల అరాచకాలకు ఎదురీదిన ఆరుద్రను సచివాలయంలో కలిసిన చంద్రబాబు వారి స్థితిని చూసి చలించిపోయారు. తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్న ఆరుద్ర కుమార్తె చికిత్స కోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. నెలకు 10 వేల రూపాయల చొప్పున పింఛన్ మంజూరు చేశారు. అలాగే వారికి ఎదురవుతున్న వేధింపుల పట్ల కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
చంద్రబాబును కలవాలని వైఎస్సార్సీపీ బాధితురాలు ఆరుద్ర వీడియో విడుదల - Arudra Trying To Meet CM CBN
తీవ్ర వెన్నునొప్పితోనే కంప్యూటర్ సైన్స్ డిగ్రీలో ప్రథమశ్రేణిలో ఇటీవల పాసైనట్లు ఆరుద్ర కుమార్తె చెప్పడంతో చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. తనకు ఉద్యోగం చేయాలని ఉందని, ఆపరేషన్ చేయించి ప్రాణభిక్ష పెట్టాలని బాధితురాలు కోరడంతో చలించిన చంద్రబాబు వెంటనే ఆర్థిక సాయం ప్రకటించారు. ఆరోగ్యం మెరుగుపడ్డాక ఉద్యోగ అవకాశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సీఎం నేరుగా కలిసి కష్టాలు తీర్చడంతో ఆరుద్ర భావోద్వేగానికి గురయ్యారు.
" మళ్లీ ఆంధ్రాలో బతకడానికి చంద్రబాబు నాయుడు ఒక అవకాశం ఇచ్చారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. నా తండ్రిలాగానే నన్ను పిలిచి నా బిడ్డను ఆశీర్వాదించారు. నాపై ఉన్న కోర్టు కేసులు కూడా తొందరల్లోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు " _ ఆరుద్ర, వైఎస్సార్సీపీ బాధితురాలు
కాకినాడ జిల్లా రాముడుపాలేనికి చెందిన ఆరుద్రకు సాయి లక్ష్మీ చంద్ర అనే కుమార్తె ఉంది. సాయిలక్ష్మికి 18 ఏళ్ల వయసులోనే వెన్నుపూసలో కణతితో ఇబ్బంది ఏర్పడగా ఆరరేషన్ చేస్తే తప్ప బతకదని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో ఇంటిని అమ్మకానికి పెట్టారు. వీరి ఇంటిపై కన్నేసిన వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, గన్‌మెన్ మెరపల కన్నయ్య, మరో వ్యక్తి మెరపల శివ ఇల్లు అమ్మడుపోకుండా అడ్డుపడ్డారు. ప్రశ్నించిన ఆరుద్ర కుటుంబాన్ని వేధింపులకు గురి చేశారు.
సకాలంలో వైద్యం అందక సాయిలక్ష్మీ నడుము, కాళ్లు అచేతనమై వీల్ చైర్‌కే పరిమితమైంది. కుమార్తె ఆరోగ్యం విషమిస్తుడంతో ఆరుద్ర స్పందనలో అనేకసార్లు ఫిర్యాదులు చేశారు. ప్రయోజనం లేకపోవడంతో అప్పటి సీఎం జగన్‌ని కలిసేందుకు తాడేపల్లికి వచ్చారు. ఆయన్ని కలిసేందుకు అవకాశమివ్వాలని ఎంత వేడుకున్నా ఎవరూ కనికరించక పోవడంతో అప్పట్లో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించారు. దీంతో స్పందించిన ప్రభుత్వ పెద్దలు పెద్ద ఆపరేషన్ చేయిస్తామన్నారే తప్ప పైసా విదల్చలేదు. వేధింపులకు పాల్పడిన వారిని సస్పెండ్ చేస్తామన్నారనే తప్ప ఆదేశాలివ్వలేదు.
వైఎస్సార్సీపీ నేతలు వేధింపులకు పాల్పడిన వారికి అండగా నిలిచి ఆరుద్ర కుటుంబంపైనే రివర్స్ కేసులు పెట్టించి పోలీసు స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పారు. అమలాపురంలో ఉన్న స్థలాన్నీ అమ్ముకోనివ్వకుండా అడ్డుకున్నారు. తన కుమార్తెను పిచ్చాసుపత్రిలో చేర్చి ఇంజక్షన్లు ఇచ్చి చంపేందుకు యత్నించారని అప్పట్లో ఆరుద్ర ఆరోపించారు. వేధింపులు తాళలేక ఆరుద్ర భర్త ఆత్మహత్యయత్నం చేశారు.
వైఎస్సార్సీపీ నేతల దాష్టీకాలను, ఆరుద్ర కుటుంబ పడుతున్న కష్టాలపై ఈటీవీ, ఈటీవీ భారత్‌లో ప్రసారమైన కథనాలు చూసి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే చంద్రబాబు స్పదించారు. బాధితురాలని ఆదుకోవాలని అప్పటి డీజీపీకి లేఖ రాశారు. ఆరుద్ర కుమార్తెను పిచ్చాసుపత్రిని నుంచి డిశ్చార్జి చేయించి ప్రాణాలు కాపాడారు. కొంతకాలనికే వైఎస్సార్సీపీ నేతల వేధింపులు మళ్లీ మొదలవడంతో రాష్ట్రాన్ని వదిలేసి రెండేళ్లుగా కాశీలో తలదాచుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో తిరిగి ధైర్యంగా రాష్ట్రంలో అడుగుపెట్టారు.