CM Along With Power Minister Manohar Lal Khattar Attend Urjaveer Program : దేశ, రాష్ట్ర భవిష్యత్తు విద్యుత్ రంగంపైనే ఆధారపడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గృహోపకరణాల నుంచి వాహనాల వరకు అన్నీ ఎలక్ట్రికల్‌గా మారబోతున్నాయని, రాష్టంలో ప్రతీ 30 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ పెడతామని వెల్లడించారు. విద్యుత్ రంగంలో పరిశోధనలకు ప్రత్యేక వర్సిటీ ఏర్పాటు చేస్తామని, రాబోయే ఐదేళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రకటించారు.
కృష్ణా జిల్లా పోరంకిలోని మురళి రిసార్ట్స్‌లో, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో కలిసి ఊర్జావీర్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం, తలసరి ఆదాయానికి చిహ్నమని సీఎం అన్నారు. ఒక్క యూనిట్ విద్యుత్‌ను ఆదా చేస్తే 2 యూనిట్లను ఉత్పత్తి చేసినట్లేనని చెప్పారు. ఊర్జావీర్ ద్వారా రాష్ట్రంలోని లక్ష మందికి అదనపు ఆదాయం అందించనున్నామని చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రంలోని 55 వేల 607 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు, కుక్కర్లు, వంట సామగ్రి అందించామని, 2 నెలల్లో మొత్తం అంగన్వాడీ కేంద్రాలకు అందజేస్తామన్నారు. వీటి వినియోగం వల్ల 30 శాతం విద్యుత్తును ఆదా చేయొచ్చని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ రంగంలో పరిశోధనల కోసం ప్రత్యేకంగా ఓ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
విద్యుత్తును ఆదా చేసే గొప్ప కార్యక్రమం ఊర్జావీర్ అని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అన్నారు. వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. చంద్రబాబు ఎన్నో నవ ఆవిష్కరణలకు నాంది పలికారని కితాబిచ్చారు.
సెకితో ఒప్పందం - అవినీతికి రోల్‌మోడల్ కాదా జగన్?
'హరియాణా ముఖ్యమంత్రిగా పదేళ్లు పని చేశా. ఆ సమయంలో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు పనిని అంతా ఆసక్తిగా గమనించేవాళ్లం. ఆయన అద్భుత పనితీరు, మాకెప్పుడూ స్ఫూర్తిగా నిలిచేది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్నదే మా లక్ష్యం. విద్యుత్ శక్తిని కాపాడుకునేలా చేపట్టిన ఊర్జావీర్ లాంటి కార్యక్రమాలు ఆ లక్ష్యాన్ని అందుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన దైనందిన కార్యక్రమాలకు విద్యుత్‌ను వినియోగిస్తూనే ప్రత్యేక పరికరాల వాడకం ద్వారా ఎలా పొదుపు చేయవచ్చో ఊర్జావీర్ ద్వారా ప్రజల్లో అవగాహన పెంచవచ్చు. దీని ద్వారా యువతకు, స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కూడా దక్కుతుంది.' - మనోహర్‌లాల్ ఖట్టర్, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి
PMAY 2.0తో ఒప్పందం చేసుకోవడం ద్వారా విద్యుత్‌ను ఆదా చేసే గృహోపకరణాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.