Climate Change Impact On Health : ప్రపంచమంతా కాలుష్యం పెరిగిపోతోంది. దీని ఫలితంగా భూతాపం కూడా ఆందోళనకర స్థాయికి చేరింది. పెరిగిన భూతాపం వాతావరణ మార్పులకు కారణం అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రభావం ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకు ఎండ మాడుపగలగొడితే సాయంత్రం కాగానే అకస్మాత్తుగా భారీ వర్షం ముంచెత్తుతోంది.
అయితే ఇలాంటి ఆకస్మిక వాతావరణ మార్పులు ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావం చేస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితి తీవ్రతను కొంతైనా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ఆరంభించింది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 'క్లైమేట్ ఛేంజ్ -హ్యూమన్' హెల్త్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది.
కేంద్రం కార్యచరణ ప్రణాళిక : 'క్లైమేట్ ఛేంజ్ -హ్యూమన్ హెల్త్' కార్యక్రమం కింద వాతావరణ కాలుష్యం, ఉష్ణోగ్రతలు ఎందుకు పెరుగుతున్నాయి? వాతావరణంలో అనూహ్య మార్పులకు కారణాలు, ప్రజల ఆరోగ్యంపై ఈ పరిస్థితులు చూపే ప్రభావం ఎంత? అని అధ్యయనం చేస్తారు. వాతావరణ మార్పులు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపించకుండా 2024-25 సంవత్సరం నుంచి ఐదేళ్లపాటు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచనలు జారీచేసింది.
దీనికి అనుగుణంగా రాష్ట్రాలు, జిల్లాల వారీగా కార్యాచరణ ప్రణాళికలు తయారుచేసి పంపాలని ప్రభుత్వాలను కోరింది. జిల్లాల నుంచి వచ్చే సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్రోడీకరించి కేంద్రానికి పంపుతుంది. ఇలా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రణాళికలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులు మంజూరు చేస్తుంది. అయితే ఇప్పటివరకు ఈ కేటగిరిలో ప్రత్యేకంగా నిధుల కేటాయింపు జరగలేదు.
Air pollution affecting health : ప్రస్తుతం ఐదు రకాల వాతావరణ కాలుష్యాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు . గాలి కాలుష్యం , ఉష్ణోగ్రతల వేడి , వెక్టర్ బోర్న్ డిసీజెస్, ఎక్స్‌ట్రీం వెదర్ ఛేంజ్ , గ్రీనరీ క్లైమేట్ ఛేంజ్ అనే విభాగాల్లో పరిశోధన చేసి సమాచారాన్ని సేకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా గాలి కాలుష్యం మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్యులు చెబుతున్నారు. దిల్లీ లాంటి ప్రాంతాల్లో గాలి కాలుష్యం అధికంగా ఉంటోంది. దీని కారణంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.
థర్మల్ ప్లాంట్ల నుంచి వచ్చే ఉద్గారాల వల్ల : ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, తిరుపతి, విశాఖలో గాలి కాలుష్యం ప్రతి ఏడాది పెరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో థర్మల్ ప్లాంట్ నుంచి వచ్చే ఉద్గారాల వల్ల వాతావరణ కాలుష్యం అధికంగా ఉంటోంది. సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ లాంటి ప్రమాదకరమైన వాయువులు రావటంతో ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. కంపెనీల చుట్టుపక్కల నివాసముంటున్న ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు.
తెలంగాణలో హైదరాబాద్ లాంటి చోట్ల కాలుష్యం అధికంగా ఉంటోంది. ముఖ్యంగా వాహన కాలుష్యం నగరానికి పెద్ద సమస్యగా మారింది. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలు పరిస్థితి తీవ్రతను మరింత పెంచుతోంది. పరిశ్రమల నుంచి పొగ, ధూళి స్థానిక ఇళ్లలోకి రావటంతో ప్రజలు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారు. ఇక వర్షాలు పడిన సమయంలో పూడిక వల్ల కాలువల్లో మురుగు నీరు రోడ్డుపైకి చేరుతోంది.
అనూహ్య వాతావరణ మార్పులు : కొన్ని ప్రాంతాల్లో మురుగునీరు జనావాసాల్లోకి సైతం చేరుతుంటుంది. దోమలు కూడా విజృంభిస్తుంటాయి. దోమల వల్ల జ్వరాలు పెరుగుతాయి. మలేరియా, చికెన్ గున్యా లాంటి జ్వరాలు తీవ్రం అయితే మరణాలు సైతం సంభవిస్తాయి. వర్షాకాలం పూర్తిగా రాకున్నా తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల వానలు కురుస్తున్నాయి. ఎండలు మండాల్సిన కాలంలో వానలు కురవడం అంటే అది అనూహ్య వాతావరణ పరిణామమే. సీజన్ మారినపుడు మాత్రమే కాదు, ఇలాంటి అనూహ్య పరిస్థితుల్లో సైతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Physicians' instructions : ఈ యేడాది మార్చి నెల నుంచే ఉష్ణోగ్రతలు మండిపోయాయి. భానుడు భగభగమంటూ తన ప్రతాపాన్ని చూపించాడు. ప్రస్తుతం అప్పుడప్పుడూ వర్షాలు కురుస్తున్నా ఎండాకాలం పూర్తిగా ముగిసే వరకు అంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మధుమేహం, బీపీ, గుండె సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలి.
ఉష్ణోగ్రతల కారణంగా చెమట రూపంలో శరీరంలోని మూలకాలు బయటకు వెళ్లిపోతాయి. అందువల్ల మంచినీటిని అధికంగా తీసుకోవాలి. ఆహారంలో మార్పులు చేసుకోవాలి. వడదెబ్బ తగిలినట్లు తెలియకపోవటంతో చాలామంది ఆసుపత్రులకు వెంటనే రాలేకపోతున్నారు. ఎక్కువ మంది ప్రాణాపాయ స్థితిలో వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.
భిన్న వాతావరణ పరిస్థితులు : రుతుపవనాలు ప్రవేశించే వరకు ఎండలు 40 డిగ్రీలు దాటే పరిస్థితి తరచుగా ఉంటుంది . వేడి ఎక్కువగా ఉండటం వల్ల నేల ఎండి పోతుంది .దుమ్ము ధూళి అంతా గాల్లోనే తేలి ఉంటుంది. ధూళి శరీరంలోకి వెళ్లటంతో ఊపిరితిత్తులు చెడిపోతున్నాయి. శరీరంలో రక్తం గడ్డలు కడతాయని నిపుణులు చెబుతున్నారు . రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడి గుండెకు సంబంధించి కార్డియో వాస్క్యులర్ సమస్యలు వస్తున్నాయి .
Climate Effects on Human Health : ఉష్ణోగ్రతల కారణంగా బీపీ పెరుగుతోంది దీనివల్ల మెదడు నరాల్లో రక్తం కూడా గడ్డ కట్టే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు . వడదెబ్బతో మరణాల సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతోంది . వీటి కట్టడికి ప్రభుత్వం సమాచార సేకరణ మొదలు పెట్టింది.
వైద్యులకు ప్రస్తుతం చేస్తున్న పనికి అదనంగా గుండె, ఊపిరితిత్తులు, శ్వాసకోశ సమస్యలతో వస్తున్న రోగుల వివరాలు ప్రత్యేక యాప్లో పొందు పరచాలని సూచించారు . దీంతో కచ్చితమైన సంఖ్యను అంచనా వేసి భవిష్యత్తులోమరణాలు తగ్గించవచ్చని కేంద్రం ఆలోచన. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టుకు యునిసెఫ్ అధికారులు సహకారం అందిస్తున్నారు.
స్వీయ జాగ్రత్తలు పాటించడమే శ్రీరామ రక్ష : ప్రస్తుతం మనుషుల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. ఆరోగ్య పరిరక్షణకు ఆహారంలో మార్పులు చేసుకోవడం, పోషహాకారానికి ప్రాధాన్యం ఇవ్వడం, వ్యాయామం, యోగా వంటివి చేస్తున్నారు. అయినా కాలుష్యం, వాతావరణ మార్పులు ప్రజల ఆరోగ్యంపై ఎంతో కొంత ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. దీనికి వాతావరణం మారినపుడు సీజనల్ వ్యాధులు విరుచుకుపడడం సహజంగా మారింది. అందువల్ల ప్రజలు స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం, నిపుణుల సలహాలు పాటించడమే ప్రస్తుతానికి శ్రీరామ రక్ష.