Two Groups Clash in Kakinada: స్థలం సరిహద్దు వివాదంలో ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ ముగ్గురు హత్యకు దారి తీసిన దారుణ ఘటన కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ శివారులలోని దళిత పేటకు చెందిన చెరువును ఆక్రమించి కార్దాల కుటుంబ సభ్యులు ఇల్లు నిర్మిస్తున్నారని బచ్చల కుటుంబానికి చెందిన వారు పంచాయతీలో ఫిర్యాదు చేశారు. దీనిపై మూడు నెలలుగా ఇరు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది.
కార్దాల కుటుంబానికి చెందిన వ్యక్తులు ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా బచ్చల కుటుంబానికి చెందిన వ్యక్తులు కత్తులు, కర్రలు రాడ్లతో ఒక్కసారిగా దాడి చేయడంతో కార్దాల ప్రకాశం ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కార్దాల చంద్రరావు, కార్దాల ఏసుబాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.
డీఎస్పీ శ్రీహరి రాజు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు పరారీలో ఉన్నారు. కర్రలు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. తమ కళ్ల ఎదుటే తమ వారిని కత్తులతో నరికి చంపారని మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థులు 26 మంది కత్తులతో వచ్చి దాడికి దిగారని స్థానికులు తెలిపారు. నిందితులు కారం పొట్లాలు పట్టుకుని వచ్చారని ఫిర్యాదు చేసిన బాధితులు పేర్కొన్నారు. నిందితుల్లో మహిళలూ ఉన్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తుల్ని నరికి చంపడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
తల్లిదండ్రులను హతమార్చిన తపాలా ఉద్యోగి - బాపట్ల జిల్లాలో దారుణం