Clash Between Kolkata and Anantapur Fashion Designers : వారు జీవనోపాధి కోసం రాష్ట్రాలు దాటి ఏపీకి వచ్చారు. ఇక్కడే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తమకు తెలిసినా మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైన్ పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తక్కువ ధరకే నాణ్యంగా పనులు చేస్తుండటంతో వారికి ఆర్డర్లు పెరిగాయి. దీంతో స్థానిక మహిళా డిజైనర్లకు గిరాకీ తగ్గిపోయింది. ఈ క్రమంలోనే స్థానిక మహిళా డిజైనర్లు, స్థానికేతరులైన కోల్‌కతా డిజైనర్ల షాపులపై దాడులు చేసి వారిని భయభ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.
తక్కువ ధరలకే నాణ్యమైన పనులు : ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కోల్‌కతాలో జీవనోపాధి లేక 20 కుటుంబాలు రెండు దశాబ్దాల క్రితం పొట్ట చేతపట్టుకొని అనంతపురానికి వచ్చారు. ఇక్కడ మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరంతా పట్టణంలోని రహమత్‌నగర్‌లో దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. వీరు నాణ్యమైన ఫ్యాషన్ డిజైన్లు, మగ్గం వర్క్ డిజైన్లను చాలా చౌకగా చేసి మహిళలకు ఇస్తున్నారు.
శుభకార్యాల్లో మహిళలు ధరించే బ్లౌజ్‌లను చాలా మంది మగ్గం డిజైన్ వర్క్ చేయించుకుంటారు. వీటికి కోల్‌కతా చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచే మగ్గం వర్క్ డిజైనింగ్ బ్లౌజ్‌లు, చీరలు దేశవ్యాప్తంగా ఎగుమతి అవుతుంటాయి. దీంతో వీరి చేతిపనికి విపరీతమైన ఆదరణ పెరిగింది. ఈ క్రమంలోనే వారు తమ ప్రాంతం నుంచి మరికొందరు కూలీలను పిలిపించుకొని అనంతపురంలో పెద్దఎత్తున డిజైనింగ్ వర్క్స్ చేయిస్తున్నారు.
దీంతో స్థానిక మహిళా డిజైనర్లకు గిరాకీ తగ్గిపోయింది. వీరు అధిక ధరలకు డిజైనింగ్ చేస్తుండటంతో ఇది సహించలేకపోయారు. ఈ క్రమంలోనే స్థానిక మహిళా డిజైనర్లు కోల్‌కతా డిజైనర్ల దుకాణాల వద్ద హల్చల్ చేశారు. ఫ్లెక్సీలు చించేసి నానా రభస సృష్టించారు. అంతటితో ఆగకుండా నగరం వదిలి వెళ్లకపోతే ఈసారి మగ్గాలు ధ్వంసం చేస్తామని వారిని హెచ్చరించారు. దీంతో బాధితులు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.
"మేము ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటున్నాం. స్థానిక మహిళా డిజైనర్లు మా దుకాణాల వద్దకు వచ్చి ఫ్లెక్సీలు చించివేశారు. దుకాణాలు మూసివేయాలని చెబుతున్నారు. తక్కువ ధరకే పనులు చేస్తున్నారని అంటున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇస్తున్నారు. అందుకే మేము పోలీసులకు ఫిర్యాదు చేశాం." - సలీం, బాధితుడు
ఆస్తి పంపకాల్లో వివాదం- తల్లిపై దాడి చేశాడని కుమారుడి దాడిలో తండ్రి మృతి
DTH రీఛార్జ్ కాలేదని దారుణం- షాపు యజమానిపై పిడిగుద్దుల వర్షం, ముగ్గురు యువకులు అరెస్ట్