CS Review on Amaravati Drone Summit 2024 : అమరావతిని డ్రోన్ సిటీ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దేలా 2024 అమరావతి డ్రోన్ సమ్మిట్‌ను నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ఈ నెల 22, 23 తేదీల్లో మంగళగిరి సీకే కన్వెన్షన్ వేదికగా జరిగే రెండు రోజుల డ్రోన్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 400 మంది ప్రతినిధులతో పాటు ఐఐటీ, ఇంజనీరింగ్ విద్యా సంస్థలు, ఇతర ప్రోఫెషనల్స్ కూడా 1000 మంది ఈ సదస్సుకు హాజరవుతారని ఆయన పేర్కోన్నారు.
2030 నాటికి గ్లోబల్ డ్రోన్ హబ్‌గా : కేంద్ర పౌర విమానయాన శాఖ, డ్రోన్ ఫెడరేషన్ ఆప్ ఇండియా, సీఐఐతో సంయుక్తంగా ఈ సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని ఆయన వెల్లడించారు. 40 ప్రదర్శన శాలలు కూడా డ్రోన్ల సాంకేతికతపై ఏర్పాటు అవుతున్నట్టు వివరించారు. 2030 నాటికి భారత్‌ను గ్లోబల్ డ్రోన్ హబ్ గా తీర్చిద్దేలా డ్రోన్ నిబంధనలపై ప్యానల్ చర్చలు ఉంటాయని స్ఫష్టం చేశారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, లాజిస్టిక్స్, మ్యాపింగ్, సర్వే లాంటి అంశాలతో పాటు ప్రజా భద్రత, డిజిటల్ ల్యాండ్ రికార్డుల లాంటి అంశాల్లో వీటి వినియోగంపై చర్చలు ఉంటాయన్నారు.
డ్రోన్ షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా : ముఖ్యమంత్రి చంద్రబాబు
దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో : 22 తేదీ సాయంత్రం విజయవాడలోని బెరం పార్కు వద్ద 5,500 డ్రోన్లతో దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో నిర్వహించనున్నట్టు తెలిపారు. సీఎం చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సహా వివిధ ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఈ సమ్మిట్ నిర్వహణలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాల్సిందిగా సీఎస్ అధికారులకు సూచించారు.
రూ.6,000 కోట్ల ఆదాయమే లక్ష్యం : రాబోయే ఐదేళ్లలో డ్రోన్ల రంగంలో రాష్ట్రాన్ని కీలకంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే ఐదేళ్లలో ఈ రంగంలో రూ. 2,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు వాణిజ్యం ద్వారా రూ. 6,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది. సుమారు 20,000 మందికి పైగా యువతను డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్ది కనీసం 30,000 మందికి ఉపాధి అవకాశాలను కల్పించాలని భావిస్తోంది.
దీనికి అనుగుణంగా ఐదేళ్ల పాటు అమలులో ఉండే ముసాయిదా డ్రోన్ పాలసీని రూపొందించింది. ఈ నెల 22, 23 తేదీల్లో జరిగే జాతీయ డ్రోన్ సమ్మిట్‌లో దీనిపై చర్చించనుంది. దేశీయ డ్రోన్ మార్కెట్ రాబోయే నాలుగేళ్లలో 22.65 శాతం పెరుగుదల చోటుచేసుకునే అవకాశం ఉందని దాన్ని అందిపుచ్చుకునేలా ఈ రంగాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ శాఖల్లో డ్రోన్ సేవలను విస్తృతపరచడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో డ్రోన్ సిటీని అభివృద్ధి చేయనుంది.
సరికొత్త డ్రోన్లు ఆవిష్కరించిన 'విజయవాడ' విద్యార్థులు - అమరావతి డ్రోన్ సమ్మిట్‌కు సిద్ధం
మంగళగిరిలో అమరావతి డ్రోన్ సమ్మిట్ - ఏపీని డ్రోన్స్ క్యాపిటల్‌గా మార్చాలని నిర్ణయం!