Charges Against Three IPS Officers Andhra Pradesh : ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన ముగ్గురు ఐపీఎస్ అధికారులపై అభియోగాలు మోపిన రాష్ట్ర ప్రభుత్వం వాటిపై 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా లేదా నేరుగా సంబంధిత అధికారి ఎదుట వాదనలు వినిపించాలని ఆదేశించింది. నమోదు చేసిన అభియోగాలకే వాదనలు పరిమితం కావాలని తెలిపింది. నిర్దేశిత గడువులోగా వాదనలు వినిపించకపోతే ఇప్పటికే తమ వద్ద ఉన్న వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ కేసు విచారణలో రాజకీయ నాయకులతో లేదా ఇతరులతో ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దని సిఫార్సులు చేయించకూడదని వివరించింది. అలా చేస్తే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.
పల్నాడు జిల్లా ఎస్పీగా బిందుమాధవ్ శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమయ్యారని దీంతో పోలింగ్ రోజున అల్లరిమూకలు 15 ఈవీఎంలను ధ్వంసం చేశాయని రాష్ట్ర ప్రభుత్వం తన అభియోగంలో పేర్కొంది. ఆ ఒక్కరోజే జిల్లాలో 20 హింసాత్మక ఘటనలు జరిగాయంది. తగినంత మంది పోలీసులు, భద్రతా సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ ఎస్పీ హింసను ఆపలేకపోయారన్న ప్రభుత్వం పోలింగ్ మర్నాడు రాళ్లు విసరడం, ఆస్తుల విధ్వంసం వంటి ఏడు తీవ్రమైన హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. విధి నిర్వహణలో వృత్తిపరమైన నిబద్ధత ఎస్పీ బిందుమాధవ్ కనబర్చలేకపోయారని అభియోగం మోపింది.
అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దర్ ఈ నెల 13, 14 తేదీల్లో తాడిపత్రిలో చెలరేగిన హింసాకాండను అరికట్టడంలో విఫలమయ్యారని అభియోగం మోపిన రాష్ట్ర ప్రభుత్వం రెండురోజుల పాటు ఇరువర్గాలు రాళ్లు విసురుకోవడం, పోలీసు వాహనాలు ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. ఈ హింసాకాండలో పోలీసులకూ గాయాలయ్యాయని రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ అనుచరులతో తాడిపత్రిలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించినా పట్టించుకోలేదని తప్పుబట్టింది. భద్రతాసిబ్బందిని ఎస్పీ సరిగా వినియోగించుకోలేకపోవడంతో విధ్వంసం చోటుచేసుకుందని పేర్కొంది.
తిరుపతి ఎస్పీగా కృష్ణకాంత్ పటేల్ హింసాత్మక ఘటనల నివారణకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోలేదని ప్రభుత్వం అభియోగం మోపింది. చంద్రగిరిలో గత ఎన్నికలప్పుడూ హింస చెలరేగిన విషయం తెలిసినా ఎస్పీ అప్రమత్తంగా వ్యవహరించలేదని తప్పుబట్టింది. పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ అభ్యర్థి వాహనాన్ని టీడీపీ వాళ్లు తగలబెట్టారని మర్నాడు తిరుపతిలో టీడీపీ అభ్యర్థిపై వైఎస్సార్సీపీ వర్గీయులు దాడి చేశారని పేర్కొంది. అభ్యర్థి భద్రతా సిబ్బంది గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారని వెంటనే ఇరు పార్టీలవారూ పెద్దసంఖ్యలో చేరుకుని రాళ్లు విసురుకున్నారని గుర్తుచేసింది. 144 సెక్షన్ విధించినా ఇలాంటి ఘటనలు జరిగాయంటే నిఘా వైఫల్యమే కారణమని ప్రభుత్వం పేర్కొంది.
వైఎస్సార్సీపీ కనుసన్నల్లో అరాచక 'చైతన్యం' - DSP Chaitanya Violence