CHANDRABABU PRAJA GALAM MEETING: పామర్రు ప్రజాగళం సభలో రైతు కూలీలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రత్యేక హామీని ప్రకటించారు. రైతు కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు, రైతు కూలీల సంక్షేమం కోసం కూటమి పని చేస్తుందని స్పష్టం చేశారు. రైతును రాజుగా చేయడమే తన ఆలోచన అని తేల్చిచెప్పారు. రైతులకు ఈ ప్రభుత్వం నీళ్లు అందివ్వలేకపోతోందని మండిపడ్డారు. పోలవరం పూర్తి చేయడం, నదుల అనుసంధానం, కృష్ణా డెల్టాకు మూడు పంటలకు నీళ్లందించాలన్నది తన కోరిక అని వివరించారు. పోలవరం ప్రాజెక్టులో తాను నీళ్లు పారిద్దామనుకుంటే, జగన్ కన్నీళ్లు పారిస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రజల భవిష్యత్తుకు నాదీ గ్యారెంటీ: రాష్ట్ర ప్రగతి కోసం వచ్చే ఎన్నికల్లో ఏకపక్షంగా ఎన్డీఏ కూటమికి ఓటేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర సంపద దోచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు నాదీ గ్యారెంటీ అని హామీ ఇచ్చారు. పేదరికం లేని సమాజం చూడాలన్నది ఎన్టీఆర్ ఆశయమన్న చంద్రబాబు, ఆయన పుట్టిన పుణ్యభూమి సాక్షిగా పేదరికం లేని సమాజాన్ని కూటమి ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు.
గుంతలు పూడ్చలేరు కానీ 3 రాజధానులు కడతారంటా: ప్రజలు కోరుకునే సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు అందించేది ఎన్డీఏ కూటమే అని చెప్పారు. జగన్ గంజాయి బ్యాచ్ రాష్ట్రంతో పాటు అమరావతినీ నాశనం చేసిందని మండిపడ్డారు. రివర్స్ పరిపాలనతో ప్రజల జీవితాలను జగన్ రివర్స్ చేశాడని దుయ్యబట్టారు. ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీలతో మన యువతను అనుసంధానం చేసి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు వచ్చేలా పరిశ్రమలు తెస్తామన్నారు. అవసరమైతే పామర్రులోనే ఐటీ టవర్ కడతామని చెప్పారు. అమరావతి రాజధానిగా ఉండి ఉంటే కృష్ణా జిల్లాలో భూములకు విలువ వచ్చేదని చంద్రబాబు తెలిపారు. రోడ్ల మీద గుంతలు పూడ్చలేరు కానీ 3 రాజధానులు కడతారంటా అంటూ ఎద్దేవా చేశారు.
వైసీపీ ప్రభుత్వం పిల్లలను, యువతను గంజాయి బారిన పడేలా చేస్తోందని ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా అనే తులసీవనంలో ఇప్పుడు గంజాయి మొక్కలు మొలిచాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులకు, దాడులకు మంత్రి పదవులు దక్కుతున్నాయని, ప్రజలు కోరుకునేది బూతులు, దాడులు కాదని చెప్పారు. సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి అనేదే తమ విధానమని స్పష్టం చేశారు.
కౌరవ మూకను మే 13న అన్ని వర్గాలు ఏకమై తరిమికొట్టాలి : చంద్రబాబు - YCP Leader Misbehavior of Women
త్యాగాలు చేసిన వాళ్లను గుండెల్లో పెట్టుకుంటా: పొత్తు ధర్మంలో భాగంగా కొనకళ్ల, దేవినేని ఉమాలకు టిక్కెట్ ఇవ్వలేకపోయానని చంద్రబాబు చెప్పారు. తన నిర్ణయానికి కొనకళ్ల ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదని తెలిపారు. టిక్కెట్ ఇవ్వలేకపోయినా దేవినేని ఉమ సైనికుడిలా పని చేస్తున్నారని కొనియాడారు. ఇలాంటి వాళ్లని తాను మరువలేనన్నారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన వాళ్లను గుండెల్లో పెట్టుకుంటా అని స్పష్టంచేశారు. వైసీపీలో పార్థసారథి ఇమడలేకపోయారని తెలిపారు. జగన్‌కు డబ్బున్నోళ్లు, గంజాయి బ్యాచ్ కావాలని, తెలుగుదేశంకి మంచి వాళ్లు కావాలని పేర్కొన్నారు. గుడివాడలో గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎక్కువయ్యాయని, ఆడపిల్లలను వేధిస్తున్నారని మండిపడ్డారు. గంజాయి బ్యాచ్‌పై ఫిర్యాదు చేస్తే బాధితుడిపైనే కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్ల కుమార్ రాజా కంటతడి: పామర్రు ప్రజాగళం సభలో నియోజకవర్గ అభ్యర్థి వర్ల కుమార్ రాజాను తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరిచయం చేశారు. ఆ సమయంలో వర్ల కుమార్ రాజా కంటతడి పెట్టుకున్నారు. వర్ల కుటుంబం పార్టీకి కష్టకాలంలో అండగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. భావోద్వేగంతో వర్ల కుమార్ రాజా కన్నీళ్లు పెట్టుకున్నారు. వైసీపీ ఇచ్చే ఎంపీ సీటు వద్దని బాలసౌరీ బయటకొచ్చేశారని చంద్రబాబు చెప్పారు. కుమార్ రాజాకు కోట్లు లేవు.. వేసుకునే కోటూ లేదని.., కానీ తాను వర్ల రాజాకే దండ వేశానని తెలిపారు.
రాష్ట్రం దివాలా తీసినా బాగు పడింది ఒక్క జగన్ మాత్రమే: చంద్రబాబు - Prajagalam Public Meeting