Chandrababu Oath Ceremony As Andhra Pradesh CM : ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయన చేత ప్రమాణం చేయించారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబును ఆత్మీయ ఆలింగనం చేసుకుని అభినందించారు.
Pawan Kalyan Took Oath As AP Minister : అనంతరం ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. కొణిదెల పవన్‌కల్యాణ్ అనే నేను అని ఆయన అనగానే అభిమానుల కేరింతలతో సభా ప్రాంగణం మార్మోగింది. మరోవైపు పవన్ ప్రమాణం చేస్తుండగా ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ప్రేమగా ఆయన్నే చూస్తూ మురిసిపోయారు. ఆ తర్వాత ఏపీ మంత్రిగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ రెండోసారి ప్రమాణం చేశారు. ఆయన ప్రమాణం చేస్తుండగా సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ సంతోషంగా చప్పట్లు కొడుతూ ఆనందం వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్‌ఎండీ ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బి.సి.జనార్దన్‌రెడ్డి, టి.జి.భరత్, ఎస్.సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, రామ్‌ప్రసాద్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ప్రధాని మోదీని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వేదికపై ఉన్న అందరినీ పేరుపేరునా ప్రధాని మోదీ పలకరించారు. ప్రధాని, గవర్నర్‌తో కలిసి నూతన మంత్రివర్గం గ్రూప్ ఫొటో తీయించుకున్నారు. ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు, పవన్‌కల్యాణ్ జ్ఞాపిక అందించారు. వేదికపై మెగాస్టార్ చిరంజీవి, పవన్‌తో కలిసి ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేశారు.
ఏపీలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యానని పేర్కొన్నారు. సీఎంతో పాటు ప్రమాణం చేసిన మంత్రులందరికీ అభినందనలు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏపీ కీర్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని, రాష్ట్ర యువత ఆకాంక్షలు నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు.